గోవును గోమాతగా భావిస్తూ, హిందువులు దేవతగా ఆరాధిస్తారు. ఈ గోవులను పరిరక్షించేందుకు అనేక సంస్థలు అనునిత్యం ఉద్యమాలు కూడా చేస్తుంటాయి. అయితే గోమాతల చింతలు మాత్రం తీరడం లేదు. నోరులేని మూగజీవాలను ఆదుకోవడంలో ఏ మాత్రం శ్రద్ధ చూపడం లేదు. అది మా బాధ్యత కాదు అంటూ బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న వారు చెబుతున్నారు. కేవలం మానవీయ కోణంలోనే గోవుల రక్షణకు చర్యలు తీసుకుంటున్నామే తప్ప అది తమ బాధ్యత కాదని నేరుగా మంత్రివర్యులు రామచంద్రయ్యే ప్రకటించడం చూస్తే ఇక అధికారులు ఎంతవరకు నిబద్ధతతో పనిచేస్తారో తెలిసిపోతోంది. గోమాతను ఇక దేవుడే రక్షించాలి!
- సూర్యనారాయణ
లైవ్ భయం..!
ఎలక్ట్రానిక్ మీడియా అంటే ఎవరైనా వణికిపోతారు. కానీ ఈ మధ్య అలాంటి ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు సైతం లైవ్‌గా మాట్లాడాలంటే ఎందుకొచ్చిన సమస్యరా బాబూ అనుకుంటున్నారు. న్యూస్ చానల్స్ వచ్చిన కొత్తలోనో, ఉద్యోగంలో చేరిన కొత్తలోనో లైవ్‌లో మాట్లాడేందుకు బెరుకు ఉండడం సహజమే కానీ కొమ్ములు తిరిగిన సీనియర్లు సైతం ఇప్పుడు వణికిపోతున్నారు. మాజీ జర్నలిస్టు ఒకరు కోపంతో తన బాస్‌ను లైవ్‌లో చెప్పుతో కొట్టారు. హైదరాబాద్‌లో అసెంబ్లీ, సెక్రటేరియట్, పార్టీ కార్యాలయాల నుంచి లైవ్‌గా మాట్లాడడం అంటే వేరు. కానీ జిల్లాల్లోనో, ఏదో సమస్యపై రోడ్డుమీద లైవ్‌గా మాట్లాడితే పాత కక్షలతో ఎవడు ఎటు నుంచి వచ్చి దాడి జరుపుతాడో అని కంగారు పడుతున్నారు. అందరికీ జోస్యం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు అందరినీ భయపెట్టే మేమే ఇప్పుడు భయపడాల్సి వస్తోందని వాపోతున్నారు.
- మురళి
హరీశ్ స్థాయి అంతేనా?
టిఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావుపై ఆ పార్టీ బహిష్కృత నేత రఘునందన్‌రావు చేసిన ఆరోపణలను టిఆర్‌ఎస్ చాలా తేలికగా తీసుకుంది. ఒకరకంగా రఘునందన్‌రావు చేసిన ఆరోపణల వల్ల హరీశ్‌రావు ఇమేజి పెరిగిందని టిఆర్‌ఎస్ నేతలు చెప్పుకొచ్చారు. బడా పారిశ్రామికవేత్తలను బెదిరించి కోట్ల రూపాయలు వారి నుంచి టిఆర్‌ఎస్ నేతలు వసూలు చేస్తుంటారని గతంలో ఆ పార్టీ నుంచి బయటికి వచ్చిన నేతలు, సమైక్యాంధ్ర నేతలు తీవ్ర ఆరోపణలు చేసేవారు. కానీ హరీశ్‌రావుపై రఘునందన్‌రావు చేసిన ఆరోపణలో పద్మాలయా స్టూడియోను బ్లాక్ మెయిల్ చేసి. రూ. 80 లక్షలు తీసుకున్నారని ఆరోపించారు. ఈ రోజుల్లో రూ. 80 లక్షలు అంటే పెద్దగా లెక్కలోకి రాదని, పైగా పద్మాలయా స్టూడియో యజమాని సీమాంధ్రకు చెందిన వ్యక్తి కావడంతో వారి నుంచి డబ్బులు తీసుకోవడాన్ని తెలంగాణ ప్రజలు పెద్ద తప్పుగా పరిగణించరని టిఆర్‌ఎస్ నేతలు సమర్థించుకుంటున్నారు. ఇక తన నుంచి తిరుపతిలో హరీశ్‌రావు డబ్బులు తీసుకున్నారని రఘునందన్‌రావు ఆరోపిస్తే, అవీ కేవలం ఐదు, పది వేలు మాత్రమే, పైగా చేతి ఖర్చుల కోసం తీసుకున్నానని హరీశ్‌రావు చెప్పడం వల్ల, అంత చిన్న మొత్తం కూడా ఆయన దగ్గర లేదంటే, ఆయన నిజాయితీ పరుడేనన్న సంకేతాలను ప్రజలకు ఇచ్చినట్టు అయిందని టిఆర్‌ఎస్ నేతలు సంబర పడుతున్నారు.
- వెల్జాల చంద్రశేఖర్
పదవుల మీమాంస
రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరుగుతాయని విస్తృత ప్రచారం జరుగుతోంది. దీంతో జ్యోతిష్యులు, తలపండిన విలేఖర్లకు డిమాండ్ పెరిగింది. ఢిల్లీకి ముఖ్యమంత్రి కిరణ్, పిసిసి అధినేత బొత్స సత్యనారాయణ వెళ్లి రెండురోజులు మకాం వేయడంతో, టీవీ చానళ్లు, పత్రికలు మంత్రివర్గంలో మార్పులు తథ్యమని విపరీతంగా ప్రచారం చేశాయి. దీంతో మంత్రులు ఎవరికీ వారు స్వాములు, జ్యోతిష్యులను సంప్రదించారు. ఇక పేషీల్లో అడుగుపెట్టే విలేఖర్లతో తలపండిన విలేఖర్లను పిలిచి వ్యక్తిగత మంతనాలు కూడా మంత్రులు జరిపారు. మీ వద్ద ఉన్న సమాచారం ఏమిటి ? మంత్రివర్గంలో మార్పులు తప్పవా? మన పదవి ఉంటుందా? పోతుందా అనే చర్చలు విపరీతంగా జరుగుతున్నాయి. ఇదంతా చూస్తున్న బ్యూరోక్రాట్లు కూడా ప్రభుత్వం మారుతుందా, మంత్రివర్గంలో మార్పులకే పరిమితమా? ఒక వేళ ఇదే జరిగితే తమకు కీలకశాఖలు దక్కుతాయా అనే ఆరాటంలో ఉన్నారు. ఏమి జరిగినా వచ్చే నెల రోజుల్లోపే మార్పులని, ఎన్నికల మూడ్ వచ్చేస్తున్న నేపథ్యంలో తమకు ఏమి జరిగినా ఫర్వాలేదని కొంత మంది మంత్రులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
- శైలేంద్ర
గెలుస్తామా?
కళంకితులకు టికెట్లు ఇచ్చేది లేదు.. ఈ మాట ప్రతి నాయకుడు చెబుతుంటాడు. రాహుల్‌గాంధీ కూడా అదే మాట చెబుతున్నారు. ఈ మాటలు విన్న కాంగ్రెస్ నాయకుడొకరు ఇలా అయితే మా గెలుపు కష్టమే అంటూ వాపోయాడు. అదేంటి అంటే ఏదో రాజకీయం కోసం రాహుల్ ఆ మాట అంటే పరవాలేదు కానీ నిజంగానే దాన్ని ఆచరిస్తే, పార్టీ ఎలా గెలుస్తుంది అని చమత్కరించారు. రానున్న ఎన్నికల్లో కళంకితులకు, నేరస్తులకు టికెట్లు ఇవ్వకూడదని రాహుల్ బల్లగుద్ది చెబుతున్నారు. ఉన్నవాళ్ళు అందరూ ఏదో విధంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలన్న విషయం రాహల్‌కు తెలియాదా అని నాయకులు ప్రశ్నిస్తున్నారు. రాహుల్ ముందుగా గల్లీ రాజకీయాల గురించి తెల్సుకుంటే ఢిల్లీ రాజకీయాలు తర్వాత మాట్లాడుకొవచ్చునని నాయకులు గుర్తు చేస్తున్నారు. రాహుల్ ఇలా రాజకీయ ప్రకటనలు చేస్తూపోతే ప్రత్యర్థి బిజెపి నేత మోడీని ఎట్లా ఎదుర్కొంటారని పార్టీ సీనియర్ నేతలు తలలు పట్టుకొని కూర్చున్నారు.
- సిఎస్ కులశేఖర్‌రెడ్డి