ప్రభుత్వాలు ఎన్ని శాసనాలు చేసినా, అత్యున్నత న్యాయస్థానం పదే పదే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా దేశంలో మహిళల పరిస్థితులు మెరుగు పడడం లేదు. వివాహ బంధం కొంతమంది మహిళలకు నరకాన్ని చవిచూపిస్తున్న అనేక సంఘటనలు నిత్యం వెలుగు చూస్తూనే ఉన్నాయి. వివాహం జరిగాక- కోటి ఆశలతో కొత్త జీవితానికి నాంది పలకాలని కలలుగనే ఎంతోమంది మహిళలు అవస్థల పాలవుతున్నారు. భర్త, అత్తింటి వారి వేధింపులతో కొంతమంది మహిళలకు పసుపుతాడే ఉరితాడుగా మారుతున్న సంఘటనలపై దేశంలోని అత్యున్నత న్యాయ స్థానం ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఆడది మరబొమ్మ కాదు, మనసున్న మనిషి’- అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడంతో పరిస్థితి ఎంత దిగజారిందోనన్న విషయం స్పష్టమవుతోంది. మాంగల్య బంధంతో అత్తవారింట అడుగుపెట్టిన మహిళలు హింసకు గురవుతుండగా, మరోవైపు పెళ్లీడు రాకుండానే వివాహ వ్యవస్థలో బందీలవుతున్న బాలికల సంఖ్య తక్కువేమీ కాదు. న్యాయస్థానాలు, మన నేతలు ఈ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేయడం పరిపాటిగా మారిందే తప్ప,
మహిళల కష్టాలు తీరే మార్గం కానరావడం
లేదన్నది నిజం.
సాంకేతిక విజ్ఞానం, నాగరికత ఎంతగా కొత్తపుంతలు తొక్కుతున్నా, అదే రీతిలో సామాజిక విలువలు పతనమవుతున్నాయి. ఫలితంగా మహిళల మనుగడే ప్రశ్నార్థకమవుతున్న పరిణామాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అన్ని రంగాల్లోనూ మహిళలు ముందంజ వేస్తున్న నేటి ఆధునిక యుగంలో కొన్ని ఆచారాలు, సనాతన సంప్రదాయాలు వారికి ప్రతిబంధకంగా ఉన్నాయి. స్ర్తిని విలాస వస్తువుగా పరిగణించే భావజాలం అంతరించనందున వారిపై లైం గిక దాడులు నిత్యకృత్యమై భద్రత కరవైంది. ఇక వివాహ వ్యవస్థలో డబ్బు ప్రభావం నానాటికీ అధికమవుతోంది. కొత్త కోడలు ఇంటికి వస్తే తమకు ఎంత లాభం? అని బేరీజు వేసుకుని వివాహాన్ని వ్యాపార దృష్టితో చూసే వారి సంఖ్య తగ్గడం లేదు. కట్నకానుకల కారణంగానే చాలామంది మహిళలు గృహహింసను ఎదుర్కొంటున్నారు. పెళ్లయ్యాక మానసిక ప్రశాంతత బదులు కొంతమంది కోడళ్లు ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు. కట్నం వేధింపులు, గృహహింసకు బలైపోతున్న మహిళల సంఖ్య ఆందోళనకరంగా ఉన్నట్లు జాతీయ నేర నమోదు సంస్థ గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. హింసను తాళలేక మహిళలు ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు సర్వసాధారణమై పోయాయి.
దాంపత్య జీవిత మాధుర్యం ఎంతో గొప్పగా ఉంటుందని భావించే యువతుల కలలు ఫలించేలా సమాజం, కుటుంబ వ్యవస్థ తగురీతిలో స్పందించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవల సూచించింది. రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వం, సాధికారత వంటి ప్రాథమిక హక్కులు మహిళలకు దక్కడం లేదనడానికి అత్యున్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. ‘మహిళ సమస్యను వ్యక్తిగత సమస్యగా చూసినంత కాలం ఎలాంటి ప్రయోజనం ఉండదు, దాన్ని సామాజిక సమస్యగా పరిగణించినపుడే లింగ వివక్షను అంతం చేయగలం’- అని ప్రముఖ న్యాయ కోవిదుడు జస్టిస్ కృష్ణయ్యర్ పలికన మాటలు అక్షర సత్యాలు. వివాహం వల్ల మహిళకు సముచిత గౌరవం దక్కాలి. కట్నకానుకలను తగినంతగా తేలేదనో, మగపిల్లల్ని కనలేదనో కోడళ్లను రాచిరంపాన పెడుతుంటే వివాహ వ్యవస్థ మసకబారే ప్రమాదం తప్పదు.
ఇక పిల్లల్ని కనడంపై కూడా అత్తింటి వారు ఆంక్షలు పెరగడంతో మహిళలు మాతృత్వపు మాధుర్యానికి దూరమైపోతున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయించి, ఆడపిల్ల పుడుతుందని తెలిస్తే బలవంతంగా గర్భస్రావాలు చేయిస్తున్నారు. మన దేశంలో ఏటా సుమారు 70 లక్షల గర్భస్రావాలు జరుగుతున్నట్లు ఓ అంచనా. ఇందులో ఐదింట రెండు మాత్రమే సురక్షిత గర్భస్రావాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. వైద్యశాస్త్రం ఎంతగా ప్రగతి సాధించినా ప్రసవ సమయంలో మరణిస్తున్న తల్లుల సంఖ్య అధికంగానే ఉంటోంది. వైద్య సదుపాయాలు అందుబాటులో లేనందున 60 శాతానికి పైగా ప్రసవాలను మంత్రసానులే నిర్వహిస్తున్నారు. బలవర్ధక ఆహారం లేకపోవడం, అనారోగ్యం, ఆందోళనలు, ఒత్తిడుల ఫలితంగా గర్భధారణ తర్వాత 13 శాతం మంది మహిళలు హిస్టీరియా వంటి మానసిక సమస్యలకు లోనవుతున్నారు. మానసిక స్థితి క్షీణించే వారిలో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గ్రామాల్లో అయితే మహిళల దుస్థితి గురించి చెప్పనవసరం లేదు. యువతులు, వివాహిత స్ర్తిలల్లో దాదాపు 80 శాతం మంది రక్తహీనతతో బాధ పడుతున్నారు. పట్టణాల్లోనూ పేద, మధ్య తరగతి మహిళలు ఇవే సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఉద్యోగాలు చేస్తూ భారీగా సంపాదిస్తున్న మహిళలకూ అనేక రూపాల్లో సమస్యలు తప్పడం లేదు. పనిభారం, నిద్రలేమి, వత్తిడులు, వేళకు తిండి లేకపోవడం, ఊబకాయం వంటి ఇబ్బందులతో పట్టణ ప్రాంత మహిళలు సతమతమవుతున్నారు. పల్లెలు, నగరాలనే తేడా లేకుండా మహిళలు ఇంటా బయటా సమస్యలను ఎదుర్కొంటూ జీవన పోరాటం చేస్తున్నారు. మానసిక, శారీరక ఆరోగ్యానికి మహిళలు దూరమైపోతే- ‘ఆరోగ్యవంతమైన సమాజా’న్ని ఎలా ఊహించగలం? తనకు ఎలాంటి సమస్య ఎదురైనా మహిళ ద్వారా సాంత్వన పొందే పురుషుడు ఆమె పట్ల ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు? ప్రేమ, త్యాగం, బాధ్యతలకు మారుపేరైన ఆమె పట్ల ఎందుకీ వివక్ష? కుటుంబ బాధ్యతల్ని నిండు మనసుతో స్వీకరించే మహిళకు పురుషుడు ఆలంబన కావాలి. ఆమెకు కుటుంబ సభ్యుల మద్దతు అవసరం. ఆత్మీయులు ఆసరాగా ఉన్నపుడే మహిళ నిర్ణయాధికార శక్తిగా అవతరిస్తుంది. వేధింపులు, వేదనల నుంచి ఆమెకు విముక్తి లభించినపుడే కుటుంబ వ్యవస్థ ఆరోగ్యవంతంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది.