కడప, మే 24: కడప వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో నిర్మాణంలో ఉన్న బ్రహ్మణి స్టీల్ కర్మాగారం పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని వైకాపా సీనియర్ నేతలు ఆరోపించారు. పదివేల మందికి ఉపాధి కల్పించడంతోపాటు కడప జిల్లా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో చేపట్టిన బ్రహ్మణిని కేవలం రాజకీయ కక్షతో ప్రభుత్వం ప్రత్యామ్నాయం చేపట్టకుండా అర్ధాంతరంగా నిలిపేసిందని ధ్వజమెత్తారు. చిత్తశుద్ధి ఉంటే ముందుగా పరిశ్రమ నిర్మాణం కొనసాగడానికి ప్రత్నామ్నాయ చర్యలు తీసుకునేదని పేర్కొన్నారు. శుక్రవారం ఆ పార్టీకి చెందిన రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ సి నారాయణరెడ్డి, వైకాపా రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ రఘురామిరెడ్డి, డిసిసిబి ఛైర్మెన్ ఇ తిరుపాల్‌రెడ్డి, కడప మాజీ మేయర్ పి రవీంద్రనాథ్‌రెడ్డి, జడ్పీ మాజీ ఛైర్మన్, వైకాపా జిల్లా కన్వీనర్ కె. సురేష్‌బాబు, మాజీ ఎమ్మెల్యే డి.సి. గోవిందరెడ్డి, వైఎస్సార్ సిపి యువజన సంఘ జిల్లా అధ్యక్షుడు వైఎస్. అవినాష్‌రెడ్డి తదితరులు బ్రహ్మణీ స్టీల్స్‌ను సందర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ అసమర్థత, చేతగానితనం వల్లే ఫ్యాక్టరీ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కడప జిల్లా వెనుకబాటు తనాన్ని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధికి ప్రణాళిక రూపొందించారన్నారు. ఇందులోభాగంగానే పలు పరిశ్రమలతో పాటు బ్రహ్మణి పరిశ్రమ నెలకొల్పడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నారు. వైఎస్ మరో రెండేళ్లు జీవించి ఉంటే కడప జిల్లా ప్రజలకు అన్ని విధాలుగా మేలు చేకూరేదన్నారు. వైఎస్ అకాల మరణంతో కనీసం సానుభూతి లేకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన ఆశయాలకు తూట్లు పొడిచిందన్నారు. బ్రహ్మణీ స్టీల్స్‌కు ఇప్పటి వరకు యాజమాన్యం 1400 కోట్లు ఖర్చుచేసిందన్నారు. నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు, కడప ప్రజలు బ్రహ్మణి ఉక్కు కడప హక్కు అనే నినాదంతో కర్మాగారం పనులను పూర్తి చేయించే వరకు ఉద్యమం చేపట్టాలని పిలుపునిస్తున్నాయన్నారు. బ్రహ్మణీకి ప్రభుత్వం ఇచ్చిన భూములను, నీటి సరఫరాను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాలను వెంటనే ఉప సంహరింప చేయడంతోపాటు ఫ్యాక్టరీ నిర్మాణానికి ఉద్యమిస్తామన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలు ముందుకు రావాలన్నారు. దేశ రాజకీయాల్లో జగన్ నూతన వరవడి సృష్టిస్తారన్నారు. వైకాపా నేతల ప్రకటనతో గాలి జనార్ధనరెడ్డికి పరోక్షంగా మద్దతు లభిస్తున్నట్లవుతోంది.
ప్రభుత్వ చర్యతో కడప జిల్లాకు అన్యాయం వైకాపా నేతల ఎదురుదాడి
english title:
b
Date:
Saturday, May 25, 2013