వేదిక
====
తెలుగు పూర్వవైభవం పొందాలంటే కచ్చితంగా మన రాష్ట్రంలో 10వ తరగతి వరకు తెలుగును బోధనా మాధ్యమంగా స్వీకరిస్తే సరిపోదు. ఎందుకంటే ఆ తరువాత చదువుకునే చదువులోనూ, ఆ తరువాత సంపాదించే ఉద్యోగానికి కూడా అవసరపడని తెలుగును ముక్కున పట్టుకుని పాఠశాలవరకు చదివేస్తే సరిపోతుందనే భావన ఇటు పిల్లలోనే కాదు పెద్దలు, ఉపాధ్యాయులలోనూ బలంగా నాటుకుని ఉంది. కనుక ఎంత చదివినా సరే అంటే ఉన్నత విద్యలూ కూడా ఒక అంశంగా తెలుగు ఉండి తీరాలి. తెలుగువారై ఉండి తెలుగు చదువనురాయడం రాకపోతే వారికి ఉద్యోగావకాశాలను కల్పించకూడదు లాంటి కఠిన నిబంధనలు పెడ్తేనే తెలుగు భాషపై ఆసక్తి, భాషాభివృద్ధి జరిగితీరుతుంది. దీనికోసం అకుంఠితదీక్షతో సమరం సాగించాలి. మాతృభాషలో విద్య బోధన సమాజానికి, భావితరాలకు ఉపయోగకరమనిచాటి చెప్పడంకాదు అది ఎంత నిజమో ఆచరించి చూపించాలి. ఇతర రాష్ట్రాలలోనూ, దేశాలలోనూ ఉన్న తెలుగువారు తప్పనిసరిగా తెలుగు చదవను రాయను నేర్చుకొని తీరాలి అనే నిబంధన సైతం ఉండితీరాలి. తెలుగు నిఘంటువు నిర్మాణ శాఖ ను ఏర్పరిచి అందులో నిరంతరం తెలుగు పదాలను, మాటలను గ్రంథస్తం చేస్తుండడం అనే ప్రక్రియ నిరంతరం కొనసాగించాలి. ఇది కేవలం స్వచ్ఛంధ సంస్థలకు కాకుండా విధిగా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఏర్పాటు చేయాలి. జానపదుల వద్ద ఉన్న సాహిత్యాన్ని కూడా గ్రంథస్థం చేసే ఏర్పాటును తప్పనిసరిగా చేసేందుకు చర్యలు తీసుకోవాలి.
- ఎం. హరి
=============
ఈ మాటలిలా..
మన పిల్లలకు ఏ భాషలు నేర్పినా, వాటితోపాటు మన ఇంటి భాష తెలుగును కూడా చదివిస్తే చాలు- మేలు. ఇప్పుడు మన తెలుగు భాషలో ఇతర భాషల కల్తీ యాస భాషణం దినదినం పెరిగిపోతున్నవి. పత్రికలు, సినిమాలు, టీవీలు చూడండి. నిజం తెలుస్తుంది. ఇప్పుడు కొన్ని పదాల పరామర్శ.
1.అనమను, తినమను, చేయమను, పలకమను అనేవి వ్యతిరేకార్థ పదాలు. కాని, మనవాళ్ళు వాటిని- అనుమను, చేయుమను అనే అర్థంలో వాడుతున్నారు- మన భాషా పండితులు కూడా. వీటితో భావభంగం. కాబట్టి మన ఉచ్చారణ సవరించుకుంటే మంచిది. అనుమను, చేయుమను... సరియైన రూపాలు. 2. అమ్మకి, అన్నకి- (షష్టీ విభక్తి ప్రత్యయాలు కిన్, కున్) తెలుగు తెలియని పర భాషల వాళ్ళ పలుకుబడిని చూసి, మన వాళ్ళు కూడ అట్లనే మాట్లాడుతున్నారు. కాని, అకారంత పదాలకు ‘కు’ వస్తెనే సహజం- అందం. అమ్మకు నాన్నకు అనాలె. అమ్మకి, నీకి, నాకి అంటే అసహ్యంగా ఉంటవి. 3.బుల్లి- అంటే చిన్నది అనే అర్థం ఏ నిఘంటువులోనూ లేదు. అది పురుషాంగం (హింది). జులాయి అంటే పద్మశాలి (హిందీ/ఉర్దూ). చెవిలో పువ్వు- ఒక మతాచారానికి వెక్కిరింత. నంగనాచి - దిగంబర నర్తకి. దయచేసి ఇవి వాడకండి. మీ మాటలు సవరించుకొండి. ఇక కొన్ని (తప్పు) పదాలకు సరియైన రూపాలు- అధిభౌతిక, ఆధ్యాత్మిక, ఉపాధ్యాయుడు, జగదంబ, జయంత్యుత్సవం, దృఢమైన, ప్రదానం, ప్రధానం, బంధం, బాధ, బోధ, భంగం, భయం, మల్లీశ్వరి, మల్లికార్జున, విద్యార్థి, శాకాహారం... వీటిని తప్పుగా రాయకండి.
- మలయశ్రీ, కరీంనగర్
----------------------
రచనలు పంపవలసిన చిరునామా : ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్ సికింద్రాబాద్ - 500003