రాజమండ్రి, మే 24: సన్న బియ్యం ధర కేజి రూ.55కు చేరుకునే దిశగా పెరుగుతోంది. ప్రస్తుతం మార్కెట్లో సన్న బియ్యం ధర రూ.53 నుండి రూ.54 వరకు పలుకుతోంది. ఆవిరిపట్టిన బియ్యం రూ.42 పలుకుతుంటే, కొత్త బియ్యం ధర రూ.42 పలుకుతోంది. ఆవిరిపట్టిన బియ్యాన్ని, పాత సన్న బియ్యంతో కలిపి రాష్ట్రంలోని కొన్ని చోట్ల కేజి రూ.50కి అమ్ముతున్నారే గానీ పూర్తిగా పాత సన్న బియ్యం రూ.50కి లభించాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టమేనని బియ్యం హోల్‌సేల్ వ్యాపారి ఒకరు ఆంధ్రభూమి ప్రతినిధికి చెప్పారు. పెళ్లిళ్ల సీజన్ కావటంతో పాటు, కరెంటు కోత కారణంగా రైస్ మిల్లులపై అదనపు భారం పడుతుండటంతో, ఆ భారం కూడా వినియోగదారులపైనే పడుతోంది. జనరేటర్ల సాయంతో మిల్లులను నడపాల్సి రావటంతో, జనరేటర్లకయ్యే ఖర్చును జనంపైనే మిల్లర్లు వేస్తున్నారు. దాంతో ధాన్యం ధరకు, బియ్యం ధరకు మధ్య అసలు పొంతన ఉండటం లేదు. రెండు బస్తాల ధాన్యాన్ని మరపట్టించటం ద్వారా ఒక బస్తా బియ్యం వస్తాయని, అందువల్ల ధాన్యం ధర కన్నా బియ్యం ధర రెట్టింపు ఉంటుందన్నది పాత లెక్క. ఇప్పుడా లెక్కలకు కాలం చెల్లింది. ధాన్యం ధరకు బియ్యం ధరకు మధ్య చాలా తేడా ఉంటోంది. అదేమంటే మార్కెట్లో డిమాండ్ ఆధారంగా బ్రాండ్ల ధరలు పెరుగుతున్నాయి. జనం కూడా బియ్యాన్ని చూసి కొనే రోజులు పోయాయి. బియ్యం సంచిని, సంచిపై ఉన్న బ్రాండ్‌ను చూసి మాత్రమే కొనుగోలుచేస్తున్నారని రిటైల్ వ్యాపారులు చెబుతున్నారు. కొన్ని బ్రాండ్ల సంచిల్లో ఉన్న బియ్యం ఎలా ఉన్నాగానీ, ఎంత ధరకైనా ఎగరేసుకుపోతున్న జనాన్ని చూసి జాలేస్తోందని హోల్‌సేల్ వ్యాపారి ఒకరు చెప్పారు. జనం అసలు నాణ్యమైన బియ్యం తినాలనుకుంటున్నారో, లేక బ్రాండ్లను తినాలనుకుంటున్నారో అర్ధంకావటం లేదన్నారు. జనం నోట్లో నానుతున్న కొన్ని బ్రాండ్లకు చెందిన సంస్థలు మార్కెట్లోని డిమాండ్‌ను బట్టి ఒక్కసారిగా ధర పెంచుతుంటే, ఆ వెనుకనే మిగిలిన బ్రాండ్లులేని బియ్యం ధరలు కూడా ఎగబాకుతున్నాయి. అంటే కొన్ని బ్రాండ్ల సంస్థలు సన్న బియ్యం ధరలను నెమ్మదిగా పెంచుకుంటూ పోతున్నారన్న మాట. ప్రస్తుతం కరెంటు కోతల కారణంగా మార్కెట్‌కు బియ్యం సరఫరా పూర్తిస్థాయిలో లేకపోవటం, దానికి తోడు పెళ్లిళ్ల సీజన్ కారణంగా డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవటం వంటి కారణాలతో పరిస్థిని అనుకూలంగా మార్చుకునేందుకు కొంతమంది బడా వ్యాపారులు, మిల్లర్లు ధరను పెంచేస్తున్నారు. తమ వద్ద బియ్యం నిల్వలు లేవని, కర్నూలు నుండి, ఇతర సన్నరకం ధాన్యాన్ని పండించే ప్రాంతాల నుండి బియ్యాన్ని తీసుకొస్తున్నామని చెబుతున్నారు. ధరను బట్టి ఆ ధాన్యాన్ని మార్కెట్‌కు విడుదలచేస్తున్నారని మరికొంత మంది వాదిస్తున్నారు. ఎఫ్‌సిఐకి లెవీ బియ్యాన్ని ఇచ్చేందుకు మిల్లర్లు పోటీపడుతుండటం వల్ల సన్న బియ్యంవైపు దృష్టి తగ్గిందని, ఇది కూడా డిమాండ్ పెరగడానికి ఒక కారణమని మరి కొందరు చెబుతున్నారు. ధర ఇలాగే పెరుగుతూ రూ.55కు చేరుకుంటుందని, ఆ తరువాత కూడా మరికొంత పెరిగినాగానీ, రూ.55వద్ద కొంత కాలం నిలకడగా ఉంటుందని హోల్‌సేల్ వ్యాపారులు అంచనావేస్తున్నారు.
ప్రథమాంధ్ర మహాసభ చారిత్రాత్మకం: పనబాక
బాపట్ల, మే 24: తెలుగుభాష మాట్లాడేవారంతా ఒకే రాష్ట్రంగా కలసి ఉండాలనే తలంపునకు అంకురార్పణ జరిగిన ప్రథమాంధ్ర మహాసభ చారిత్రాత్మకమైనదని, ఆ స్ఫూర్తితోనే రాష్ట్రం ఆవిర్భావం సాధ్యపడిందని కేంద్ర పెట్రోలియం, సహజవాయువులు మరియు జౌళి శాఖల సహాయమంత్రి పనబాక లక్ష్మి అన్నారు. గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలో ప్రథమాంధ్ర మహాసభ శతాబ్ది ఉత్సవాలను పతాకావిష్కరణ, జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి మాట్లాడుతూ తెలుగువారికి ప్రత్యేక రాష్ట్ర సాధనకు పురిగొల్పిన ప్రథమాంధ్ర మహాసభ శాశ్వత ఖ్యాతిని సొంతం చేసుకుందన్నారు. ఈ స్ఫూర్తితో అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగఫలితంగా ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు. రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ప్రథమాంధ్ర మహాసభ స్ఫూర్తిగా నిర్వహిస్తున్న శతాబ్ది వేడుకలు కూడా చారిత్రాత్మకం కావాలనే ఉద్దేశంతో తపాలాశాఖను ఒప్పించి, ప్రథమాంధ్ర మహాసభ శతాబ్ది ఉత్సవాలకు సంబంధించిన తపాలా కవర్‌ను పనబాక లక్ష్మి విడుదల చేశారు. బాపట్ల శాసనసభ్యుడు గాదె వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రథమాంధ్ర మహాసభ ఏ ప్రాంతానికి చెందింది కాదని, భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ప్రతిపాదనను తెరమీదికి తెచ్చిన చారిత్రక సంఘటన అని స్పష్టం చేశారు.
శ్రీవారికి 3 కోట్ల స్వర్ణహారం విరాళం
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి,మే 24: కలియుగ ప్రత్యక్షదైవం అయిన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి 3 కోట్ల రూపాయలు విలువ చేసే స్వర్ణహారాన్ని చెన్నైకి చెందిన ముంబయకి చెందిన భక్తుడు శుక్రవారం విరాళంగా అందజేశారు. అయితే 10 కిలోల బరువు కల్గిన బంగారు సాలిగ్రామ మాల అని ఆలయ వర్గాలు తెలిపాయి. అందుకే శుక్రవారం ఆ భక్తుడు విరాళంగా అందజేశారన్నారు. ఈనగదును ఆ భక్తుడు ఆలయ డిప్యూటీ ఇఓ చిన్నంగారి రమణ స్వీకరించారు.
ముగ్గురు మావోల లొంగుబాటు
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, మే 24: ముగ్గురు మావోయిస్టులు ఎస్పీ కార్తికేయ ఎదుట శుక్రవారం లొంగిపోయారు. సిపిఐ మావోయిస్టు దళ కమాండర్ మండంగి రమేష్‌తోపాటు సభ్యుడు తాడంగి ఉజ్జి అలియాస్ మల్లేష్, సానుభూతిపరుడు నాచిక రుహిణి లొంగిపోయారని ఎస్‌పి చెప్పారు. పోలీసు ఇన్‌ఫార్మర్ల పేరిట గిరిజనులను హతమార్చడం, గ్రామాల నుంచి వెళ్ళగొట్టడం, అనుమానంతో దేహశుద్ధి చేయడం వంటి మావోల చర్యలను చూసి వారు లొంగిపోవడానికి ముందుకు వస్తున్నారన్నారు. రమేష్, ఉజ్జి, రుహిణిలు ఒడిశాలోని నారాయణపట్నం బ్లాక్ కొరాపుట్ జిల్లాకు చెందినవారని తెలిపారు. ఉజ్జి, రమేష్‌లు గత ఏడాది మక్కువ మండలం వైఎన్ వలస, పార్వతీపురంలోని లిడికి వలస గ్రామాల్లో పిఎల్‌జిఎ వారోత్సవాలకు గోడ పత్రికలు బ్యానర్లను ఏర్పాటు చేశారన్నారు. 2009లో ఒడిశాలోని నాల్కొ కంపెనీ వద్ద సిఐఎస్‌ఎఫ్ క్యాంపుపై దాడి చేసి పది మంది పోలీసులను హతమార్చి ఆయుధాలను ఎత్తుకుపోయిన సంఘటనలోను, అదే ఏడాది నారాయణపట్నం బ్లాక్ ఆఫీసుపై కరవు దాడి, 2011లో శంకరరావును ఇన్‌ఫార్మర్ల నెపంతో హతమార్చిన సంఘటనలోను, 2012లో బందుగాం పోలీసు స్టేషన్ పరిధి, అలమండ గ్రామాల్లో సెల్ టవర్ల దగ్ధం, నారాయణపట్నం, పాలూరు వద్ద మాటువేసి పోలీసు వాహనాన్ని మందుపాతరతో పేల్చివేసిన సంఘటనలో పాల్గొన్నారని ఎస్పీ తెలిపారు.
విద్యుత్ రంగం అస్తవ్యస్తం
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, మే 24: విద్యుత్ వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారన్నారు. పెంచిన చార్జీలు తప్పని పరిస్థితుల్లో చెల్లిస్తున్నా సక్రమంగా విద్యుత్ సరఫరా చేయలేకపోతున్నారని మాజీ మంత్రి, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం నెల్లూరులో జిల్లా మినీమహానాడులో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. నెల్లూరు జిల్లాలో మనీ సర్కులేషన్ స్కీమ్‌లు నాలుగువందల కోట్ల రూపాయల వరకు వసూలు చేసి మోసగించినా ప్రభుత్వం మిన్నకుండటం దారుణమన్నారు. కండలేరు జలాశయ డెడ్ స్టోరేజి నీటిని చిత్తూరు జిల్లాకు తరలించాలని ప్రభుత్వం యోచించడం తగదని సోమిరెడ్డి విమర్శించారు. ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశాన్ని గెలిపించుకోవాల్సిన చారిత్రాత్మక అవసరం కార్యకర్తలపై ఉందని పిలుపునిచ్చారు. కుమారుడు కావాలంటే ఆస్తులు వదులుకోవాలని విజయమ్మకు సలహా ఇచ్చారు. జగన్ ఆర్థిక ఉగ్రవాదని, అతన్ని నడిరోడ్డుపై ఉరితీయాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యలను తాము సమర్ధిస్తామన్నారు. వైకాపాపేక మేడలా కూలిపోవడం తధ్యమంటూ సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. మేకపాటి సోదరులు, వైజాగ్ కొణతాల రామకృష్ణ, తెలంగాణాలో కొండా సురేఖ, కర్నూలులో భూమా నాగిరెడ్డి దంపతులు జగన్ వైఖరి పట్ల అసంతృప్తితో అలక బూనారన్నారు.
ప్రశ్నాపత్రంతో
పారిపోయన విద్యార్థి
కర్నూలు స్పోర్ట్స్, మే 24: పరీక్ష కేంద్రం నుంచి ప్రశ్న, జవాబుపత్రాన్ని పట్టుకుని ఇంటర్ విద్యార్థి పారిపోయాడు. ఈ సంఘటన కర్నూలులో శుక్రవారం జరిగింది. ప్రీమియర్ జూనియర్ కళాశాలలో సిఇసి మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి కె.వీరన్న శుక్రవారం నారాయణ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రంలో సివిక్స్ పరీక్ష రాసేందుకు వచ్చాడు. పరీక్ష ప్రారంభమైన కొద్ది సేపటికి తనిఖీ బృందం సెంటర్‌లోకి చేరుకోగానే వీరన్న తన వద్ద ఉన్న చీటీలతో పాటు ప్రశ్న, జవాబుపత్రాలతో చల్లగా గదినుంచి జారుకున్నాడు. సిబ్బంది, పోలీసులు గమనించేలోగా గేటుదాటాడు. దీంతో పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వారి ఆదేశాల మేరకు పోలీసుల సాయంతో విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వీరన్న నుంచి ప్రశ్న, జవాబుపత్రం, చీటీలు స్వాధీనం చేసుకున్నారు.
రూ. 80 కోట్లతో
ముక్కంటీశుని బడ్జెట్
శ్రీకాళహస్తి, మే 24: వచ్చే ఆర్థిక సంవత్సరానికి 80 కోట్ల రూపాయలతో ముక్కంటీశుని ఆలయ బడ్జెట్‌ను ఆమోదిస్తూ దేవాదాయ, ధర్మాదాయ శాఖ అనుమతి ఇచ్చింది. 81 కోట్లతో దేవస్థానం ఇఓ శ్రీరామచంద్రమూర్తి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే కమిషనర్ బలరామయ్య 80 కోట్ల రూపాయలకు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు పంపారు. 2012-13లో రాహుకేతు పూజల ద్వారా ఆలయానికి 35 కోట్ల రూపాయలు ఆదాయం లభించింది. అయితే ఈ ఏడాది 42 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందని ప్రతిపాదనలు చేశారు. నిర్మాణ పనులకోసం 14 కోట్లరూపాయలను ఖర్చు చేయనున్నట్లు అధికారులు ప్రతిపాదించారు. మహా కుంభాభిషేకానికి 3.85 కోట్ల రూపాయలు, స్వర్ణముఖి నదిపై వంతెన నిర్మాణం కోసం 6.5 కోట్ల రూపాయలు, స్నాన ఘట్టాల పునర్నిర్మాణం కోసం 60 లక్షల రూపాయలు ఖర్చు చేయనున్నారు.
చంద్రబాబు కృషిలో
వందో వంతైనా కష్టపడదాం
*చిత్తూరు జిల్లా మినీమహానాడు పిలుపు
చిత్తూరు, మే 24: తెలుగుదేశంపార్టీని 2014లో అధికారంలోకి తేవడానికి ఎంతో కష్టపడుతున్నారని, ఈ వయస్సులో రాష్టవ్య్రాప్తంగా పాదయాత్ర చేశారని టిడిపి రాష్ట్ర పరిశీలకుడు పయ్యావుల కేశవ్ అన్నారు. ఆయన కృషిలో వందోవంతైనా కష్టపడదామని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా మినీమహానాడు చిత్తూరులో శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ రాష్టప్రరిశీలకుని హోదాలో పయ్యావుల మాట్లాడుతూ బ్రిటీషువారి బానిస సంకెళ్ల నుండి దేశాన్ని కాపాడేందుకు నాడు గాంధీజీ దండి పాదయాత్ర చేశారని, నేడు రాష్ట్రాన్ని కాంగ్రెస్ అవినీతి పాలన నుండి కాపాడేందుకు బాబుపాదయాత్ర చేశారన్నారు. కళంకిత మంత్రులు సబిత, ధర్మానలను జైలుకు పంపేంతవరకూ టిడిపి పోరాటం చేస్తుందన్నారు. మేఘమథనం, ఎరువుల కుంభకోణంలో అవినీతి ఆరోపణలు ఉన్న మంత్రి రఘువీరారెడ్డిని కూడా మంత్రివర్గంనుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్‌కు సమానంగా బిల్లు చెల్లిస్తున్నప్పుడు హైదరాబాద్‌లో రెండు గంటలు, పల్లెల్లో 12గంటల కోత ఎందుకని ఆయన ప్రశ్నించారు. విద్యుత్ కూడా సక్రమంగా సరఫరా చేయలేని అసమర్థ ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు చేసిన పాదయాత్రలో వందోవంతు కార్యకర్తలు అందరు పార్టీకోసం కృషిచేస్తే 2014లో టిడిపి జెండాను ఎగురవేయవచ్చని పయ్యావుల అన్నారు.
ఈకార్యక్రమంలో ఎంపి శివప్రసాద్, మాజీ మంత్రులు గాలి ముద్దుకృష్ణమనాయుడు, బొజ్జల తదితరులు ప్రసంగించారు.
అభయగోల్డ్ కార్యాలయంలో
పోలీసుల సోదాలు
రికార్డుల స్వాధీనం * అదుపులోనే నిందితులు
విజయవాడ (క్రైం), మే 24: కోట్ల రూపాయల మేర ఖాతాదారులకు ఎగవేసిన అభయగోల్డ్ సంస్థ కార్యాలయంలో విజయవాడ పోలీసులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. అధిక వడ్డీ రేట్లు, స్కీము పద్ధతిలో భూముల కేటాయింపులు చేస్తామని ప్రకటనలు గుప్పించిన సంస్థ నిర్వహకులు ఎంతోమంది ఖాతాదారులనుంచి లక్షల్లో డిపాజిట్లు సేకరించి కొద్దిరోజుల క్రితం బోర్డు తిప్పేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా సంస్థ కార్యకలాపాలు స్తంభించిపోవడంతో మోసపోయిన బాధితులు ఇబ్బడిముబ్బడిగా బయటకు వచ్చారు. ఈ క్రమంలో విజయవాడలో సంస్థ ఎండి శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ విజయరాజులపై సూర్యారావుపేట పోలీసులు వేర్వేరుగా రెండు కేసులు నమోదు చేశారు. దీంతో పరారీలో ఉన్న సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసరావు, అతని భార్య అంబిక, డ్రైవర్ మహేష్‌లను గురువారం విజయవాడ పోలీసులు హైదరాబాద్ కొండాపూర్‌లోని ఒక హోటల్‌లో అదుపులోకి తీసుకుని విజయవాడ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కాగా ఇప్పటికీ పోలీసుల అదుపులో ఉన్న నిందితులను దర్యాప్తు అధికారులు రహస్య ప్రదేశంలో ఉంచి ముమ్మరంగా విచారిస్తున్నారు. కంపెనీ పేరుతో ఉన్న ఆస్తుల వివరాలు, అదేవిధంగా ఎండి శ్రీనివాసరావు జనం సొమ్ముతో కొనుగోలు చేసిన వ్యక్తిగత ఆస్తుల వివరాలపై ఆరా తీస్తున్నారు. మరోవైపు మోసపోయిన బాధితులు ఎంతమంది ఉండవచ్చని, మొత్తం మీద సంస్థ ఎన్నికోట్లకు బోర్డు తిప్పేసిందన్న అంశాలపై విచారిస్తున్నారు. దీనిలో భాగంగా అదుపులో ఉన్న శ్రీనివాసరావును వెస్ట్‌జోన్ ఎసిపి హరికృష్ణ, సిఐ జయరాజు తదితర అధికార బృందం వెంట పెట్టుకుని ఏలూరు రోడ్డులోని కార్యాలయం వద్దకు వచ్చి రెవెన్యూ అధికారుల సమక్షంలో తలుపులు తెరిచారు. కంప్యూటర్లలో డేటా పరిశీలించారు. రికార్డులు క్షుణ్ణంగా తనిఖీ చేసి విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సంస్థపై 35 కేసులు నమోదు కాగా ఈ సంఖ్య 50కు పెరిగినట్లు సమాచారం. బాధితులు మాత్రం అధిక సంఖ్యలో కార్యాలయం వద్దకు చేరుకుంటున్నారు. రికార్డులు పరిశీలిస్తున్నామని, పూర్తి సమాచారం రాబట్టిన మీదట నిందితులను అరెస్టు చేయనున్నట్లు ఎసిపి హరికృష్ణ తెలిపారు. సంస్థ పేరుతో కన్నా, ఎక్కువ ఆస్తులు ఎండి శ్రీనివాసరావు, బినామీ వ్యక్తిగత పేర్లతో ఉన్నట్లు సోదాల్లో పోలీసులు గుర్తించారు.
మోడీ వెంటే జనం
బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు దత్తాత్రేయ
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మే 24: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి అత్యధిక సీట్లను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ వెల్లడించారు. ప్రధాని అభ్యర్థిగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి ప్రజల మద్దతు పెరుగుతోందన్నారు. రాష్ట్రంలో కూడా పార్టీ మరింత బలాన్ని పుంజుకుందని శుక్రవారం విశాఖలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అభిప్రాయపడ్డారు. కేంద్రంలోను, రాష్ట్రంలోను అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు విసుగుచెంది ఉన్నారన్నారు. కేంద్రంలో యుపిఎ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు అవినీతి మయమైన కాంగ్రెస్ పాలనకు ప్రజలు చరమగీతం పాడనున్నారన్నారు. రైతు, ప్రజావ్యతిరేక విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో సైతం కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోదని ఆయన ఆరోపించారు. కళంకిత మంత్రులను కాపాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెపుతారన్నారు. అవినీతి వ్యతిరేక పాలనను ప్రజలు కోరుకుంటున్నారని, నరేంద్ర మోడి నాయకత్వాన్ని ప్రజలు ఆమోదిస్తున్నట్టు ఆయన తెలిపారు. రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యాచరణ చేపడుతున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో అత్యధికంగా పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలను దక్కించుకునేందుకు పార్టీ పరంగా విస్తృతస్థాయిలో చర్చించనున్ననట్టు వెల్లడించారు. జూన్ 7 నుంచి 9 వరకూ గోవాలో భారతీయ జనతాపార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశాలు జరుగనున్నట్టు తెలిపారు.
29 నుంచి
భ్రమరాంబిక
దర్శనం నిలిపివేత
శ్రీశైలం, మే 24: శ్రీశైలంలో కొలువైన భ్రమరాంబిక అమ్మవారి గర్భగుడిలో స్వర్ణమండపం ఏర్పా టు చేస్తున్న కారణంగా ఈనెల 29 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు దర్శనాలు నిలుపుదల చేస్తున్నట్లు దేవస్ధానం ఇఓ చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు. వైదిక కార్యక్రమాల్లో భాగంగా 29న ఉదయం మహాగణపతి పూజ జరిపించి మండప ఏర్పాటు సంకల్పం చేస్తామన్నారు. పుణ్యహవచనము, మాతృక పూజ, రుద్వివరణం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అమ్మవారి మూలమూర్తికి కళాపాకర్షణ కార్యక్రమం నిర్వహించి అమ్మవారి శక్తిని ఆగమ శాస్త్రోక్తంగా కళశంలోకి ఆవహింపజేస్తామన్నారు. 3వ తేదీ వరకు ఈ కళశానికే నిత్యపూజాదికాలు, నివేదనాది కైకంర్యాలు నిర్వహిస్తారన్నారు. భక్తులు కళశాన్ని దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు.