జనవాణి
=========
ప్రభుత్వం మాటమేరకు తెలుగు ప్రపంచ మహాసభల కోసం రచయితలందరూ తమ తమ రచనలను తమ సొంత ఖర్చుతో డిటిపి ముద్రణచేయంచి ఇచ్చారు. తెలుగు విశ్వవిద్యాలయం వారు కొంతవరకు రచయితలకు వారి వారి పారితోషికాన్ని ఇచ్చినా తెలుగు అకాడమీ వారు ఆ రచయితలకు పారితోషికంగాని వారు డిటిపి చేయించిన ఖర్చు కూడా ఇంతవరకు చెల్లించలేదు. ఇది తెలుగును ఏ రకంగా ప్రోత్సహించడమో ప్రభుత్వమే చెప్పాలి.
- వి. లక్ష్మి, హైదరాబాదు
ఇదేనా ప్రోత్సాహం
తెలుగును అన్ని విధాల ప్రోత్సహిస్తున్నామంటూ అధికార భాషా సంఘాన్ని ఏర్పాటుచేసింది ప్రభుత్వం, తెలుగు భాషాభివృద్ధికోసం పనిచేసే ఆ కార్యాలయంలోని కంప్యూటర్లకు తెలుగు లిపి లేనే లేదు. అవసరమైన పత్రాలను డిటిపి చేయించి విడుదల చేయిస్తున్నారట. తన కార్యాలయంలోనే తెలుగు లిపిని అమర్చుకోలేకపోయిన అధికార భాషా సంఘం పనితీరు అంతుపట్టడంలేదు!
-ఎం. ఎల్. కాంతారావు, హైదరాబాద్
పనులు మొదలయ్యేదెప్పుడో!
2013ను తెలుగు భాషా సంస్కృతి వికాస సంవత్సరంగా ప్రకటిస్తామని ముఖ్యమంత్రిగారు వాగ్దానం చేసిన తర్వాత 4 నెలలకు అధికారిక ఉత్తర్వులు వచ్చాయి. కార్యాచరణ ప్రణాళిక అంటూనే చేయవలసిన పనుల జాబితాను ఇచ్చారు. ఇంతకూ పనులు మొదలయ్యేదెప్పుడో! ఎంత శాతం అమలు జరుగుతుందో!
-ఎన్.సత్యనారాయణ, హైదరాబాద్
సూచన
‘నుడి’ పేజీ బాగుంటున్నది. ప్రతివారం ఒక కవితను, ఒక కార్టూన్‌ను, ఎక్కువగా చిన్న చిన్న రచనలను ప్రచురిస్తే మరింత బాగుంటుంది.
-ఆర్.వెంకటేశ్వరరావు, కడప
బట్టీలకు తిలోదకాలివ్వాలి
సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో ఇటీవలకాలంలో బోధనా పద్ధతుల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. దీనివల్ల పిల్లలకు పాఠాలు సులభంగా అర్థం కావడంతో పాటు ఉపాధ్యాయుల బోధన కూడా సులభతరం అయంది. సామాన్య శాస్త్రంలో ఉండే పరమాణు నిర్మాణం, జెనెటిక్సు లాంటి అతి కష్టమయిన అంశాలను నేడు పిల్లలకు సులభంగా అర్థం అయ్యేలా చెప్పే బోధనా ఉపకరణలను వాడుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యా ప్రమాణాలు పెరగాలి, నాణ్యత పెరగాలి. ఆ మేరకు చదువు కోసం కేటాయించాల్సిన సమయమూ తగ్గాలి, కాని నేటి విద్యావ్యవస్థ ముఖ్యంగా పాఠశాలస్థాయలో బట్టీలకే ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్నారు. కనుక విద్యార్థి పూర్తిగా తన బుద్ధిని ఉపయోగించి రాణించేస్థితికి రాలేకపోతున్నాడు. అందుకనే సామాన్యశాస్త్రం వంటి వాటిని కూడా మాతృభాషలో ఉన్నట్టు అయతే బట్టీపట్టడం లాంటివాటిని కాకుండా సహజంగా విద్యార్థి అర్థం చేసుకొనే దశ మొదలవుతుంది.
- ఎం. ఇందిర, మెహిదీపట్నం
జనవాణి
english title:
janavaani
Date:
Tuesday, May 21, 2013