వాషింగ్టన్, మే 24: పనె్నండేళ్ల క్రితం తాను ప్రారంభించిన ‘ఉగ్రవాదంపై యుద్ధం’ ఎంతకీ ఓ కొలిక్కి రాకపోవడంతో పాటు ఇస్లామిస్టు మిలిటెంట్లపై తాను సాగిస్తున్న ఈ ‘యుద్ధం’పై విమర్శలు వెల్లువెత్తుతుండటంతో ఇక ఈ యుద్ధానికి క్రమంగా స్వస్తి పలకడానికి అగ్ర రాజ్యం అమెరికా సిద్ధమవుతోంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గురువారం చేసిన ప్రధాన విధానపరమైన ఉపన్యాసం ఈ విషయాన్ని వెల్లడిస్తోంది. అల్‌ఖైదా, దాని మిత్రపక్ష ఉగ్రవాద సంస్థలను లక్ష్యంగా చేసుకొని అమెరికా చేస్తున్న ద్రోన్ దాడుల పరిధిని తగ్గించడానికి, క్యూబాలోని గ్వాంటనామో సైనిక జైలును మూసివేయడానికి ఒబామా చర్యలు తీసుకున్నారు. అమెరికా గతంలో ఇంటరాగేషన్ సందర్భంగా తీవ్ర వేధింపులకు పాల్పడిన విషయాన్ని అంగీకరించిన ఒబామా అల్‌ఖైదా వంటి ఉగ్రవాద సంస్థలను లక్ష్యంగా చేసుకొని చేసిన దాడుల్లో సామాన్య ప్రజలు మరణించడం పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. న్యాయపాలనను అమెరికా ఎగతాళి చేస్తోందనడానికి, ఉల్లంఘిస్తోందనడానికి ప్రతీకగా గ్వాంటనామో జైలు ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం పొందిందని ఒబామా తన ఉపన్యాసంలో పేర్కొన్నారు. ఇరాక్, అఫ్గానిస్తాన్‌లపై యుద్ధానికి దిగి, ఎంతకూ ఎడతెగని ఈ యుద్ధాల్లో భారీ మూల్యం చెల్లించుకున్న అమెరికా అలసిపోయింది. ఇప్పటికీ ఉగ్రవాదంపై యుద్ధానికే అమెరికా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ, అమెరికాలోని అత్యధిక శాతం మంది ప్రజలు మాత్రం తమ ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య రంగం వంటి వాటిపట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ‘గత దశాబ్ద కాలంగా సాగిస్తున్న యుద్ధంలో మనం మంచి స్థితిలో ఉన్నాం’ అంటూ తన ఉపన్యాసాన్ని ప్రారంభించిన ఒబామా.. ‘అయితే అన్ని యుద్ధాలలాగే ఈ యుద్ధం కూడా ముగియాలి’ అంటూ తన ఉపన్యాసాన్ని ముగించారు. వాషింగ్టన్‌లోని నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీలో ఇచ్చిన తన ఉపన్యాసంలో ఒబామా అమెరికా ప్రజలను ఆకర్షించడానికి ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా ఇస్లామిక్ వర్గాల్లో అమెరికా పట్ల ఉన్న ప్రతికూల భావాలను మార్చడానికి తన ఉపన్యాసంలో ప్రయత్నించారు.
అమెరికా అధ్యక్షుడు ఒబామా
english title:
u
Date:
Saturday, May 25, 2013