స్పందన
====
తెలుగులో మొదటి వ్యావహారిక భాషావాది ఎవరని ప్రశ్నిస్తే కందుకూరి వీరేశలింగంగారనో, గుఱజాడ అప్పారావుగారనో సమాధానం వస్తుందన్నారు. గుఱజాడవారి సంగతి అలా ఉంచి వీరేశలింగంగారిని వ్యావహారిక భాషావాది అనడం ఏమిటి? వీరేశలింగంగారు వ్యావహారిక భాషకి వ్యతిరేకి. ఆయన రచనలు గ్రాంథికాలు, శిష్ట వ్యావహారికాలు. గద్య తిక్కన అని ఆయన బిరుదు. ‘‘స్వామినేని ప్రభావంతో గ్రాంథిక భాషావాది అయిన కందుకూరి వీరేశలింగంగారు తన మార్గాన్ని మార్చుకుని వ్యావహారిక బాట పట్టాడు’’ అన్నారు.
వీరేశలింగంగారు వ్యావహారిక భాషలో వ్రాసిన ఏదో ఒక గ్రంథం ఈ సందర్భంగా రజాహుస్సేన్‌గారు ఉదహరించలేదు. విశ్వనాథవారు వ్యావహారిక భాషలో నవలలు వ్రాశారు కాని వీరేశలింగంగారు అలా వ్రాసినట్లు లేదు. అలాంటి గ్రంథం ఏదైనా హుస్సేన్‌గారి దృష్టిలో ఉంటే తెలియజేయవలసినదిగా మనవి. సంస్కృతంలో ‘హితోపదేశమ్’ అని గ్రంథం ఉంది. దానిని మాక్సుమూలర్ జర్మన్ భాషలోకి అనువాదం చేశాడు. స్వామినేని వారు ఈ పేరు చూచి తన గ్రంథానికి హితసూచని అని పేరు పెట్టి ఉండవచ్చుకదా. ‘‘హితసూచనికంటె ముందే ఏనుగుల వీరాస్వామయ్యగారు తన కాశీయాత్రలో వ్యావహారిక బీజాలు నాటారు’’ అన్నారు. బీజాలు నాటడం కాదు. వీరాస్వామయ్యగారు కాశీయాత్రా విశేషాలన్నీ గ్రంథస్థం చేశారు. అది పూర్తి వ్యావహారిక భాషలో వ్రాయబడింది. ఒక విధంగా దానిని మొట్టమొదటి వ్యావహారిక గ్రంథంగా చెప్పవచ్చు. వీరేశలింగంగారు స్వామినేని వారి ఆశయాలు అభిప్రాయాలు హితసూచనిలో విశేషాలు మొత్తం కాపీ చేశారని ఇదివరకు ఒక రచనలో వివరించారు. తిరిగి ఇప్పుడు అదే చెబుతున్నారు.
మన శతక పద్యాలలో అనేక సంస్కృత నీతి సూక్తుల అనువాదాలున్నాయి. సుమతీ శతకాలలోను దాశరథీ శతకంలోను కూడా ఉన్నాయి. అందువలన ఆయా కవులు వాటిని కాపీ చేశారని అనవచ్చా? ఒకే విషయాన్ని వివిధ కవులు వివిధరీతులలో వివరిస్తారు. ఛందోబద్ధమైన రచనలన్నీ నిష్ప్రయోజనాలని అవి ఎవరికి అర్థంకావని, అందువలన తేలిక వచనంలో వ్రాయాలని స్వామినేని వారి అభిప్రాయం అన్నారు. వేమన తన భావాలన్నీ తేట తెలుగు వచనంలో వ్రాస్తే అవి ఇప్పటివరకూ జీవించి ఉంటాయా?
ఛందోబద్ధమైన పద్యంలో ఒక శక్తి ఉంది. దానిపై కుతూహలం గల పాఠకునికి సులువుగా కంఠస్థమవుతుంది. అలాగే కొన్ని ఛందోబద్ధం కాని గేయాలు కూడా ఉన్నాయి. వాటికి కూడా అట్టి శక్తి ఉంటుంది. ఇక్కడ ప్రక్రియ ప్రధానం కాదు. కవి ప్రతిభ. వచన కవిత్వానికి ఛందస్సు అవసరం లేదు. అలాంటివి కూడా కొన్ని సందర్భాలలో అందరికీ అర్థం కావడంలేదు. అందరికి అర్థమయ్యే కవిత్వంలో వ్రాసినా ఏ కవీ తన భావాలను నూటికి నూరుపాళ్లు కాగితంపై పెట్టలేడు. ప్రాచీన తెలుగు గద్య పద్యాలలో శకట రేఫం విధిగా ఉపయోగింపబడింది. ఇప్పుడుకూడా కొందరు వాడుతున్నారు.
నేడు మనం వాడుతున్న ‘ర’ అను అక్షరం లఘు రేఫం. అనగా తేలికగా పలకాలి. ఇది సంస్కృత అక్షరం. దీనికి ఒత్తులేదు. శకట రేఫం తెలుగు అక్షరం. చెరకు అని వ్రాయకూడదు ‘చెఱకు’ అని వ్రాయాలి.
ఇక్కడ లఘు రేఫమయిన ‘ర’ వాడకూడదు. అందువల్ల ‘కర్ర’ అని వ్రాయకూడదు. ‘కఱ్ఱ’ అని వ్రాయాలి. అందరు చేస్తున్న తప్పు మేమూ చేస్తాం అంటే ఎలాగ?
‘‘సాహిత్యంలో వీరేశలింగంగారి సంతకంతో ఉన్న హితసూచని ప్రతిని వాఙ్మయ మహాధ్యక్ష వడ్లమూడి గోపాలకృష్ణయ్యగారి వద్ద తాను చూచినట్లు దీన్ని బట్టి హితసూచని గ్రంథం వీరేశలింగంగారిపై ప్రభావాన్ని చూపి ఉండవచ్చునని ఆరుద్ర తన సమగ్రాంధ సాహిత్యంలో అభిప్రాయపడడం గమనార్హం’’ అన్నారు. వీరేశలింగంగారి సంతకంతో ఉన్న హితసూచని ప్రతిని గోపాలకృష్ణయ్యగారివద్ద ఆరుద్ర చూడడం జరిగింది గనుక ఆ పుస్తకం వీరేశలింగంగారిదే కదా. అది అక్కడకు ఎందుకు వచ్చింది చెప్పలేదు. తమ పుస్తకంపై ఎవరైనా పేరు ఊరు వ్రాసుకుంటారు కాని సంతకం చేయరు.
దానిని ఎవరికైనా బహుమతిగా ఇస్తే సంతకం చేస్తారు. ఆరుద్రగారి ఊహ సిద్ధాంతమా? రజాహుస్సేన్‌గారు స్వామినేని వారి అభిమాని కావచ్చు. కాని వీరేశలింగంగారిపై అభాండాలు వేయడం ఎందుకు?
అప్పకవీయంలో కొన్ని చోట్ల వ్యావహారిక భాష ఉపయోగించబడిందని దానిని తరువాత కొందరు లేఖరులు గ్రాంథికంలోకి మార్చినట్లు కొందరు పరిశోధకులు చెబుతున్నారు. ఇది వాస్తవమైతే తొలి వ్యావహారిక భాషావాది అప్పకవి అవుతాడు. ఏది ముందు? ఏది వెనుక? అనే వాదనలు నిష్ప్రయోజనం. వీరేశలింగంగారు 1919వ సంవత్సరంలోను, గురజాడవారు 1915 సంవత్సరంలోను కాలధర్మం చెందారు. ఆ రెండు సంవత్సరాలు తప్పుగా ప్రకటంపబడ్డాయి.
స్పందన
english title:
spandana
Date:
Tuesday, May 21, 2013