ఎండాకాలం ఏటా వచ్చేదే అయినా ఏయేటికాయేడు వాతావరణంలో మార్పులతో ఉష్ణోగ్రతలు అత్యధిక స్థాయిలోకి వెళుతున్నాయి. పిల్లలు, వృద్ధులు ఎండవేడిమికి అల్లాడిపోతున్నారు. ఎండవేళ బయటికి వెళ్లే వారిలో కొందరు వేసవి తాపానికి గురై ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. గ్రీష్మ తాపాన్ని ఎవరూ ఆపలేకపోయినా, ఆ తాపం నుండి మనల్ని మనం కాపాడుకోవడం ముఖ్యం. అత్యధిక వేడిమి కారణంగా శరీరంలోని నీటి శాతం తగ్గిపోతుంది. అలా చెమట రూపంలో బయటకు పోయిన నీటి శాతాన్ని ఎప్పటికప్పుడు భర్తీ చేసుకోకపోతే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్టే..! కొన్ని సూచనలు పాటించడం ద్వారా గ్రీష్మతాపాన్ని కొంతమేరకు తగ్గించుకోవచ్చు.
-బయటి పనులు వీలైనంతవరకు ఉదయం పది గంటలలోగా, సాయంత్రం నాలుగు గంటల తర్వాత చూసుకోవాలి. మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్ళటం శ్రేయస్కరం కాదు. తప్పనిసరై వెళ్ళవలసి వస్తే తలకు టోపీ పెట్టుకోవటం మంచిది. లేదా గొడుగును ఉపయోగించుకొని మధ్యాహ్న భానుడి తీక్షణ కిరణాల బారినుండి శరీరాన్ని కాపాడుకోవాలి.
-ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. కూల్‌డ్రింకుల లకన్నా స్వచ్ఛమైన మంచినీరు తీసుకోవడం మంచిది. మరీ చిక్కగా కాకుండా పలుచగా కలిపిన పళ్ళరసాలు తాగటం మంచిది. తాగే నీటిలో కొంచెం ఉప్పు, పంచదార కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. కొబ్బరి నీళ్ళు తాగటం కూడా వేసవిలో మేలు చేస్తుంది. వేసవి తాపాన్ని తగ్గించడంలో వీటికి మించినది లేదని వైద్యులు కూడా చెపుతుంటారు. ఖరీదైన శీతల పానీయాల కన్నా కొబ్బరినీళ్ళు ఎన్నో రెట్లు ఉత్తమం.
-ఎండలో బయటకు వెళ్ళే సమయంలో అధిక శక్తిగల వేడి కిరణాలు కంటికి తగలకుండా చలువ కళ్ళద్దాలు వాడటం మంచిది.
-అధికంగా దాహాన్ని కలిగించే ఆహారాన్ని తీసుకోరాదు. తేలికగా జీర్ణమయే సాత్వికాహారం తీసుకోవాలి. కూరగాయలు, మజ్జిగ వున్న ఆహారం మంచిది. నూనెలు ఎక్కువగా వుండే తినుబండారాలు తినరాదు. స్వీట్స్, మసాలాలతో నిండిన ఆహారాన్ని తింటే ఆ తర్వాత దాహంతో అల్లాడిపోవాల్సి వస్తుంది.
-బట్టల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు అవసరం. ముదురు రంగులు గల బట్టలు, కృత్రిమ దారాలతో తయారైన బట్టలు వేడిని గ్రహించి అసౌకర్యాన్ని కలిగిస్తాయి. వేసవిలో తెల్లటి వస్త్రాలు, నూలుతో తయారైన బట్టలు వేసుకోవాలి. వీటికి వేడిని గ్రహించే శక్తి తక్కువగా ఉంటుంది. వేసుకునే బట్టలు మరీ లైట్‌గా లేకుండా కాస్త లూజుగా వుండేట్లు చూసుకోవాలి.
-వేసవిలో ప్రకృతి ప్రసాదించిన తాటిముంజెలు శరీర తాపాన్ని తగ్గించి సేద తీరుస్తాయి. పల్లెల్లో విరివిగా దొరికే తాటిముంజెలు యిప్పుడు పట్టణాలలో కూడా బాగా విక్రయిస్తున్నారు. అడ్డమైన డ్రింకులకన్నా ఆరోగ్యానికి మేలు చేసే తాటిముంజెలు కొని తియనడం శ్రేయస్కరం. తప్పనిసరయితే పగటి పూట కంటే రాత్రి సమయంలో ప్రయాణాలు మంచిది. కొంతవరకు శరీరానికి ఉపశమనంగా వుంటుంది.
-వేసవిలో పిల్లలు, వృద్ధులు ప్రయాణాలు తగ్గించుకోవాలి. వీరు అధిక తాపాన్ని భరించడం కష్టం. ప్రయాణాల్లో తప్పనిసరిగా నీళ్లు వుండాలి. పాత రోజుల్లో మరచెంబులు పట్టుకెళ్ళేవారు, యిప్పుడు ప్లాస్టిక్ బాటిళ్ళు ఫ్యాషనైపోయింది. ఏదో ఒకటి నీళ్ళు అందుబాటులో వుంచుకోవాలి. ప్రయాణాల సమయంలో ఎక్కడపడితే అక్కడ తినుబండారాలు తినడం మంచిది కాదు.
-వేసవిలో వచ్చే మరో పెను ప్రమాదం- వడదెబ్బ. దీనిబారిన పడితే కోలుకోవడం చాలా కష్టం. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్ళినవారికి ఈ ప్రమాదం ఉంటుంది. వడదెబ్బ తగిలినవారికి వెంటనే తగిన ప్రథమ చికిత్స అవసరం. యిందులో ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా తగు మూల్యం చెల్లించాల్సి వస్తుంది.
-ఇరుకు గదులలో, రేకుల యిళ్లలో నివసించేవారు తీవ్రమైన ఉష్ణతాపానికి గురయ్యే ప్రమాదముంది. వారు మధ్యాహ్న సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
ఎప్పటికప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకుంటూ గ్రీష్మతాపం జయించాలేగానీ, మొండిగా ‘నాకేమీ కాదులే’ అని బయటకు వెళితే మాత్రం తగిన మూల్యం చెల్లించక తప్పదు.
ఎండాకాలం ఏటా వచ్చేదే అయినా ఏయేటికాయేడు వాతావరణంలో మార్పులతో ఉష్ణోగ్రతలు అత్యధిక స్థాయిలోకి వెళుతున్నాయి.
english title:
greeshma
Date:
Tuesday, May 21, 2013