శత్రువు మించిన గొప్ప సంస్కర్త ఉండడు. తెల్లని బియ్యంలో నల్లని రాళ్లను తీసినట్టు, ‘ఒప్పుల’ కుప్పలాంటి మన జీవితంలోంచి ‘తప్పుల’ను ఏరి ఇస్తాడు. ఈ పని మిత్రులవల్ల కాదు.
వ్యక్తి విషయంలోనే కాదు. సంస్థ విషయంలోనూ, ఒక పార్టీ విషయంలోనూ ఇదే నిజం.
ఏ రాజకీయ పార్టీ అయినా బాగుపడాలి అంటే, అది శత్రుపక్షం మీద ఆధారపడి ఉంటుంది. ఈ మధ్యకాలంలో కొన్ని పార్టీలు అలా బాగుపడిపోతున్నాయి. ఒక పార్టీమీద శత్రుపక్షం ఇంత ప్రేమ చూపిస్తుందంటే, నాటకం అనుకునే వాళ్లం. కానీ అది నాటకం కాదూ, ‘కర్ణాటకం’ అని బోధపడిపోయింది.
అయిదేళ్ల క్రితం యెడ్యూరప్ప నాయకత్వంలోని కర్ణాటక బీజేపీ, కర్ణాటకలోని కాంగ్రెస్‌కు బద్ధశత్రువు. కాంగ్రెస్‌ను ఓడించేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేసింది. ఇప్పుడు ఆయన ఎంత మేలు చేసి పెట్టాడో చూడండి. బిజెపీ నుంచి బయటకు వచ్చాడు కానీ, కాంగ్రెస్‌లో చేరలేదు. వేరే పార్టీ (కర్ణాటక జనతాపార్టీ) పెట్టారు. ‘అవినీతి ఆరోపణల’ ముద్రను తన మీదా, తన మాతృసంస్థ (బీజేపీ) మీద మాత్రమే వేసి కాంగ్రెస్‌ను గెలిపించారు. ఇంత మేలు కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీలోని ఏ వ్యక్తి అయినా చేయగలరా?
యెడ్యూరప్ప మేలు ఇక్కడితో ఆగలేదు. అది కాంగ్రెస్ తప్పుల్ని ఎత్తి చూపింది. ‘అవినీతి ముద్ర’ వున్న వాళ్ల గతి కేవలం కర్ణాటకలోనే ఇలా వుంటే, దేశం మొత్తం మీద ఎలా ఉంటుంది? ఈ ప్రశ్న నోటితో కాకుండా ఆయన ‘వోటు’తో వేయించాడు. అంతే కేంద్రంలో కాంగ్రెస్ తన తప్పును తాను తెలుసుకుంది. వెంటనే ‘తాజా కళంకితుల’యిన (పాత కళంకితులు ఎవరికి గుర్తుంటారు లెండి!) ఇద్దరు కేంద్ర మంత్రుల చేత రాజీనామా చేయించింది.
ఇలా కాంగ్రెస్‌ను సంస్కరించే పనిని కర్ణాటకలో యెడ్యూరప్ప ఎలా వేసుకున్నారో, మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ శత్రుపక్షం భుజానవేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో ‘కళంకితులయిన’ వారిలో ‘ఆలీబాబా’ లాంటి అధినాయకుడు ఉన్నాడో, లేదో తెలియదు కానీ, ‘అరడజను మంత్రులు’ మాత్రం ఉన్నారు. సిబిఐ శోధనలో ఏకంగా ‘్ఛర్జిషీట్’ వరకూ వీరిలో కొందరొచ్చేశారు. అయినా సరే సచివులుగా ఉండి సర్కారును చక్కబెట్టేస్తున్నారు. కాంగ్రెస్‌లోపల వున్న నేతలు ఎన్నో మార్లు ఈ విషయాన్ని పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లి ఉంటారు. అయినా ప్రయోజనం లేకపోయింది.
ఈ తరుణంలో కాంగ్రెస్‌ను బాగుచేసే బాధ్యతను శత్రుపక్షమే స్వీకరించాలి. అందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సిద్ధమయిపోయారు. ఈ ఆరుగుర్నీ మంత్రివర్గంనుంచి తొలగించాలని గవర్నర్‌కు నివేదించారు. అంతేకాదు, వారికి ఉద్వాసన పలికేవరకూ, ఉద్యమిస్తానని శపథం చేశారు. ఇప్పుడు నిజంగానే కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్రంగా ఆలోచించవచ్చు. కేవలం ‘బాబు’ అడిగారు కాబట్టి-తీసేసామన్న మాట రాకుండా-ఏదో తరుణోపాయం ఆలోచించి తప్పు దిద్దేసుకుంటారు.
తెలుగుదేశం తప్పుల్ని కూడా వీలున్నప్పుడు కాంగ్రెస్ కూడా దిద్దిపెట్టవచ్చు. అలాగే శత్రుపక్షంగా నిలిచి కూడా 2008 అసెంబ్లీ ఎన్నికల్లో పట్టుమని డజను సీట్లు తెచ్చుకోలేకపోయిన టీఆర్‌ఎస్ పార్టీని కూడా సంస్కరించాలని వైఎస్ మరణానంతరం అప్పట్లో కాంగ్రెస్ కంకణం కట్టేసుకుంది. ముందు తెలంగాణ ఇస్తానని ప్రకటన చేసి, తర్వాత ‘తూచ్’ అనేసింది. దాంతో టీఆర్‌ఎస్ నేలకు కొట్టిన బంతిలా పైకి లేచింది. ఎన్నికలలో సోలిపోయినా, ఉప ఎన్నికలలో పైకి లేచింది.
నరేంద్రమోడీ బీజేపీ తరఫున ప్రచారం చేస్తే కొన్ని చోట్లే వస్తాయి కానీ అన్నిచోట్లా వోట్లు రాలవని ‘మిత్రుడు’ చెబితే బీజేపీ వినలేదు. ఎన్డీయే భాగస్వామి, బీజేపీకి అనుంగు మిత్రపక్షమైన జెడి(యు) నేత నితిష్‌కుమార్ ఈ విషయాన్ని చెప్పి చూద్దామని చాలా ప్రయత్నించాడు. కేవలం తాను పాలించే రాష్ట్రం (బీహార్) వరకూ మోడీని ప్రచారం చేయకుండా అడ్డుకోగలిగాడు. కానీ శత్రుపక్షం రుజువు చేశాక-ఇప్పుడు నమ్మాల్సి వస్తుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలప్పుడు మోడీ ప్రచారం చేసిన ఆరు నియోజకవర్గాల్లో శత్రుపక్షం వారు గెలిచారు. ఇప్పుడర్ధమయింది కొన్ని రాష్ట్రాలలో మోడీ ప్రచారం వల్ల ఎంత లాభం ఉంటుందో, కొన్ని రాష్ట్రాలలో అంతే నష్టం ఉంటుంది.
నీతయినా, రాజనీతయినా-మిత్రుడు నుంచి నేర్చుకునేది తక్కువే. శత్రువే ఎక్కువ నేర్పుతాడు. అందుకే అసలు మిత్రులే లేకుండా మనగలగవచ్చు కానీ, కనీసం ఒక్క శత్రువు కూడా లేకుండా బతికి బట్ట కట్టడం సాధ్యం కాదు. కొన్ని పార్టీలను ఎవరూ శత్రుపక్షంగా భావించరు. ఉదాహరణకు రాష్ట్రంలో ‘లోక్‌సత్తా’ ఉంది. ఆ పార్టీమీద విరుచుకుపడాలని ఎవరికీ అనిపించదు. అందుకని ఆ పార్టీ ఒక్క సీటుకే ఎందుకు పరిమితమైందో ఆ పార్టీనేతకు అర్ధమయ్యేలా చెప్పటానికి ఏ శత్రుపక్షమూ లేదు!
శక్తి ఉన్న పార్టీకే శత్రుత్వమూ ఉంటుంది!
తకిట తకిటక..
english title:
takita.. takitaka
Date:
Sunday, May 19, 2013