అడక:తెలుగుకు సమగ్ర నిఘంటువులు లేవనే మాట తరచు వినిపిస్తూ ఉంటుంది. ఇదెంతవరకు నిజం? దీనికి బాధ్యులెవరు? లోపం ఎక్కడుంది? ఏం చెయ్యాలి? వివరంగా చెప్పండి.
-వి. రామారావు, నెల్లూరు
బదులు: తెలుగులో నిఘంటువులు కొన్ని ఉన్నా అవి ఏవీ నేటి అవసరాలను తీర్చేవిధంగా లేవు. శబ్ద రత్నాకరం, సూర్యరాయాంధ్ర నిఘంటువుతోపాటు చిన్నా పెద్దా నిఘంటువులు కొన్ని ఉన్నాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం, ద్రవిడ విశ్వవిద్యాలయం, తెలుగు అకాడమీ, తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించి కొన్ని నిఘంటువులు, పదకోశాలు వ్యుత్పత్తి పదకోశాలూ, జిల్లా మాండలిక పదాల సంకలనాలు, వృత్తిపదకోశాలూ ఉన్నాయి. కాని, వీటన్నింటినీ సమకాలీన అవసరాలకు తగ్గట్లు పెంపొందించుకోవలసి ఉంది. ఇందుకోసం ప్రత్యేకించి ఒక సమగ్రమైన నిరంతర వ్యవస్థనేర్పాటుచేసుకోవాలి. ఆ బాధ్యతను తెలుగు విశ్వవిద్యాలయం తీసుకోవాలి.
అదొక దిక్కూ మొక్కూ లేని విధంగా తయారైంది. అక్కడ జరిగే పనులకొక పద్ధతి లేదు, తగిన నిధులూ లేవు. ఇదంతా అలా ఉంచి, నేటి భాష అవసరాలు చాలా విస్తృతంగా ఉన్నాయి. కనుక ప్రాచీన కావ్యాల్లో వాడింది, కవులు, రచయితలు వ్రాసిందే భాష అనుకోకూడదు. ఎంతో విస్తరించి ఉన్న తెలుగు జాతి జన జీవనంలోంచి వేలాది మాండలికాలను, తెలుగు మాటలను అంతా సేకరించి వాటిని గ్రంథస్తం చేయాలి. కొత్తగా వచ్చే అవసరాలకు తగిన మాటల్ని వాటిలోంచి తీసుకోవాలి. అక్కరపడినపుడు కొత్త మాటల్ని తయారుచేసుకోవాలి. ఇందుకోసం తగిన సమగ్ర నిరంత వ్యవస్థను తెలుగు విశ్వవిద్యాలయంలోనే ఏర్పాటుచేసి, తగిన నిధులిచ్చి, గడువు తేదీలను నిర్ణయించి యుద్ధ ప్రాతిపదికన ఈ పనికి పూనుకోవాలి.
అడక:తెలుగు భాషపట్ల యువత ఆసక్తి చూపడంలేదని అందరూ విమర్శిస్తూంటారు. కొందరైతే తెలుగు ప్రజలకు తెలుగుపై శ్రద్ధలేదని అంటూంటారు. ఎందుకని?
-కె.సుబ్బారావు, అద్దంకి
బదులు:లోతైన అవగాహన లేకుండా పైపైకి కనిపించే పరిస్థితుల్ని బట్టి మాట్లాడే మాటలవి. ప్రజలకు ముఖ్యంగా యువతకు తమ భాషపట్ల ప్రేమ, అభిమానం ఉండదనుకోవడమంత దివాళాకోరు ఆలోచన మరొకటి ఉండదు. నేటి సమాజ అవసరాలకు తగిన విధంగా భాషను వినియోగించకపోవడం పెంపొందించే ప్రయత్నమే చేయకుండా ఇతర భాషలకు బానిసలుగా తయారయ్యే పరిస్థితిని కలిగించిన పాలకులనూ, మేధావులనూ తప్పుపట్టాలి తప్ప మొత్తంగా ప్రజలనూ, యువతనూ కాదు. ఆత్మగౌరవ సమస్యగా ‘తెలుగు’ అంశం తమ ముందుకు వచ్చినపుడు తెలుగువారు తీవ్రంగా స్పందించిన సందర్భాలున్నాయి.
అవకాశమూ ప్రోత్సాహమూ ఉంటే తెలుగును ఉన్నత శిఖరాలపైన కూర్చోపెట్టగల సత్తా తెలుగు భాషా జాతి జనుల్లో, యువతలో ఉంది. అందుకే ఎక్కడ తెలుగు భాషాభివృద్ధికోసం ఏమాత్రం పనులు జరుగుతున్నా వాటికి విశేషమైన స్పందన ఉంటోంది. ఇటీవల జరిగిన ప్రపంచ సభల సందర్భంలో జనస్పందనకు కారణం అదే. ఈ సంగతి తెలుసుకోకుండా జనానికి ముఖ్యంగా యువతకు తెలుగంటే ఆసక్తి లేదనడం అలా అనే వారి ఆలోచననల స్థాయని సూచిస్తుస్తోంది.