సిమ్లా, మే 24: చట్టసభల కార్యకలాపాలకు తరచూ గందరగోళాలు, వాయిదాల కారణంగా అవరోధం కలుగుతున్న నేపథ్యంలో ఈ సమస్యకు ఒక పరిష్కారం కనుగొనాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ రాజకీయ పార్టీలను కోరారు. ‘పార్లమెంటు, శాసన సభలు ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకుండా తరచూ వాయిదా పడుతూ ఉండడం నాకు ఆవేదన కలిగిస్తోంది’ అని శుక్రవారం ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్వర్ణోత్సవాల కార్యక్రమంలో మాట్లాడుతూ రాష్టప్రతి అన్నారు. చట్టసభల కార్యకలాపాల్లో డిబేట్ (చర్చ), డిసెంట్ (అభ్యంతరం), డిసిషన్ (నిర్ణయం) అనే పదాలకు తోడు కొత్తగా మరో ‘డి’ అంటే డిస్రప్షన్ (అవరోధం) అనే పదం కూడా చేరడం ఇటీవలి కాలంలో మనం చూస్తున్నాం’ అని రాష్టప్రతి అన్నారు. అయితే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అవరోధానికి ఎలాంటి పాత్రా లేదని రాజకీయ శాస్త్రం చెప్తోందని కూడా ఆయన అన్నారు. తమ మాటనే నెగ్గించుకోవడానికి కొద్ది మంది ఈ పని చేస్తూ ఉన్నారని కూడా ఆయన అన్నారు. పదే పదే చట్టసభల కార్యకలాపాలకు అవరోధాల వల్ల దేశానికి ముఖ్యమైన ఆర్థిక బిల్లులపై సరయిన చర్చ జరగడం లేదని కూడా ఆయన అన్నారు. రెవిన్యూ ఖర్చు అనేక రెట్లు పెరిగిపోవడంతో పాటుగా సమస్యలు అధికమయిన తరుణంలో పార్లమెంటు సమయంలో 30 శాతం మాత్రమే ద్రవ్య, ఆర్థికపరమైన అంశాలపై చర్చకు కేటాయించడం జరుగుతోందని ప్రణబ్ అన్నారు. ఖర్చులను స్క్రూటినీ చేయడానికి, పద్దులపై చర్చ జరపడానికి, ఆర్థిక బిల్లుపై లోతుగా చర్చించడానికి ఎంపీలు, ఎమ్మెల్యేలకు సమయం లభించడం లేదని రాష్టప్రతి అంటూ, వీరుకాకపోతే మరెవరు ఆ పని చేస్తారని ప్రశ్నించారు. మన విధులను, బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం కోసం ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు. అయితే నేను నా బాధ్యతలను నెరవేర్చకపోతే అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు’ అని ఆయన అన్నారు. చట్టసభల కార్యకలాపాలకు తరచూ అంతరాయం కలగడానికి కారణాలేమిటో చర్చించి దానికి ఒక పరిష్కారాన్ని కనుగొనాలని ఆయన రాజకీయ పార్టీల నేతలను, ప్రభుత్వాలను కోరారు. ఈ సమస్యకు ఒక పరిష్కారం కనుగొనగలమని తాను ఆశిస్తున్నట్లు కూడా ఆయన చెప్పారు.
రాష్ట్రంలో మూడు రోజుల పర్యటనకోసం వచ్చిన రాష్టప్రతి ఈ కార్యక్రమం తర్వాత ఇక్కడి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్‌లో టాగూర్ సెంటర్‌ను ప్రారంభించారు. దిగజారుతున్న నైతిక విలువల ఊబిలో కూరుకుపోతున్న దేశాన్ని దానినుంచి బైటికి లాగడానికి టాగూర్ లాంటి ఆదర్శప్రాయులు అవసరమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. రాష్ట్ర గవర్నర్ ఊర్మిళా సింగ్, ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ బిబిఎల్ బుటైల్, ప్రతిపక్ష నాయకుడు పికె ధుమాల్ కూడా ఈ కార్యక్రమంలో ప్రసంగించారు.
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ నుంచి జ్ఞాపికను అందుకుంటున్న రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ.