విశాఖపట్నం, మే 24: తెలుగు అక్షర శిఖరం, ప్రముఖ రచయిత రాయసం వెంకట త్రిపురాంతకేశ్వరరావు (త్రిపుర) కన్నుమూశారు. ఆయన వయసు 85 సంవత్సరాలు. తెలుగు భాషలో విశేష రచనలు చేసిన త్రిపుర కొంత కాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. విశాఖలోని ఒక ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందారు. దీంతో సాహితీ ప్రియులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఒక కుమార్తె వింధ్య విశాఖలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో పనిచేస్తూ హైదరాబాద్‌లోని టాటా యూనివర్శిటీ డీన్‌గా పదోన్నతిపై వెళ్లారు. రెండో కుమార్తె నటాషా ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉంటున్నారు. కుమారుడు ప్రొఫెసర్ నాగార్జున అమెరికాలో ఉంటున్నారు. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా పురుషోత్తపురంలో 1928 సంవత్సరంలో త్రిపుర జన్మించారు. హైస్కూల్, కళాశాల విద్య విశాఖలోని ఎవిఎన్ కళాశాల్లో పూర్తి చేశారు. బెనారస్ యూనివర్శిటీలో 1950లో అగ్రికల్చర్ బిఎస్సీ పూర్తి చేశారు. 1953లో ఎంఎ ఇంగ్లీష్‌లో యూనివర్శిటీకే అగ్రస్థానంలో నిలిచారు. 1960 వరకూ ఆయన వారణాసి, మాండలే (బర్మా), జోజ్‌పూర్, విశాఖపట్నంలో టీచర్‌గా పనిచేశారు. 1960లో త్రిపురలో మహరాజా వీర్ విక్రమ్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్‌గా చేరారు. 1987లో ఆయన పదవీ విరమణ చేశారు. ఆయన చాలా కాలం త్రిపురలోనే ఉండడంతో ఆయన కలం పేరును త్రిపురగా మార్చుకున్నారు. 1963-73 మధ్య కొన్ని రచనలు చేసిన త్రిపుర ఆ తరువాత ఏడేళ్ళపాటు సాహితీ ప్రపంచానికి దూరంగా ఉన్నారు. ఒంటరి జీవితం అంటే ఆయనకు ఇష్టం. ఏడేళ్ళు అలానే గడిపారు. తిరిగి 1980-90 మధ్యలో మళ్లీ తన కలానికి పదునుపెట్టారు. త్రిపుర తన సాహితీ జీవితంలో కేవలం 15 కథలు మాత్రమే రాశారు. కొన్ని కవితలు కూడా రాశారు. సెగ్మెంట్ అనే పేరుతో ఆయన రాసిన కథ విశేష ప్రాచుర్యం పొందింది. ఈ కథను వేగుంట మోహన్ ప్రసాద్ తెలుగులోకి స్వ-శకలాలు అనే పేరుతో అనువదించారు.
భమిడిపాటి రాంగోపాలం, వాకాటి పాండురంగారావు, కా.రా మాస్టారు, అబ్బూరి గోపాలకృష్ణ, అల్లం శేషగిరిరావు, అత్తులూరి నరసింహారావు, ఆదూరి సీతారామ్మూర్తి, వివిన మూర్తి వంటి సాహితీవేత్తలతో త్రిపురకు సన్నిహిత సాహిత్య సంబంధాలు ఉండేవి. అలాగే శామ్యూల్ బెకెట్ (నాటకకర్త), సాల్ బెల్లో, ఆల్టస్ హక్స్‌లీ, శ్రీశ్రీ వంటి ప్రముఖులు త్రిపురకు అభిమాన రచయితలు. ఆయన కాఫ్కా (జర్మన్ రచయిత) కవితల పేరుతో ఒక పుస్తకాన్ని రాశారు. వ్యథ ఒక కథ త్రిపుర రాసిన కవితల్లో మంచి పేరుపొందింది.
తెలుగు అక్షర శిఖరం, ప్రముఖ రచయిత రాయసం వెంకట త్రిపురాంతకేశ్వరరావు
english title:
t
Date:
Saturday, May 25, 2013