బంగారుపాళ్యం, మే 21: మండలంలోని మామిడి రైతులు నష్టాన్ని చవిచూస్తున్నారు. గత ఏడాదికన్నా మామిడి దిగుబడి చాలా వరకు తగ్గిపోయింది. ఇటీవల కాలంలో వీచిన గాలులకు, 40శాతం పంట రాలిపోయింది. శుక్రవారం సాయంత్రం వీచిన పెనుగాలులకు ఉన్న పంట కాస్త రాలిపోయింది. మండలంలో సుమారు 20టన్నుల మామిడి రాలిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది మామిడి దిగుబడి సరిగా లేదు. పైగా వాతావరణ పరిస్థితులు రైతులను దెబ్బతీశాయి. రాలిన మామిడిని ప్రస్తుతం మార్కెట్‌కు తరలిస్తే కూలీలు, ట్రాక్టర్ బాడుగలు కూడా రాలేదని రైతు దొరస్వామి వాపోయారు. ప్రతి ఏడాది ఏదోరకంగా మామిడి రైతును కృంగతీస్తూ నష్టాల్లో ముంచుతుందని రైతులు తెలిపారు. మండలంలో సుమారు 15వేల ఎకరాల్లో మామిడి పంటలు సాగులో ఉన్నాయి. ఇందులో 50శాతం పూత మాత్రమే పూసింది. వీటిలో చాలా వరకు గాలి, వానలతో పూత పిందెలు రాలిపోగా కోతకు వచ్చిన కాయలు టన్నుల లెక్కలో రాలిపోవడంతో రైతులు దిగాలు పడుతున్నారు. సంవత్సరకాలం చెట్లను కాపాడి, పూత సమయంలో కీటకనాశని మందులు పిచికారి చేసి రేయింబవళ్లు కాపాడిన పంట చేతికందే సమయంలో రాలిపోవడంతో రైతులు కంటతడిపెట్టారు. దీంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఎకరాకు 40వేల రూపాయలు పెట్టుబడులు పెట్టి 20వేల రూపాయలు పైగా నష్టం వాటిల్లుతున్నట్లు రైతులు పేర్కొన్నారు. ప్రతి ఏడాది మండల కేంద్రం నుంచి వేల టన్నులు మామిడి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అయ్యేది. ఈ ఏడాది ఎగుమతి చేసేందుకు పంట దిగుబడి చాలదని తలపండిన రైతులు అంటున్నారు. నష్టాలను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని పలువురు రైతులు కోరుతున్నారు.
కాకర్లవారిపల్లెలో...
పాకాల: పాకాల మండలం దామలచెరువు సమీపంలోని కాకర్లవారిపల్లె, చుక్కావారిపల్లె పరిసరాల్లో సోమవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో చేతికి వచ్చిన మామిడి పంట భారీగా నేలరాలిపోగా, అరటితోటలు, తమలపాకు తోటలు ధ్వంసం అయ్యాయి.
మండలంలోని మామిడి రైతులు నష్టాన్ని చవిచూస్తున్నారు
english title:
mango
Date:
Wednesday, May 22, 2013