Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

దేశీ సంప్రదాయంలో చేర్పులు-మార్పులు

$
0
0

భూమి, అడవి, నీరులాగే సంస్కృతి ఒక ఉత్పత్తి సాధనం. తరాల తరాలకు సంస్కృతిని అందించడంలో జ్ఞాననిధి- అందులో భాషది కీలకపాత్ర. వస్తు మార్పిడి నుండి, వ్యాపారంలో నగదు, బంగారం చలామణీలోకి వచ్చినట్లే, భాష కూడా లిఖిత రూపంలోకి వచ్చి, రాజయోగం పట్టేసరికి కొత్త అవకాశాలతోపాటు- కొత్త సమస్యలు కూడా వచ్చిపడతాయి. అతిశయాలు, ఆధిపత్య ధోరణులు పెరుగుతాయి.
బ్రిటిష్‌వారి రాకతో చదువుకున్నవాళ్ళకు ఉద్యోగావకాశాలు ఎక్కువ కావడంతో లిఖితభాషకు గిరాకీ పెరిగింది. చదువుతోపాటు, వారు వారి శాస్త్రాలను పరిపాలనా విధానాన్ని ప్రవేశపెట్టారు. కొందరు మాతృభాషలో లిఖిత భాషకు- వాడుక భాషకు మధ్య పెరుగుతున్న తేడాను తగ్గించే ప్రయత్నం చేశారు. మరికొందరు తెల్లవాడి శాస్త్రాలనే వాడుక భాషలో అనువదించారు. బహుకొద్దిమంది భారతీయ లిఖిత సంప్రదాయాలలో ఆయుర్వేదం వంటి ప్రత్యేకతలు ఈ పెను దుమారంలో కొట్టుకుపోకుండా నిలబెట్టడానికి జీవితాలను ధారపోశారు. ఏ అండదండలు లేని పల్లె ప్రజలు, గిరిజనుల వారసత్వం కొనవూపిరితో కొట్టుమిట్టాడుతుంది. మన వారసత్వంలోని మార్గ, దేశి సంప్రదాయాలలో మార్గసంప్రదాయం అంటే లిఖిత, నృత్య, గానాలకే పెద్దపీట. దేశి సంప్రదాయాలకు ఆదరణ తగ్గడం, కులముద్ర, సామాజిక స్పృహ పేరిట కవులు కళాకారులు వాటిని వశం చేసుకోవడంలో ఈ సంప్రదాయాలు వెలవెలపోతున్నాయి.
ఈ అలిఖిత సంస్కృతిని వల్లెవేస్తూ ప్రచారం చేసే ఆశ్రీత కులాలు కళాకారులు, సంచార జాతులు క్రమంగా కూలివాళ్ళుగా మారారు. దానితో పల్లె ప్రజల జ్ఞానం కొడిగట్టుకుపోయింది. ఇపుడు జనం, తమ సాహిత్యం తాము కూర్చుకోవడం లేదు. తమ విత్తనాలు, ఎరువులు, మందులు తము తయారుచేసుకోవం లేదు. జానపదుల, గిరిజనుల జ్ఞానాన్ని దొంగిలించి బహుళ జాతి సంస్థలు పేటెంట్ చేసుకుంటున్నాయి. స్థానిక వంగడాల స్థానంలో తాము తయారుచేసిన వంగడాలను దించుతున్నారు. జానపద సంప్రదాయాలలో శుచి, శుభ్రం, సంస్కారం తక్కువని సంస్కృతంలో కొందరు పూజలు నేర్పిస్తుటే, ఈ రెంటికి దూరంగా కొందరు మరోవైపు లాగుతున్నారు. మనం భాష ఒక్కదానే్న పొగొట్టుకోవడం లేదు. మన వారసత్వాన్ని మొత్తం పొగొట్టుకుంటూ బానిసలుగా మారిపోతున్నాము. తెల్లవాడి పక్కన చోటుదొరికి రచ్చగెలిస్తే చాలుననే ధోరణి పెరిగి, ఇల్లు దివాళా తీస్తున్నా మనకు చీమ కుట్టినట్లుగా కూడా అనిపించడంలేదు.
అడవులు, బీళ్ళను మన తెగలు, పశువుల కాపరులు, మత్స్సకారులు నాశనం చేస్తున్నారని, శాస్తవ్రేత్తలు వారి చదువులు చదివిన ఉద్యోగులు ప్రచారం చేయసాగారు. ఈ వాదాన్ని తిరస్కరిస్తూ, ఈ జాతుల వనరుల యాజమాన్య పద్ధతులే మేలైనవిగా ప్రపంచ వ్యాప్తంగా అధ్యయనాలు వెలువడసాగాయి. వాటిలో 1982లో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆచార్యుడు గంగాధర్, అహమ్మదాబాద్‌లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఆచార్యులు అనిల్‌గుప్తాలు చెంచులు తేనె, బంక, వేట, వేటలో పాటించే యాజమాన్య పద్ధతుల అధ్యయనం విశిష్టమైనది. కాని ఈ అధ్యయనాలకు మనం తెలుగు నుడికారం అద్దలేకపోయాము. ‘దేశ్య పదజాలాన్ని ప్రమాణభాషలో పునరుజ్జీవింప జేయడానికి, మాతృభాషలో కొన్ని సామాన్య శాస్త్ర గ్రంథాలు రచించడానికి- వయోజన విద్య వ్యాప్తికి మాండలిక వృత్తి పదకోశాలు ఉపయోగపడాలి’ (1960) అ ఒకనాడు ఆశించినది మొదలు కాకపోగా,నేడు భాషను బతికించుకోవడమే పెద్దసవాలుగా మారింది.
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు, సహజ వనరులన్నీ నాశనమైనాక ప్రభుత్వాలకు జ్ఞానోదయమై ఆయా తెగల, జాతుల జ్ఞానానికి- వారి యజమాన్య పద్ధతులకు ప్రాధాన్యతనిస్తూ చట్టాలు చేయసాగాయి. వాటిలో ఇటీవల వచ్చిన అటవీ హక్కుల గుర్తింపుచట్టం, త్వరలో రానున్న తీర ప్రాంత మత్స్యకారుల హక్కుల రక్షణ చట్టం ముఖ్యమైనవి. కాని ఈ చట్టాల అమలు ఇళ్ళ స్థలాలు, సాగు భూములకు పట్టాలివ్వడంగా సరిపెడుతున్నారు. ఈ మాత్రం కూడా అందనివారు తిరగబడుతున్నారు.
విశ్వవిద్యాలయాలలో పరిశోధనలు, జానపద కళలకు పేటెంట్లు, కళాకారులకు అవార్డులు, పింఛన్లు, సాహిత్యాన్ని గ్రంథస్థం చేయడంలో మునిగిపోతే, విశ్వవిద్యాలయాలు వదిలిపెట్టి, పరిపాలన వ్యవస్థతో తలపడుతున్నవారి కృషి ఫలితంగా ఇటీవల వచ్చిన గిరిజనుల అటవీ హక్కుల గుర్తింపు చట్టం కింద జారీచేసిన పట్టాదారు పాస్‌పుస్తకాలమీద ‘చేవడిబస, మగనాలమెట్ట, చీపురుపొలాలు’ అనే గోదావరి జిల్లాలో కొండరెడ్డి తెగ సంప్రదాయ పరిభాష చోటుచేసుకుంది. మిగిలిన తెగలు వాడుకొనే ఇటవంటి పదాలు సేకరించి వాటి గుర్తింపు కోసం గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ ఎ.విద్యాసాగర్ 2011 జనవరిలో ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, జిల్లాలో వాటిని పట్టించుకునేవాడే లేడు. సామాజిక స్పృహగల రచయితలకుగాని ప్రాంతీయ ఉద్యమాలలో మమేకమై పనిచేస్తున్న భాషాభిమానులకు, మేధావులకు కూడా ఈ విషయాలు పట్టవు.
అందువల్ల కాస్తో కూస్తో చదువుకున్న చెంచులు నల్లమలలో ఈ చట్టం కింద జీవ వైవిధ్యం, మేధోసంపత్తి హక్కులు, ఆ మాటకొస్తే మొత్తం అడవిమీద తమ జ్ఞానం ఆధిక్యతను నిరూపించకుంటూ, ఈ రాజ్యం మాదేనని చాటుకుంటూ, ఇంతకుముందే ‘నడుస్తున్న చరిత్ర’లో ధారావాహికంగా వచ్చిన తమ ఆత్మకథ ‘నల్లమల చెంచు ప్రపంచం’ పుస్తకావిష్కరణ జరుపుకున్నారు.
****
దేశి సంప్రదాయాలలోగల వైవిధ్యం వారి అస్మితల గూర్చి తెలియక పునరుజ్జీవన దృష్టితో కాక, సంస్కరించే దృష్టితో దుర్గపూజలు, సత్యనారాయణ వ్రతాలు, శ్రీరామాలయాలు, భజన, దళిత గోవింద కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కొందరు శిష్టవర్గం వీటివైపు మొగ్గుచూపుతున్నారు. విశాఖ జిల్లా పాడేరు మన్యం ఇలవేల్పు మోదమ్మను మంత్ర తంత్రాలతో పూజించడం మంచిదే కావచ్చు. ఆ మోదమ్మను గూర్చి గిరిజనులు తరతరాలుగా పాడుకునే ఈ తుమ్మెద పదాలకి అంతే ప్రాధాన్యత ఇవ్వకపోతే జన సామాన్యానికి, ఆ కథ ఇచ్చే సందేశానికి దూరవౌతాము (మే 14 పాడేరులో మోదమ్మ జాతర ఆఖరిరోజు).
‘‘శరణు శరణు దుర్గాలమ్మలు- తుమ్మెదీరో- మీ చరణాలు తప్పలేదు
మీ చరణాలు తప్పినగాని- తుమ్మెదీరో- మీ కరుణాలు తప్పలేను
మీలాటి కాలమురాగా- తుమ్మెదీరో మిమ్ముతలచి పాడుతాము’’
దిగువ రాజ్యానికి చెందిన మోదమ్మ మొదలైన యువరాణులు- దుర్గాండ్లు, కొండరాజులు- దేశిరాజులను పెళ్ళిచేసుకుంటారు. వారిలో మోదమ్మ కొడుకు సంజీవరాజు ప్రేమించిన మాలగుంగుల పెళ్ళి జరిపించి ఆమెను రాజ్యానికి రాణిని చేయడం ఈ పాట సారాంశం. ఎగువవారు దిగువవారు, అగ్రకులాలు, అంటరాని కులాలుగా విడిపోయిన గిరిజనప్రాంతాలలో, ఐకమత్యం ఆవశ్యకతను బోధించే పాట యిది.
మనకు మంగళవాద్యాలు డోలు, సన్నాయివలెనే గిరిజనులకు నరికె, తుడుము, సన్నాయి ఉన్నాయి. భజన సెట్లు ఉచితంగా పంచిపెట్టడంతో ఈ సంప్రదాయ వాద్యాలు కనుమరుగౌతున్నాయి. ఆ ఇచ్చేదేదో వారి పద్యాలను కూడా ఇస్తే బాగుంటుంది కదా.
దాతలు వారి ఇష్టాల మేరకు ఆయా దేవతల గుళ్ళు కట్టించడంవల్ల సంప్రదాయం ప్రకారం మత్స్యదేశంగా చరిత్ర పురాణ ప్రసిద్ధి పొందిన విశాఖ మన్యంలో ‘జోర జోర జోర పంచపాండవులార’ అని పాడుతూ నంది పండుగలో పాండవులను ఆరాధించే సంప్రదాయాలు క్షీణిస్తున్నాయి.
ఈ పాట ప్రకారం పాండురాజుకు ఇద్దరు భార్యలు. దిగువ భార్య కుంతి- కొండ భార్య అసివేయుల ‘పాప’. కుంతికి కనె్నరికంలో కోలన్న (కర్ణుడు) పుట్టాడు. కొండ భార్యకు పాండవులు పుట్టారు. ఈ కోలన్న తండ్రి వెంట కొండ ప్రాంతాలకు వెళ్లి పాండవులతోకలిసి దిగువవాడైన దుర్యోధనుడితో యుద్ధం చేస్తాడు. ‘పిట్టగడ్డ జలంపల్లి- పట్టపుకోలన్న’ అని కోలన్నను పాటలో ఆహ్వానిస్తారు. భారత కథ- గిరిజన ప్రాంతంలో వారి వివాహ సంబంధాలు ఎగువ- దిగువ వ్యత్యాసాలకు తగ్గట్టుగా మారిపోతుంది.
ఈ మన్యంలోనే మత్స్యలింగేశ్వర స్వామికి శివరాత్రి జాతర జరుగుతుంది. ఇక్కడ గిరిజనులు చెప్పుకునే స్థలపురాణం విశిష్టమైనది. మత్స్యదేవత తన సంతానాన్ని కబళిస్తున్న క్రూర జంతువులు, నాగరాజులనుండి రక్షించవలసిందిగా ఆ మత్స్యలింగేశ్వర స్వామిని కోరుతూ, తన పిల్లలను ఆయన రక్షణలో ఉంచి, నాగరాజులతో యుద్ధానికి మత్స్యపర్వతానికి పోయిందట. క్రూర జంతువులకు సాధు జంతువులకు జరిగే జీవన పోరాటం చిత్రించే ఈ కథ ఆ జాతరలో గుర్తుచేసుకోవాలి.
‘‘లక్ష్మి కల్యాణమో- వైభోగమో గౌరి కల్యాణమో- శుభలగ్నమో
అలవరో! సీతమ్మ- నీ పెండ్లివారు గున్న చింతలలోన- గుర్రలవారు’’
ఈ విధంగా గోదావరి మన్యంలో గిరిజనులు పెండ్లిపాటలు పాడుకుంటారు.
దళిత గోవిందంలో శ్రీనివాస కల్యాణం చేసేటప్పుడు గిరిజన పేరంటాండ్ర చేత వారి పెండ్లి పాటలు పాడించవచ్చు. అప్పటికప్పుడు పాడమంటే వాళ్ళు పాడలేరు. దానికి కొంత ముందు ప్రయత్నం చేయాలి. మంత్ర తంత్రాలు, గంభీరమైన ఉపన్యాసాలతో మూసపోతగా కార్యక్రమాలు ఇలా సాగుతుంటే- తీర్థాలు జాతరలలో వ్యాపార సంస్కృతికి తగ్గట్టుగా వేడుకలు జరుగుతుంటాయి. ఇక మత ప్రచారాలు స్థానిక భాషలలో బాణీలతో ప్రజలలోకి పోతున్నాయి. అయితే దేశి సంప్రదాయాలు- కథలు అప్పుడప్పుడు అస్తిత్వ పోరాటాలలో కీలకపాత్ర వహిస్తున్నాయి. రకరకాల రంగులు పులుముకుంటున్నాయి. ఇందరి మధ్య సమాజం గందరగోళంగా పడిపోతుంది.
ఉత్తరాదిన వాల్మీకి రామాయణం బదులు తులసీ రామాయణం చదివేవారు ఎక్కువ. కన్నడంలో బసవేశ్వర వచనాలు, అక్కమమహాదేవి శరణాలే పురాణాలు. తుకారం, జ్ఞానేశ్వర్, కనకదాసు మొదలైనవారి భక్తి సాహిత్యం స్థానిక భాషలలో ఉన్నాయి. వాటికి ప్రచారం చాలా ఎక్కువ. నాయనార్లు, ఆళ్వార్లు కూర్చిన దివ్య ప్రబంధాలు తమిళ భాషలోనే ఉన్నాయి. తిరుమలలో బ్రహ్మోత్సవాలు కంటే బ్రహ్మాండంగా చిత్తూరు జిల్లా అంతటా వేసవికాలంలో 18 రోజులపాటు ద్రౌపది తిరునాళ్లు, గంగజాతరాలు జరుగుతాయి. ఒకనాడు తత్వాలు, కీర్తనలు, కోలాటాలతో మన పల్లెలు మారుమోగిపోయేవి. వర్ణ్ధర్మాలు గౌరవించిన వైదికులు, వాటిమీద తిరుగుబాటు చేసి సమ సమాజం కోసం పాటుపడిన బ్రహ్మనాయుడు, బసవేశ్వరుడు, బ్రహ్మంగారు, వేమన మన వారసత్వంలో భాగమే.
తమకు మంత్ర తంత్రాలు, సంస్కృతం రావనే న్యూనతాభావాన్ని ఆశ్రీత కులాలవారిలో తొలగించాలి. అటు శ్లోకాలు, ఇటు కీర్తనలు, పదాలు, వారసత్వంగా వచ్చిన తమ కథాగేయాలు కలిపి తంతును రక్తి కట్టించే ధైర్యం వారిలో కలిగించాలి. పూజారులను తయారుచేసే కార్యక్రమాలలో ఈ దేశీ సంప్రదాయాలలు కూడా భాగం కావాలి.
దేశి సంప్రదాయాలలో మన వారసత్వాన్ని పునరుజ్జీవింపచేయడానికి కావలసిన వివేకంతో పనిచేసినపుడే జనాన్ని పెడత్రోవ పట్టించే ధోరణులకు అడ్డుకట్టవేయగలం.

భూమి, అడవి, నీరులాగే సంస్కృతి ఒక ఉత్పత్తి
english title: 
changes
author: 
- ‘శక్తి’ శివరామకృష్ణ 9441427977

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>