కర్నూలు, మే 21: జిల్లాలో బెల్టు షాపుల తొలగింపునకు ఎక్సైజ్ అధికారులు ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా బెల్టు షాపులను ఎత్తి వేయించి నెలలోగా నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశాలు జారీ చేసి పక్షం రోజులు గడుస్తున్నా జిల్లా ఎక్సైజు అధికారులు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ రెండు వారాల్లో ఒక్క బెల్టు షాపుపై కూడా దాడి చేసి ఎత్తివేయించే ప్రయత్నాలు చేయకపోవడం పట్ల ప్రజల్లో విస్మయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర ఖజానా నింపుకునేందుకు ప్రభుత్వం మద్యం విక్రయాలపై ఎక్సైజ్ అధికారులకు లక్ష్యాలను నిర్ధేశించింది. ఆ మేరకు ఎక్సైజ్ అధికారులు, మద్యం వ్యాపారులు ఆదాయం పెంచుకునేందుకు వారి వారి పరిధిలో బెల్టు షాపుల ఏర్పాటుకు తెరదీశారు. అయితే ముఖ్యమంత్రి కిరణ్ ఎక్కడికి వెళ్లినా మహిళల నుంచి బెల్టు షాపులపై వ్యతిరేకత ఎదురవడంతో చేసేదేమీ లేక బెల్టు షాపులను తొలగించడం అంత సులభం కాదని తెలిసినా ఎత్తివేతకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ తరువాత ఈ అంశంపై ఎలాంటి సమీక్ష నిర్వహించకపోవడంతో ఆదేశాలు అమలుకు నోచుకోలేదని ప్రజలు భావిస్తున్నారు. మహిళలను మభ్యపెట్టేందుకే సిఎం ఆదేశాలు జారీ చేశారని చిత్తశుద్ధి లేకపోవడంతో అధికారుల్లో చలనం లేదని ప్రతిపక్ష పార్టీలు సైతం విమర్శిస్తున్నాయి. జిల్లాలో సుమారు 980 గ్రామాల్లో అనధికారికంగా దాదాపు 2,640 బెల్టు షాపులు ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఈ షాపులన్నింటినీ ఎక్సైజ్ అధికారుల ప్రోత్సాహంతోనే వ్యాపారులు ఏర్పాటు చేయించారన్నది జగమెరిగిన సత్యం. ఈ షాపుల నిర్వాహకులు వ్యాపారుల నుంచి తక్కువ పెట్టుబడితో మద్యం సీసాలు కొనుగోలు చేసి ఇంటి వద్ద విక్రయిస్తుండడంతో కళ్లెదుట మద్యం లభ్యమవుతుండటంతో మందుబాబులు మద్యం తాగడం ఎక్కువైనట్లు మహిళలు మండిపడుతున్నారు. వ్యాపారులకు వచ్చే ఆదాయంలో సుమారు 25 శాతానికి పైగా బెల్టు షాపుల నుంచే వస్తోందని అంచనా వేస్తున్నారు. అంతేగాక ఎక్సైజు అధికారులకు ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలను చేరుకునేందుకు మద్యం దుకాణాల సహకారం అత్యధికంగా ఉంది. దీంతో బెల్టు షాపులను ఎత్తివేయడం అంత సులభంగా అయ్యే పని కాదని ప్రజలు సైతం పేర్కొంటున్నారు. అయితే ప్రభుత్వం మద్యం విక్రయాలపై అధికారులకు లక్ష్యాలను నిర్ధేశించకుండా నాటుసారా, బెల్టు షాపుల ఏరివేతకు ప్రాధాన్యం ఇచ్చి వారిని అందుకు ఉపయోగిస్తే సాధ్యమవుతుందని పేర్కొంటున్నారు. ఒక వైపు ఆదాయాన్ని పెంచమని ఒత్తిడి తీసుకువస్తూ మరో వైపు బెల్టు షాపులను ఎత్తి వేయమంటే వీలు కాని పని అని కొందరు ఎక్సైజ్ అధికారులే పేర్కొంటున్నారు. కారణాలు ఏమైనా బెల్టు షాపుల తొలగింపు ఆదేశాలకే పరిమితం కావడంతో మహిళల్లో గతంలో ఉన్న ఆగ్రహం రెట్టింపవుతోంది. దీని ప్రభావాన్ని ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాలి.
* సమీపిస్తున్న గడువు..
english title:
belt
Date:
Wednesday, May 22, 2013