బొడ్డపాటి రాజేశ్వరమూర్తి, మచిలీపట్నం
ఆంధ్రభూమి పత్రిక ఆంధ్రత్వం, తెలుగుదనం, తెలుగు సంస్కృతీ వైభవానికి అద్దం పడుతోంది. ‘సాహితి’లో సమీక్షలు, చర్చావేదిక, వ్యాసాలు, దిగ్గజాల్లాంటి పండితులు ‘్భష’ పై తర్జనభర్జనలతో మాకు ఆనందం కల్గజేస్తున్నారు. కావున మిమ్మల్ని అధికార భాషాధ్యక్షులు (్ఛర్‌మన్)గా ప్రభుత్వం నియమిస్తే ఆ భాష అమలు చేయగల్గుతారని నా విశ్వాసం. ఏమంటారు?
మీరు నా మీద పగబట్టారంటాను.
మీరు తరచూ హిందూ ధర్మ పరిరక్షకులైన పీఠాధిపతుల సరసన కూర్చుని చుక్కల్లో చంద్రుడిలా భాసిస్తున్నారు. ఇచ్చట నాదొక సలహా. దేశభక్తుల చరిత్రలు ధారావాహికంగా వ్రాసిన మీరు, అవధూతలు, హిమాలయాల్లో శత వర్షాలను అధిగమించి జీవిస్తున్న యోగులను గూర్చి వ్రాస్తే అస్మదీయులు ఆనందిస్తారని మనవి. మన్నిస్తారా?
ఎందుకు? మనమే ఒక పీఠం పెట్టేద్దాం.
కొలుసు శోభనాచలం, గరికపర్రు, కృష్ణాజిల్లా
సినిమాల్లో అశ్లీల సాహిత్యాన్ని విమర్శించే పత్రికా సంస్థలు తమదైన వార, మాస పత్రికల్లో స్ర్తి అర్ధనగ్న చిత్రాలను ప్రచురించుట ఎంతవరకు సబబు? అది మీ పత్రికకు మినహాయింపు కాదనుకోండి.
అర్ధనగ్న చిత్రాలన్నీ అశ్లీలం కావు.
ఎం.పాపారావు, బూరగాం, శ్రీకాకుళం జిల్లా
ప్రయివేటుకే నిధుల ధారబోత, ఆరోగ్యశ్రీ పేరిట కార్పొరేట్ ఆసుపత్రులే బాగుపడుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులకు అందిస్తే పేదలకు మెరుగైన వైద్యసేవలు అందేవి కదా! ఇది దేనికి నిదర్శనం?
కోరలు చాచిన మెడికల్ మాఫియాకు... దాని తీవ్రతను గుర్తించని మన అజ్ఞానానికి!
అపర్ణా దీక్షిత్, విజయవాడ
సిక్కుల ఊచకోత దాదాపు మూడు దశాబ్దాల తరువాత తీర్పు వెలువడింది. ‘మేము కూడా దోషులను ఎప్పటికీ వదలం’ అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలకేనా ఈ శిక్షలు? ఎందుకిలాగ? తీర్పులకి దశాబ్దాలు తీసుకుంటారా? ఎక్కడుంది లోపం?
మనం బ్రిటిషు వాళ్ల నుంచి అరువు తెచ్చుకుని, దాని కర్మానికి దాన్ని వదిలేసిన నిరర్థక న్యాయవిధానంలో.
శివాని, శృంగవరపుకోట
కథల పోటీ ప్రకటన రచయితలకు శుభవార్త. గడువు కూడా చాలా బాగా ఇచ్చారు. మరీ సంతోషం. ఎన్ని కథలైనా ఒకరు పంపవచ్చా?
వచ్చు. వాటిలో కాస్త సరుకుంటే మేలు.
కొప్పరపు లక్ష్మీనరసింహారావు, కానూరు, విజయవాడ
‘ఈ కేసు అత్యున్నత న్యాయస్థానంలో ఉన్నది కాబట్టి మీరు ఈ విషయం అక్కడే తేల్చుకోగలరు’ అని క్రింది కోర్టులు తీర్పులు చెబుతున్నపుడు, ఇరువురి వాదనలూ వినటం, తీర్పు వాయిదా వేయటం ఈ తతంగమంతా ఎందుకండీ! ముందే చెప్పేయ్యొచ్చు కదా!
ఆ మాట చెప్పటానికీ బోలెడు తతంగం కావాలాయె!
ఉలాపు బాలకేశవులు, గిద్దలూరు
రోజురోజుకీ మన దేశంలో అరాచక శక్తులు విజృంభిస్తున్నాయి. దీనికి కారణం ఏమిటంటారు?
మనది అరాచక వ్యవస్థ కనక.
విద్యార్థులలో నైతిక విలువలు తగ్గిపోవటానికి కారణాలు ఏమంటారు?
విద్యగరిపే వారిలో నైతిక విలువలు లేకపోవడం.
బి.ఆర్.సి.మూర్తి, విజయవాడ
లోగడ ప్రవేశపెట్టిన ఇందిరా వికాసపత్ర, చిల్డ్రన్స్ గిఫ్ట్ గ్రోత్ స్కీము మధ్యలో ఆగిపోయినయ్. బాబు ప్రతి ఆడపిల్లకు పెళ్లినాటికి రెండు లక్షలు చేతికి అందేటట్లు చేస్తానంటున్నాడు. బాబు ప్రవేశపెట్టిన పథకం తర్వాత ప్రభుత్వాలు కొనసాగించకపోతేనో?
ఆయన కొనసాగిస్తాడన్న నమ్మకం ఉందా?
ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
జ్యోతిషమే నిజమైన శాస్తమ్రయితే మొన్న ఉగాదినాడు ఏ పార్టీ పంచాంగకర్తలు ఆ పార్టీయే రాబోయే కాలంలో పదవిలోకి వస్తుందని ఎలా చెబుతారు?
అది వాళ్ల సొంత పైత్యం. జ్యోతిషానికి సంబంధం లేదు.
ఢిల్లీలో ఓ పసిపాపను అత్యాచారం చేసిన విధం ఆడవాళ్లం కూడా కలసి చర్చించుకోలేక పోయాము. సుష్మా స్వరాజ్ గారన్నట్టు నిందితుణ్ణి ఉరి తీయాలి. ప్రజలందరూ కోరుకునేది కూడా ఇదే. ప్రజాభిప్రాయాన్ని మన్నించడమేగా ప్రజా ప్రభుత్వమంటే. వెంటనే ఉరి తీసేటట్టు చట్టాలు మార్చవచ్చును కదా. మీరేమంటారు?
అది జరగాలంటే మొత్తం న్యాయ విధానానే్న విచారణ క్రమానే్న, సాక్ష్యాల చట్టానే్న మొత్తంగా మార్చాలి. మన బద్ధకస్తుల రాజ్యంలో అది అయ్యేపని కాదు.
జి.నీలంనాయుడు, బర్కత్‌పురా, హైదరాబాద్
తమ దేశంపై దాడి చేసి వేలాది ప్రాణాలను బలి తీసుకున్న లాడెన్ వేట కోసం ఆఫ్గనిస్తాన్‌పై అమెరికా దాడి చేస్తే అమానుషం, అన్యాయం అని కమ్యూనిస్టులు గొంతు చించుకుంటారు. కానీ కమ్యూనిస్టు చైనా 19 కి.మీ. మన భూభాగంలోకి చొచ్చుకొని వస్తే మన కమ్యూనిస్టులకు కళ్లు మూసుకు పోయాయా?
షరా మామూలే!
కాకుటూరి సుబ్రహ్మణ్యం, కావలి
పార్లమెంటుపై దాడి, బొంబాయి అల్లర్లు వీటిలో సూత్రధారులేగాక ముఖ్యపాత్రధారులైన కసబ్, అఫ్జల్‌గురు, గతంలో నేపాల్‌లో భారతీయ విమానాన్ని హైజాక్ చేసిన మరొక పాకిస్తాన్ ముష్కరుడు - వీరందరూ మహా ఘనత వహించిన మంత్రిగారి దృష్టిలో ‘హిందూ’ ఉగ్రవాదులేనా?
ఏమో!
సి.ప్రతాప్, విశాఖపట్నం
ఒక ప్రభుత్వోద్యోగి వంద రూపాయల బిల్లుపై తప్పుడు సంతకం చేస్తే డిపార్ట్‌మెంట్ వివరణలు అడుగుతూ రకరకాలుగా వేధిస్తుంది. మరి ప్రజా ప్రతినిధులు, అవినీతి అధికారులు తప్పుడు నిర్ణయాలు చేసి వేల కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం చేస్తుంటే అడిగేవాడెవడూ లేడు. స్కాం బయటకు వచ్చి హంగామా అయితే గాని వారిపై చర్యలు ప్రారంభం అవవు. కామెంట్ ప్లీజ్!?
అవీ కంటితుడుపు చర్యలే. జనాన్ని జోకొట్టేందుకే.
చదువులు, ప్రాజెక్టులు, కాంపిటీషన్ల పేరిట పిల్లలపై తీవ్ర వత్తిడి కలుగుతోంది. కాస్త స్కూలు టైమింగ్స్ తగ్గించి పిల్లలకు ఆట, పాట నేర్పించండి అంటూ మా పిల్లలు చదివే స్కూలు ప్రిన్సిపాల్‌ను అభ్యర్థిస్తే నన్ను ఎగాదిగా చూసి వెటకారంగా మాట్లాడాడు. ఏమిటీ వైపరీత్యం సార్?
ఆయనా ఆ మాటే అంటాడు!
మహమ్మద్ యూసుఫ్, కాజీపేట, వరంగల్ జిల్లా
25 శాతం మహిళా పోలీసులను నియమించండి అని ఒక పార్టీ నేతలు అంటున్నారు కదా! 25 శాతం ఎందుకూ? 100 శాతం మహిళా పోలీసులనే నియమించమనండి. పసిపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు అఘాయిత్యాలైనా నిరోధించగలం. మీరేమంటారు?
పోలీసుల వైఫల్యానికి కారణాలు వేరు. అందులో ఆడ, మగ తేడా ఉండదు.
ప్రశ్నలు పంపాల్సిన చిరునామా : మనలో మనం, ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక, 36 సరోజినీదేవీ రోడ్, సికిందరాబాద్-500003
e.mail : mvrsastry@gmail.com