ముంబై-కుర్లా రైల్వే స్టేషన్, అహమదాబాద్ రైలు కోసం వేచాం-కొంత దూరంలో పది పనె్నండేళ్ల బాలుడు బూట్ పాలిష్ చేస్తుండేవాడు. ఆ బాలుడు తొడుక్కున్న చొక్కా అతని సైజ్‌కు మించిందైనా శుభ్రంగా ఉండేది. పాలిష్ కోసం వచ్చే బూట్లు, చెప్పులను మొదట పొడిగుడ్డతో శుభ్రం చేసి, దుమ్ము తొలగించిన తర్వాత పాలిష్ వేసి, గరగరా రుద్దుతుండేవాడు. ఆ బాలుని ఏకాగ్రత న న్ను ఆకర్షించింది.
బడికి వెళ్లే వయసులో ఇలా పాలిష్ పని చేపట్టేందుకు బలమైన కారణమేదో వుండాలనుకున్నాను. ఒకమారు ఆ బాలునితో మాట్లాడాలనుకున్నాను. ‘నా చెప్పులకు పాలిష్ వేయి’ అంటూ చెప్పులు ఆ బాలుని ముందుంచాను. ఒకసారి నావైపు చూసి ‘మీ చెప్పులింకా కొత్తగానే ఉన్నాయి. పాలిష్ అవసరం లేదు’ అన్నాడు. నా తోటి ప్రయాణీకులు వారి చెప్పులను పాలిష్ చేయించుకున్నారు.
వాడు పాలిష్ చేస్తుండగా వాడిని గురించిన వివరాలు తెలుసుకోవాలనుకున్నాను. ఆ బాలుని తండ్రి రైల్వేస్టేషన్‌లో కూలీగా ఉండేవాడు. ఆ బాలునితో పాటు అతని అక్క, ఈ బాలుడు, వారి తల్లి ఇళ్లల్లో పాచి పని చేసేవారు. వీలున్నప్పుడు చెత్తకుండీల్లోని ప్లాస్టిక్ పొట్లాలను సేకరించేవారు. అలా బతుకు బండి లాగుతున్నారు. వారిలో ఒక తమ్ముడు చాలా చురుకైన వాడు. మూడో తరగతి చదువుతున్నాడు. వాడ్ని బాగా చదివించి ఆఫీసర్‌గా చూడాలని ఉబలాటపడుతుండేవారు.
ఇదివరలో ఇట్టి కథలు విన్నాను. అయినా వారి పరిస్థితి గమనించి, వారికే విధంగానైనా సహాయం చేయాలనిపించింది. నా పర్సులోని 50 రూపాయలు తీసి ఆ బాలుని ముందుంచి ‘‘బాబూ ఈ పైకంతో మీ ఇంటికేమైనా సామాన్లు తీసుకెళ్లు’’ అన్నాను. అందాకా కళకళలాడుతున్న బాలుని ముఖం తెల్లబోయింది. ‘‘హమ్ బీఖ్ నహి మాంగ్తే సాబ్ హమ్ మెహనత్‌కీ కమాయి ఖాతేహై (మేం బిచ్చమెత్తం కష్టపడి పని చేసి పొట్టపోసుకుంటాం) అంటూ, నేను అతని ముందుంచిన యాభై రూపాయలను వాపస్ చేసాడు. నేను అంతమాత్రాన వదలలేదు. నేను ఇచ్చిన పైకాన్ని తీసుకోరాదని నీకు ఎవరు చెప్పారు?’’ అని అడిగాను. ఆ బాలుడు నావైపు చూస్తూ ‘‘మా నే సిఖాయా హై, చోరీమత్ కర్నా, ఝూట్ నహీ బోల్‌నా, గలత్ కామ్ మత్ కర్‌నా, ఔర్ భీక్ నహీ మాంగ్నా’’- ‘ఏ బోలాహై మేరీ మా నే(మా అమ్మ చెప్పింది దొంగతనం చేయకు, అబద్ధమాడకు, చెడ్డపనులు చేయకు, బిచ్చమెత్తుకోవద్దు) ఇలా చెప్పింది మా అమ్మ’’ అన్నాడు..
కొనే్నళ్ల క్రితం మా వద్ద ఒక కారు డ్రైవర్ ఉండేవాడు. చాలా మంచివాడు. పాతికేళ్ల లోపే వుంటుందతని వయసు. చెప్పిన వేళకు కచ్చితంగా వచ్చేవాడు. ఎంత పనివున్నా నవ్వుతూ చేసేవాడు. ఎంత పరిచయమున్నా అతన్ని గురించి కాస్త అనుమానం ఉండేది. పెద్దలు నాతో మాట్లాడుతూ, ‘‘ఒంటరిగా అతనితో ప్రయాణం చేయకు. రాత్రి ప్రయాణం ప్రమాదకరం. ఎక్కువ చనువుతో ఉండకు’’ అని సలహాలిస్తుండేవారు.
ఒకరోజు అతను హడావుడిగా వచ్చి ‘‘అమ్మా, నాకు దయచేసి వెంటనే పాతిక వేలు ఇవ్వండి. రెండు నెలల్లో వాపసు చేస్తాను. నా తమ్మునికి గల్ఫ్‌లో మంచి ఉద్యోగం దొరికింది. అందుకు డబ్బు కావాలి’’ అన్నాడు.
సరే అంటూ డబ్బులిచ్చాను. రెండు నెలల తర్వాత మరలా వచ్చాడు. అమ్మా నేను డ్రైవర్ పని మానుకుంటాను. నా తమ్ముడున్న చోట నాకూ ఉద్యోగం దొరికింది. నేను రెండు నెలలు పని చేసి మీ డబ్బు మీకు వాపసు చేస్తాను’’ అన్నాడు. ‘ఫరవా లేదు. ఒకవేళ తిరిగి ఇవ్వకపోయినా బాధలేదు. నీకు మంచి జరగాలి. నీ వీలునుబట్టి తిరిగి ఇవ్వచ్చు’’ అన్నాను.
‘‘లేదు లేదు మీ రుణం త్వరలోనే తీర్చగలను. వీలైనంత త్వరగా పైకం పంపిస్తాను’’ అంటూ వెళ్లిపోయాడు.
‘‘ఇట్టి సందర్భాల్లో ఒక సూత్రం పాటించాలి. ఎవరికైనా సహాయం చేసే ముందు మన వద్దనున్నదెంత? అని గుర్తుంచుకోవాలి. మీరు ఇచ్చిన మొత్తం మరలా అందకున్నా చింతించనక్కరలేదు. మనం సహాయం చేయాలి. ఇది దానం అని భావించి మరలా ఇవ్వకున్నా పర్వాలేదు అనుకుని ఇవ్వాలి. ఇందువల్ల వైమనస్యం ఏర్పడదు’’ నేను ఆ సూత్రానే్న పాటించాను.
తర్వాత కథ వినండి. ఆ డ్రైవర్ వెళ్లి నెలలు గడిచాయి. రెండు మూడేళ్లు గడిచాయి. నేను దాదాపు మరిచిపోయాను.
నా పరిచితులు కలుసుకుని మీ డ్రైవర్ ఇటీవల రెండుమూడు మార్లు కనిపించాడు. మీ గురించి అడిగేవాడు. మరోమారు కనబడీ మాట్లాడకుండా వెళ్లేవాడు.
ఒకరోజు కాలింగ్ బెల్ మోగింది. ఇంటి ముందు పరిచయం ఉండీ లేనట్టు ఒక వ్యక్తి నిల్చున్నాడు. నన్ను చూసి, నాలుగడుగులు ముందుకొచ్చి ‘‘అమ్మగారూ, బాగున్నారా?’’ అన్నాడు. వెంటనే జ్ఞప్తికొచ్చాడు.
‘‘రా, బాబూ లోపలికి రా, కూర్చో’’ అన్నాను. అమ్మగారూ ముందుగా నన్ను క్షమింపగోరుతున్నాను. మీ అప్పు తీర్చడంలో చాలా ఆలస్యం జరిగింది. మూడు నాలుగు మార్లు ఇక్కడికి వచ్చాను. కాని సిగ్గుతో మిమ్ముల్ని కలుసుకోలేదు. మా తల్లిగారు కాన్సర్‌తో బాధపడుతోంది. తండ్రి చనిపోయారు. నేను ఉద్యోగం చేస్తున్నచోట బాగా డబ్బున్న ఆమెతో నా పెళ్లి జరిగింది. ఉద్యోగం మానుకుని బిజినెస్ ప్రారంభించాను. డబ్బు కొరత ఉండేది. అయినా రోజూ మిమ్ము గురించి తలచుకునేవాడ్ని. నా గురించి మీరేమనుకుంటారో అని బాధపడుతుండేవాడ్ని. మీ అప్పు తీర్చక చస్తే ఎలా? అన్న చింత వేధిస్తుండేది. నా భార్యతో మాట్లాడుతూ ఒకవేళ నేను చస్తే అప్పు తీరుస్తాను అని ఆమె ప్రమాణం చేయించుకున్నాను’’ అన్నప్పుడు అతడు కంట తడిపెట్టడం గమనించాను.
డబ్బుతోపాటుగా పెద్ద డబ్బా నిండా ఖర్జూరం, పిల్లలకు బిస్కట్లు, చాక్లెట్లు, అత్తరు సీసా పట్టుకుని వచ్చాడు.
మన రాజకీయ నాయకులలో, న్యాయ వ్యవస్థలో, దేవాలయాలు, పీఠాధిపతులలో ఇట్టి సూక్ష్మ సంవేదన కానరాకున్నదే? ఒక నిరక్షరాస్యునిలో, బూట్ పాలిష్ చేసేవాడిలో, డ్రైవర్‌లో వున్న అంతశ్శుద్ధి మనలో ఎందుకు లేదు? మానవులలో విలువలు నశిస్తున్నాయి ఎందుకు? అంటూ గప్పాలు కొడ్తాం. విలువలెక్కడికీ పోలేదు. పోవు కూడా..్భరతీయ చైతన్యం ఇంకా జాగృతంగానే ఉంది. బూట్ పాలిష్ చేసే బాబులో, ఆ బాబును మంచి మార్గంలో నడిపించే అతని తల్లిలో, పాతికవేలు అప్పు తీసుకుని ఐదేళ్లు గడిచినా తీర్చలేకపోయానే అంటూ మానసికంగా కుమిలిన డ్రైవర్ ఇలాంటి వేలాది మందిలో లక్షలాది ప్రజల్లో విలువలింకా సజీవంగానే ఉన్నాయి.
(‘తరంగ’ కన్నడ వారపత్రికలోని సంపాదకీయం చదివి రాసిందీ రచన)
ముంబై-కుర్లా రైల్వే స్టేషన్, అహమదాబాద్ రైలు కోసం వేచాం
english title:
i
Date:
Sunday, May 19, 2013