మహానంది, మే 21: అవినీతి రాజకీయ ప్రక్షాలనకు యువతరం నడుంబిగించి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయ ణ పిలుపునిచ్చారు. మంగళవారం మహానంది గిరిజన ఆశ్రమ పాఠశాలలో జరుగుతున్న రాయలసీమస్థా యి ఎఐఎస్‌ఎఫ్ విద్యావైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎఐఎస్‌ఎఫ్ జాతీయ కార్యదర్శి లెనిన్‌బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన యువతనుద్దేశించి మాట్లాడుతూ రూ. 3 లక్షల కోట్ల బకాయిలు ధనవంతులే బ్యాంకులకు ఎగనామం పెట్టినా పట్టించుకోని వారు రైతుల రుణాలపై వత్తిడితెస్తు వారిని కష్టాల కడలిలో నెట్టడం ఎంతవరకు సమంజసం అన్నారు. 2జీ సెక్ట్రం కుంభకోణంలో కేంద్ర మంత్రి రాజా ఒక్కడే అవినీతికి పాల్పడే ధైర్యం లేదని ఇందులో సోనియా, మన్మోహాన్‌సింగ్‌లకు హస్తం ఉందన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో సిబిఐ చార్జీషీట్‌లో మంత్రులైన సబితాఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాద్‌ల పేర్లు ఉండడంపై కళంకిత మంత్రులుగా పేరు సంపాదించుకున్నారని ఆయన వివరించారు. స్వీస్‌బ్యాంకుల్లో ఉన్న రూ. 73 లక్షల కోట్లు మనదేశానికి తేస్తే దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. కర్నాటకలో 226 మంది ఎమ్మెల్యేల్లో 200 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వర్లు ఉన్నారని ఒక్కరు కూడ ప్రజాసేవ చేసే నాథుడు లేడన్నారు. వైయస్ రాజశేఖర్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక జగన్ లక్ష కోట్ల రూపాయలు సంపాదించారన్నారు. జగన్‌తోపాటు వైయస్‌ఆర్ మంత్రి మండలిని కూడ జైల్లో పెట్టాలన్నారు. దేశంలో 2.50 లక్షల మంది అత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. వారి కుటుంబాలను అదుకోవడంలో మన్మోహాన్ సర్కార్ విఫలమైనట్లు తెలిపారు. విజయమాల్యకు మాత్రం బ్యాంకు రుణాలు అందేలా ప్రధానమంత్రి సిఫార్సు చేశారని ఆయనకు రూ. 7 వేల కోట్లు బ్యాంకు నుండి రుణాలు ఇప్పించారన్నారు. మన్మోహాన్‌సింగ్ ప్రపంచ బ్యాంకులో పనిచేశారని రూ. 5 లక్షల వరకు ప్రతినెలా పెన్షన్ వస్తుందన్నారు. అణు ఒప్పందం కోసం 330 మంది ఎంపిలను 13 పార్టీలు వ్యితిరేకిస్తే యూపిఎ సర్కార్ ఎఫ్‌టిఐకి సానుకూలంగా మద్దతు తెలిపారన్నారు. ప్రస్తుతం క్రికెట్‌లో కూడ అవినీతి పాలన సాగుతుందన్నారు. ప్రపంచ దేశాలతో భారతదేశాన్ని పోలిస్తే సుసంపూర్ణమైన భారతం మనది అని ఇక్కడ రెండుకార్లు పండిస్తే ఇతర దేశాల్లో ఒకకారు మాత్రమే పంట పండిస్తారన్నారు. భారత సంతతి ఇతర దేశాల్లో అర్థికశాస్త్రం సాంకేతి రంగాల్లో రాణిస్తుందన్నారు. వీరందరికి మనదేశంలో సరైన అవకాశం కల్పిస్తే ప్రయోగాలు సఫలం అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రామాజంనేయులు, ఉస్మానియా యూనివర్శిటి తెలుగు ప్రొఫెసర్ ఖాసీం, రాష్ట్ర కార్యదర్శి బయన్న, ఎఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్, శ్రీనివాసులు, రంగన్న, అనంతపురం కార్యదర్శులు రామాంజనేయులు, అంజి, చిత్తూరు కార్యదర్శి విశ్వనాధ్, నంద్యాల సిపిఐ నాయకులు బాబాఫకృద్దిన్, రమేష్, రాజు, వెంకటేష్ పాల్గొన్నారు.
* సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ
english title:
narayana
Date:
Wednesday, May 22, 2013