కథలు చదవడం కన్నా, వాటిని వినడం వల్లే చిన్నారులు ఎక్కువగా ఆనందం పొందుతారు. అందుకే కొందరు మహిళలు ఒక బృందంగా ఏర్పడి, కథల పట్ల పిల్లల్లో ఆసక్తి పెంచేందుకు యథాశక్తి కృషి చేస్తున్నారు. కేరళలోని ‘ఎర్నాకుళం మహిళా సంఘం’ సభ్యులు పనె్నండేళ్ల లోపు వయసున్న పిల్లలను ఒక చోట చేర్చి వారికి కథలు చెబుతుంటారు. వేసవి సెలవుల్లో కాలాన్ని వృథా చేయకుండా పిల్లలు కూడా కథలు వినేందుకు ఎంతో ఉత్సాహం చూపుతున్నారు. మహిళా సంఘం లైబ్రరీలో ‘కిడ్స్ కార్నర్’ పేరిట ప్రారంభించిన ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. పలువురు గృహిణులు ఇక్కడికి వస్తూ తమకు తెలిసిన కథలను పిల్లలకు ఆసక్తికరంగా చెబుతున్నారు. ‘పాఠ్యపుస్తకాల భారం పెరగడంతో నేటితరం పిల్లలకు మిగతా పుస్తకాలు చదివేందుకు సమయం చాలడం లేదు. దీంతో వారిలో పఠనాసక్తి బాగా సన్నగిల్లింది. ఈ పరిస్థితుల్లో కథలు వినేందుకు వారిలో కుతూహలం పెంచాం’- అని ఎర్నాకుళం మహిళా సంఘం సభ్యులు చెబుతున్నారు. ఇంటర్నెట్, టీవీ, సెల్‌ఫోన్ల ప్రభావం అధికం కావడంతో మిగతా పుస్తకాలు చదివే తీరిక, చొరవ పిల్లల్లో కానరావడం లేదు. కథల పుస్తకం పట్టుకుని పట్టుమని అయిదు నిమిషాలు కూర్చునేందుకు కూడా చిన్నారులు సుముఖత చూపడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల్లో పఠనాసక్తిని పెంచేందుకు మహిళలు కొంగు బిగించారు. తాము కథలు చెబుతున్నపుడు పిల్లలు ఎంతో శ్రద్ధగా వింటున్నారని, మిగతా పుస్తకాలపై వారిలో ఇపుడిపుడే ఆసక్తి పెరుగుతోందని మహిళలు అంటున్నారు. పురాణాలు, జానపద కథలు నేటికాలం పిల్లలకు తెలియవని, ఈ కారణంగానే కథలు వినడానికి వారు ప్రాధాన్యం ఇస్తున్నారని కొందరు గృహిణులు తెలిపారు. కథలు వినడమే గాక, వాటికి సంబంధించి ప్రశ్నలు వేసినపుడు కూడా చిన్నారులు సంతృప్తికరంగానే సమాధానాలు ఇస్తున్నారు. కథలు చెప్పాలని ఉత్సాహం చూపే పిల్లలను కూడా ఆ దిశగా తాము ప్రోత్సహిస్తున్నట్లు ఎర్నాకుళం మహిళా సంఘం కార్యదర్శి శ్యామలా శ్రీ్ధర్ తెలిపారు.
మరోవైపు సాధారణ గృహిణుల్లో పఠనాసక్తిని పెంచేందుకు ‘కాఫీ ఈవెనింగ్’ పేరిట మరో కార్యక్రమాన్ని ఎర్నాకుళం మహిళా సంఘం ప్రారంభించింది. ఆంగ్లం, మలయాళ భాషలకు చెందిన రెండు పుస్తకాలను ‘కాఫీ ఈవెనింగ్’లో పరిచయం చేస్తారు. సాధ్యమైనంత వరకూ రచయితలను అతిథులుగా రప్పిస్తూ వారిచేత మాట్లాడిస్తారు. దీంతో ఆ పుస్తకాల పట్ల సాధారణ గృహిణుల్లో ఆసక్తి పెరుగుతుంది. ‘కాఫీ ఈవెనింగ్’కు మంచి స్పందన లభించినట్లు సంఘం అధ్యక్షురాలు శోభ తెలిపారు. ఎర్నాకుళం మహిళా సంఘం లైబ్రరీని 1954లో ప్రారంభించారు. కేరళ గ్రంథాలయ సంస్థ పర్యవేక్షణలో పనిచేసే ఈ లైబ్రరీ ఇప్పటివరకూ పలు అవార్డులను సైతం సాధించింది. ప్రభుత్వం నుంచి తమకు ఆర్థిక సాయం కూడా అందుతోందని గత పాతికేళ్లుగా లైబ్రేరియన్ పదవిని నిర్వహిస్తున్న వల్సాలా చెబుతున్నారు.
కథలు చదవడం కన్నా, వాటిని వినడం వల్లే చిన్నారులు ఎక్కువగా ఆనందం పొందుతారు.
english title:
k
Date:
Tuesday, May 21, 2013