మదనపల్లె, మే 21: ఆ దంపతులకు పిల్లలే ఆస్థిపాస్తులు అనుకున్నారు. ఉన్న కొద్దిపాటి ఆస్థిని చదువులకోసం తెగనమ్మి దారాదత్తం చేశారు. చివరికి వారికి మిగిలింది ఉంటడానికి పూరిపాక, బిడ్డలలో ఒకరు మూగ, మరొకరు లింగమార్పిడి చేసుకుని హిజ్రాగా మారిపోయి ఆ తల్లిదండ్రులకు తీవ్ర కడుపుకోత మిగిల్చారు. ఉన్నత చదువులు చదివి ప్రయోజకులై వృద్ధాప్యంలో ఆదుకుంటారనుకున్న ఆశలు ఒక్కరుకూడా నెరవేర్చలేక పోతారన్న చేదు అనుభవాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేక పోతున్నారు. కళ్ల ముందే యువతి అవతారంతో తిరుగుతున్నాడంటూ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి మార్పు చేసి అప్పగించాలని కోరినా.. వారికి న్యాయం జరగలేదు. వివరాలు ఇలావున్నాయి.. మదనపల్లె రూరల్ మండలం కొత్తవారిపల్లె పంచాయతీ రెడ్డివారిపల్లెకు చెందిన వల్లూరి నరసింహులు, లక్ష్మిదేవిలకు తులసీరామ్ (20), హరిక్రిష్ణ (16)లు సంతానం. పెద్దకుమారుడు తులసీరామ్ ఒకటి నుంచి ఏడు వరకు రెడ్డివారిపల్లె, 8వ తరగతి నుంచి సిటిఎం జడ్‌పి హైస్కూల్, పదవ తరగతి కురబలకోట, ఇంటర్ మదనపల్లెలోని ఓప్రైవేట్ కళాశాలలో రూ. 5లక్షలకు పైగా ఖర్చుచేసి చదివించారు. ఇంటర్ పూర్తయిన తులసీరామ్ ప్రవర్తనలో మార్పువచ్చింది. స్థానిక వారపుసంతలో హారతి అనే హిజ్రా రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడి తల్లిదండ్రులకు చెప్పకుండా ఇళ్లు వదిలి వెళ్లిపోయాడు. ముంభై, పూణే, బెంగళూరు, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో హిజ్రాల గ్రూపుల్లో ఉంటూ ఏడాది క్రితం ఇంటికొచ్చాడు. తాను పురుషుడుగా జీవించలేనని, యువతిగా మారిపోతానని తల్లిదండ్రులకు చెప్పాడు. అందుకు తల్లిదండ్రులు నిరాకరించారు. ఇంటిలో ఎవరికి చెప్పకుండా తిరిగి హిజ్రాగ్రూపుల్లోకి చేరుకున్నాడు. బెంగళూరులో ఉంటూ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో హిజ్రాల సాయంతో లింగమార్పిడి చేయించుకున్నాడు. మొత్తం కట్టుబొట్టు సంప్రదాయాల ఆడపిల్ల వేషధారణలోకి వచ్చిన తులసీరామ్‌కు హిజ్రాలు శిరీషా అనే నామకరణం చేశారు. అప్పటినుంచి పల్లెవైపు కనె్నత్తి చూడలేదు. తన బిడ్డ చనిపోయాడేమో అనుకున్న తరుణంలో మదనపల్లె మండలం బాలాజినగర్‌లోని స్నేహితుని ఇంటికొచ్చి తనను ఇక్కడికే వచ్చి చూడాలని తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. ఎన్నో ఆశలతో వచ్చిన తల్లిదండ్రులు కుమారుడు యువతి అవతారంలో కన్పించగానే తల్లడిల్లిపోయారు. నీవు ఇలా మారిపోతావని అనుకొని ఉంటే.. పురిటిలోనే చంపేసేవారమని.. తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతి అవతారంలో వచ్చిన కుమారుడిని వెంటపెట్టుకుని రెండవ పట్టణపోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి మందలించి మార్పుచేయాలని తల్లిదండ్రులు పోలీసుల కాళ్లా వేళ్లా పడినా ఫలితం లేకపోయింది. చివరకు ఎవరు బలవంతంగా లింగమార్పిడి చేయలేదని.. తులసీరామ్ అవతారంలో ఉన్న శిరీషా తెలిపింది. తల్లిదండ్రులతో ఉండేందుకు ఇష్టం లేదని, తన స్నేహితులైన హిజ్రాలతోనే ఉంటానని తేల్చిచెప్పి వెళ్లిపోయింది. చేసేది లేక వృద్ధదంపతులు కన్నీరుకార్చుకుంటూ ఇంటిముఖం పట్టారు. ఈ ఘటన మంగళవారం మదనపల్లె పట్టణంలో సంచలనం రేపింది. హిజ్రాగా మారిన తులసీరామ్‌ను చూడటానికి సహచర స్నేహితులు సైతం పరుగున పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు.
ఆ దంపతులకు పిల్లలే ఆస్థిపాస్తులు అనుకున్నారు
english title:
sex change
Date:
Wednesday, May 22, 2013