నేనుచూసిన గొప్ప కవులలో వయ్య రాజారాం ఒకరు. నిస్సందేహంగా తెలుగు కవిత్వ రంగంలో అతనొక సునామీ. గ్రామం దేవరుప్పల. జిల్లా ఆనాడు నల్లగొండ. ఈనాడది వరంగల్. పుట్టింది మాత్రం అక్కడ. కాని పెరిగింది పోరాటాల పురిటిగడ్డలో. బాల్యంలో మాత్రమే తల్లిదండ్రుల చెంత పెరిగాడు. కౌమారం అంతా ఉద్యమాలలోనే. పద్నాలుగేళ్లకే ఆంధ్ర మహాసభలకి మారుపేరైన ‘సంగం’లో సభ్యుడు. సభ్యత్వం కోసం అణా పైసలు సంపాదించడానికి కొన్ని రోజులు కూలీగా పనిచేశాడు. అప్పటికే అతని తండ్రి వయ్య ముత్తయ్య కూడా సంగం సభ్యుడే. ఐతే ఇద్దరి దారులు వేరువేరు. ఒకరు బాలసంఘం సభ్యులు. మరొకరు పార్టీ సభ్యులు. ఐనా రాజారాం పిల్లవాడిగా ఉంటూనే పెద్దలతోపాటుగా పనులు చేశాడు. నూనూగు మీసాల కల్లంత దూరానే పార్టీ పనులలో మునిగిపోయాడు. విసునూరి దొరవారి ఆగడాలు మితిమీరిపోయాయి. అతని కొడుకు బాబుదొర గడీ బయటకు వచ్చాడంటే పదిమంది హిట్లర్‌ల క్రూరత్వం వికటాట్టహాసం చేసేది. కనుపించిన శరీరంపై బెత్తం దెబ్బలు. వంగి దండం పెట్టకుంటే వాడిపై రాతి బరువులు. సంగంలో చేరిన వారిపై వీపు దెబ్బలు. రాజారాం ఊరు విడిచి వెళ్లకపోతే బతికేవాడు కాదు. పిన్న వయసులోనే రహస్య జీవితం గడపవలసి వచ్చింది. ప్రజల బాధలు చూసి విపరీతంగా చలించిపోయాడు. వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడ్డాడు. తెగింపు లేకుండా ప్రజలను కాపాడలేమని భావించాడు. శ్రమజీవి వర్గాల మీద దొరల ఆగడం పెరిగిపోయింది. మంగలివాడైన దొడ్డి కొమురయ్య విసునూరి దొర తల్లి జానకమ్మ పెట్టే బాధలు తాళలేకపోయాడు. ఆమె బంట్లుఅయిన కృష్ణారెడ్డి, మసికినలి ప్రజలతో వెట్టి చాకిరి చేయించారు. అదనపు శిస్తులు వేసి డబ్బులు కట్టాలని వేధించారు. గత్యంతరం లేక అందుకు ఉద్యమించిన వారిపై కాల్పులు జరిపారు. కళ్లతో ఆ దృశ్యాల్ని చూసిన రాజారాం పళ్లు కొరికాడు. ప్రజలను పీడించే దొరల భరతం పట్టాలని పిడికిళ్లు బిగించాడు.
కాసం నారాయణ, ఎలమరెడ్డి మోహనరెడ్డి, గోలి బాల కృష్ణారెడ్డి, నీలారపు ఎల్లయ్య, జాటోతు థాను వంటివారితో సోపతి చేశాడు. కాలక్రమంలో వారే ఒక దళంగా ఏర్పడ్డారు. ధర్మారంలో జాటోతు థానుని పోలీసులు కాల్చి చంపారు. ఐనా రాజారాం భయపడలేదు.
తెలంగాణ రైతాంగ పోరాటంలోని ప్రతి దశలో తామర తంపరగా పాటలు వెలువడ్డాయి. ఆ పాటలు ప్రజలను అక్కున చేర్చుకున్నాయి. అవి వారి విశ్వాసాన్ని పెంచిన విషయం గుర్తించాడు. అంతే తాను కవి అయ్యాడు కవిత్వం అతని గళంలోంచి కాదు. కర చరణాల్లో తాండవమాడింది. రాజారాం కదిలితే సంగీతం కురిసింది. ఆనాటి పరిస్థితుల్లో కేవలం పాటలొక్కటే సరిపోవడంలేదు. విసునూరి పెట్టిన కష్టాలు, ప్రజల ప్రతిఘటన, పోరాటం వంటి అంశాలు చెప్పడానికి కథ కావాలి. పాట పెరిగి బుర్రకథ అయింది. ఒగ్గుకథ అయ్యింది. పది నిముషాల పాట మూడు గంటల ప్రదర్శన అయ్యింది. కళా రూపానికి సంగీతం ప్రాణం. సంగీత వాద్యం గళానికి తోడైంది. తంబూర, డికీలు, తాళాలు, గజ్జెలు ఉంటేనే బుర్రకథ. రాజారాం అప్పటికప్పుడు ఇద్దరు వంతలతో బుర్రకథ దళం ఏర్పాటు చేశాడు. అతని ప్రదర్శనలు తెలంగాణ అంతటా మారుమోగాయి. ఐతే రానురాను పరిస్థితులు విషమించాయి. ఆహార్యం, సంగీత వాద్యాలు వేదిక వంటివి అప్పటికప్పుడు దొరకడం దుర్లభమైంది. అందుకే ఒగ్గుకథని బుర్రకథకి ప్రత్యామ్నాయంగా తీసుకోవాల్సి వచ్చింది. ఒగ్గుకథ అయితే కట్టుకున్న ధోవతిని మార్చి, వేసుకున్న అంగీని విప్పితే చాలు. ఓ చేతిలో కర్ర, మరో చేతిలో చిన్న ఒగ్గు వాద్యం. కాళ్లకు గజ్జెలు సులభీకరించిన ఆహార్యంతో, ప్రజలకు చిరపరిచితమైన బాణీలతో ప్రదర్శన సాగేది. ఒగ్గుకథ రాజారాంకి మారుపేరైంది. వందలాది ప్రదర్శనలు ఇచ్చాడు. ఐతే తన రహస్య జీవితానికి కళా ప్రదర్శనని తోడు చేసుకున్నాడు. ఎక్కడా తన పేరు, బృందం పేరు చెప్పుకోలేదు. ప్రజలకు ఆనాటి, తక్షణ శిక్షణలో భాగంగా సాంస్కృతిక ప్రదర్శన ఉండాలని భావించాడు. ప్రతి ప్రదర్శనని ఒక శిక్షణ తరగతిగా మార్చిన ఘనత రాజారాందే. ఈ విషయం పార్టీ చెప్పింది కాదు. తనకు తాను స్థానిక అవసరాలరీత్యా గుర్తించి అమలు చేశాడు. అందుకే కళాకారునిగా తనకు పేరు ప్రఖ్యాతులు కావాలని ఏనాడూ ఆశించలేదు. అప్పటికే తెలుగు సాహిత్య రంగం కీర్తిప్రతిష్టల ఊబిలో కూరుకుపోయింది. సంస్థలలో, పార్టీ పత్రికలలో తమ తమ కవులను నిస్సిగ్గుగా ప్రమోట్ చేసుకుంటున్నాయి. పోరాట పార్టీలకు కూడా ఆ జాడ్యం అంటింది. బ్రాహ్మణీయ ఆధిపత్య వర్గాలకు చెందిన కవుల ముందు శ్రమజీవి కవులు కనుపించలేదు. వర్గ దృక్పథం రాజకీయ (్భపోరాటాల) ఉద్యమానికే పరిమితమైంది. భావ విప్లవానికి పునాది అయిన ప్రజా కళా సాహిత్య రంగానికి అన్వయింపు జరగలేదు. శ్రమ జీవి వర్గ కవులను ప్రచారం కోసం మాత్రమే ఉపయోగించుకున్నారు. ప్రచారానంతరం వాళ్లు కరివేపాకులయ్యారు. శిష్ట కవులను (గురజాడ, కందుకూరు, శ్రీశ్రీ వంటివారు) ఫోటోలు పెట్టి పూజించారు. వాళ్ల ముందు ఈ దిక్కుమాలిన ప్రజాకవుల పేర్లు వల్లించడానిక్కూడా పనికిరాలేదు.
‘పోతుందీ దోపిడి రాజ్యం/వస్తుంది పేదోల్ల రాజ్యం’ అని పదహారో ఏట పాటపాడి ప్రజారాజ్య పోరాటానికి తన గళాన్ని అంకితం చేసాడు. అలాంటి రాజారాంకి వయసులేదని పార్టీ సభ్యత్వం నిరాకరించింది. కాని మిర్జా ఇస్మాయిల్ ఆర్డర్‌తో పిన్న వాడైన రాజారాంని చంచల్‌గూడ జైలుకి పంపారు. ఆ తర్వాత మూడేళ్లు, జాల్నా (మహారాష్ట్ర) జైలు పాలు చేశారు. అందరికన్నా చివరన 1954లో విడుదలయ్యాడు. బయటవుంటే పసివాడని చూడకుండా దొర గుండాలు నిర్దాక్షిణ్యంగా హత్య చేసేవారు. పాట, శ్రమ జీవుల అండ ఉన్న రాజారాం ఒక మందు పాతర. అలాంటి కవి రహస్య జీవితం గడుపుతూ ఇంటికి వచ్చి అర్ధరాత్రి తల్లి ఇచ్చే జొన్న రొట్టె తిని కడుపు నింపుకున్నాడు. ఆ తర్వాత దేశానికి స్వాతంత్య్రం వచ్చాకే, పోరాటం మధ్యలో ఆపేశాక అంతకు ముందు ఏదో విధంగా నడిచిన సంసారం ఇప్పుడు దారిద్య్రంతో బాధపడింది. పేదల రాజ్యం కోసం పోరాడిన రాజారాం మరింత పేదగా జీవితం గడపవలసి వచ్చింది.
1979లో దేవరుప్పలలోని అతని ఇంటికి వెళ్లి కొన్ని పాటలు సేకరించాను. ఆనాడు చూసిన దృశ్యం ఇంకా కడుపులో దేవినట్లుగానే ఉంది. కుక్కిమంచంలో ఆ ఆజానుబాహుడు దైన్యంగా ఎటో చూస్తూ ఆలోచిస్తున్నాడు. ‘పట్నంనుంచి ఎవరో వచ్చిండ్రు నాయనా’ అని అతని చిన్నకూతురు చెప్పినా వినలేదు. నాలాగా ఎందరో అతని ఇంటికి వచ్చారు. పార్టీ లీడర్లయితే మరీ. వచ్చిన వారందరికీ ఇంత తిండిపెట్టి పంపేవాడు. ఇవ్వాళ అతనికే గతి లేకుండాపోయింది. సగం దినం వరకు అన్యమనస్కంగానే ఉన్నాడు. గతం గురించి పెదవి విరిచాడు. చాలా పెద్దషాక్‌కి గురయినట్లు అనిపించింది. కానైతే అతను పాడిన ఏడుపాటలు కొద్ది గంటల్లో రికార్డు చేసుకున్నాను. సుమారు నాలుగు వందల పాటలు కట్టిన రాజారాం నాలుకపై కొన్ని పాటలే నిలిచాయి. అవి కూడా అతనితోపాటు పనిచేసిన మిత్రులు జ్ఞాపకం చేయగా మాత్రమే పాడాడు.
ఉదయం తొమ్మిది గంటలకు వాళ్లింటికి పోతే తర్జన బర్జనలతో మధ్యాహ్నం మూడు గంటలకి సొట్టలుపోయిన రాతెండి కంచంలో ఉప్పేసి దంచిన పచ్చి మిరపకాయల పచ్చడితో అన్నం పెట్టారు. అప్పుడుగాని అతని పరిస్థితి ఏమిటో అర్ధమైంది. కారం కొట్టిందనే మిషతో పదే పదే కన్నీళ్లు తుడుచుకున్నాను. ఎంత ఏడ్చినా బాధ కడుపులో సుళ్లు తిరుగుతునే ఉంది.
ఒక మహాకవి, ప్రజాకవికి అతిథిగా అతనితో మాట్లాడుతున్న ఆనందం కన్నా అతని పేదరికం ఎంతో బాధించింది. మెల్లిమెల్లిగా కప్పుకున్న తెలుగు సాహిత్యం స్వభావం పొరలు విప్పుకున్నాయి. రాజారాం అంటరానివాడు. పోరాటంలో అలాంటి ఆలోచన ఉండేదో లేదో ఎవరికీ తెలియదు. కాని పోరాటం ఆగిపోయాక, అతడు తిరిగి తన ఇంటికి చేరాక తిరిగి అంటరాని వాడుగానే మిగిలాడు. మాల కులంలో పుట్టి, మాలామెను పెళ్లాడి ముగ్గురు మాలపిల్లలను కన్నవాడు మాలవాడు కాక మరేమవుతాడు. పైగా దారిద్య్రం. అలాంటి వాడిని కవి అని ఎవరు అంటారు. అనగలిగిన పార్టీకి గురజాడలే కనుపిస్తారు కదా.
1988లో ‘తెలంగాణ రైతాంగ పోరాటం ప్రజాసాహిత్యం’ పుస్తకంలో రాజారాం గురించి రాశాను. 1986లో ఆంధ్రభూమి ఆదివారం సంచికలో రాశాను. అతని పాటలు ఎన్నో సంకలనాల్లో వచ్చాయి. దేశంలో విప్లవ పోరాటాలు కొనసాగుతున్నాయి. అటు దళిత సాహిత్యోద్యమం కాని, ప్రజాసాహిత్య సంస్థలు గాని, తెలంగాణ ప్రాంతీయ సాహిత్యవాదులు గాని వయ్య రాజారాం ఎవరు, అతని చరిత్ర ఏమిటని అనే్వషించిన పాపాన పోలేదు. ఇందుకు కారణం ఏమై ఉంటుంది? దీనికి జవాబు లభించిననాడు ప్రజాకవులకి న్యాయం కలుగుతుంది. వయ్య రాజారాం నిస్సందేహంగా తెలుగు మహాకవి. తెలంగాణా ప్రజాకవి. సాహిత్య చరిత్రలో తగిన స్థానం కల్పించలేకపోయిన మా చేతగాని తనాన్ని మన్నించమని కోరడం తప్ప ఏం చేయగలం.
తొవ్వ ముచ్చట్లు
english title:
thovva
Date:
Sunday, May 19, 2013