హైదరాబాద్, మే 24: ఎండల్లో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్ కుమార్ పేర్కొన్నారు. ప్రధమ చికిత్సా సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని, గుక్కెడు మంచినీళ్లు అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, వడదెబ్బతో మృతి చెందిన వారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయిలు తక్షణం ఎక్స్‌గ్రేషియాగా చెల్లించాలని అన్నారు. రాష్ట్రంలో ఎండ తీవ్రతను జాతీయ విపత్తుగానే గుర్తించాలని, సింగరేణి కోల్‌బెల్ట్ ప్రాంతంలో తక్షణమే లేఆఫ్ ప్రకటించాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం వేసవికాలంలో అగ్నిప్రమాదాల నివారణకు తీసుకోవల్సిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం లేదని, అరకొర సిబ్బందితో, పాతవాహనాలతో అగ్నిమాపక కేంద్రాలు పేరుకు మాత్రమే ఉన్నాయని, వాటి నిర్వహణ సక్రమంగా లేదని అన్నారు. వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పులను కూడా జాతీయ విపత్తుగానే పరిగణించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన విధంగా స్పందించాలని బిజెపి కోరింది. సింగరేణి వ్యాపించి ఉన్న నాలుగు జిల్లాల్లో 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన నేపథ్యంలో తక్షణమే గని కార్మికులకు లే ఆఫ్ ప్రకటించాలని ఆయన సూచించారు.
బిజెవైఎం ధర్నా
ప్రభుత్వ అనుమతి లేకుండా కార్పొరేట్ కాలేజీల నిర్వహణను నిరసిస్తూ బిజెవైఎం శుక్రవారం నాడు ధర్నా నిర్వహించింది. రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ కళాశాలల్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని, మొత్తం కార్పొరేట్ కాలేజీలపైనే తాము పోరాటం చేస్తామని, విద్యాసంస్థలు ఒక మాఫియాగా ఏర్పడి వేసవిలో తరగతులు నిర్వహిస్తున్నారని అన్నారు. వేసవి తరగతులు నిర్వహిస్తున్న కాలేజీలపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. ప్రవీణ్‌కుమార్, బద్దం మహిపాల్‌రెడ్డి, జి. భరత్‌గౌడ్, నాగేంద్రరావు, నరేందర్‌రెడ్డి, శ్రీనివాసులు నాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
విద్యుత్‌పై కార్యాచరణ ప్రకటించాలి
టిడిపి డిమాండ్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 24: రాష్ట్రంలో విద్యుత్ సరఫరాపై కార్యాచరణ ప్రకటించాలని టిడిపి శాసన సభాపక్షం ఉప నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రికి పాలనా అనుభవం లేకపోవడం వల్ల విద్యుత్ సంక్షోభం తలెత్తి పరిశ్రమలు మూతపడే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. రాజీవ్ యువ కిరణాలు పథకంపై ప్రచార ఆర్భాటం తప్ప యువతకు ఉద్యోగాలు మాత్రం లభించలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి, మంత్రుల అవినీతి వ్యవహారాలు బయటపడడంతో తమ పదవులు కాపాడుకునేందుకు ఢిల్లీ చుట్టూ తిరగడం మినహా ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఎన్నికల్లో పేర్కొన్న విధంగా రెండున్నర లక్షల ఉద్యోగాలను భర్తీ చేయలేదని అన్నారు. విద్యుత్ మంత్రిని నియమించక పోవడం వల్ల రోజు రోజుకు విద్యుత్ సంక్షోభం ముదురుతున్నా పట్టించుకునే వారు లేరని అన్నారు. విద్యుత్ కోత, పెంచిన చార్జీల వల్ల 7.12 లక్షల చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో 6.3లక్షల పరిశ్రమలు నష్టాల్లో పడ్డాయని తెలిపారు. గత మూడేళ్లలో విద్యుత్‌ను యూనిట్‌కు మూడున్నర నుంచి ఏడు రూపాయలకు పెంచారని అన్నారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలపై ఆధారపడి రాష్ట్రంలో 40లక్షల మంది జీవిస్తున్నారు, వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే విద్యుత్ సరఫరా కార్యాచరణను రూపొందించాలని కోరారు. పరిశ్రమలు మూతపడకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
నేడు సిఎంను కలువనున్న టిడిపి
కళంకిత మంత్రులను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ టిడిపి ప్రజాప్రతినిధుల బృందం శనివారం ముఖ్యమంత్రిని కలువనుంది.
గ్రూప్-1 సర్వీసులకు వయోపరిమితి పెంచాలి
సిఎంను కోరిన రాఘవులు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 24: రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించబోయే గ్రూప్-1, 2, 4 నోటిఫికేషన్లతో పాటు జూనియర్-డిగ్రీ కాలేజీ లెక్చరర్ల రిక్రూట్‌మెంట్ వయోపరిమితిని 39 సంవత్సరాలకు పెంచాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి. వి. రాఘవులు కోరారు. బిసి, ఎస్సీ, ఎస్టీలకు వయోపరిమితిని 44 ఏళ్లకు గరిష్ట వయోపరిమితిని ఉండేట్లు చూడాలని ఆయన కోరారు. ఐదేళ్ల వయోపరిమితి సడలిస్తే లక్షలాది గ్రామీణ పేద నిరుద్యోగులకు లబ్దికలుగుతుందని అన్నారు. గత తొమ్మిదేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం మూడుసార్లు మాత్రమే నోటిఫికేషన్లు జారీ చేసిందని వాస్తవానికి ప్రతి ఏటా నోటిఫికేషన్లు ఇచ్చి ఉంటే బావుండేదని ఆయన అన్నారు. దీనిపై వీలైనంత త్వరలో నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు.
రాజకీయ పక్షాలకు
ఎండదెబ్బ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 24: రాష్ట్రంలోని రాజకీయ పక్షాలకు సైతం ఎండ దెబ్బ తప్పడం లేదు. రాష్ట్రంలో ఇంతకు ముందెన్నడూ లేనంత తీవ్రంగా ఎండలు ఉన్నాయి. జనం ఎండలకు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి. శుక్రవారం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఎండలు 50 డిగ్రీల సెల్సియస్ వరకు వెళ్లింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎండలను దృష్టిలో పెట్టుకుని రాజకీయ పక్షాలు తమ కార్యక్రమాల్లో మార్పులు చేస్తున్నారు. ఈనెల 27, 28 రెండు రోజుల పాటు మహానాడు నిర్వహించనున్నారు. సాధారణంగా మహానాడు మూడు రోజుల పాటు నిర్వహిస్తారు. ఎండలతో పాటు, ఇతర సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఈసారి మహానాడును రెండు రోజులకే పరిమితం చేశారు. చివరకు ఆ రెండు రోజుల మహానాడు ఏర్పాట్లకు సైతం ఎండలు అడ్డంకిగా మారాయి. మహానాడు ఏర్పాట్ల మీడియాలో ప్రచారం లభించడం కోసం రెండు వారాల ముందు నుంచే మీడియాను మహానాడు వేదిక వద్దకు తీసుకు వెళ్లి హడావుడి చేయడం టిడిపి ఆనవాయితీగా చేస్తున్నపని. ఇంతకు ముందు ఒకసారి మహానాడు వేదిక వద్ద మీడియాతో హడావుడి చేశారు. ఇక ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయని మీడియాకు వివరించడం కోసం శుక్రవారం మధ్యాహ్నాం మూడు గంటలకు టిడిపి నాయకులు ఏర్పాట్లు చేశారు. ఒకవైపు ఎండలకు రాష్ట్రంలో ఈ ఒక్కరోజే 35 మంది వరకు మరణించారని, ఎండలకు తాళలేక పిట్టల్లా రాలిపోతున్నారని చానల్స్‌లో వార్తలు చూసిన టిడిపి నాయకులు హడావుడిగా కార్యక్రమం రద్దు చేశారు. ప్రచారం కోసం ప్రయత్నిస్తు, ఎర్రటి ఎండల్లో రంగారెడ్డి జిల్లా గండిపేటలోని మహానాడు వేదిక వద్దకు వెళితే, ఈ ప్రయాణంలో జరగరానిది జరిగితే అనవసరంగా చెడ్డపేరు వస్తుందని కొందరు నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వేడి గాలులు వీస్తున్నాయని, ఉదయం పది గంటల నుంచి నాలుగు గంటల వరకు బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని శనివారం ఉదయం ఎనిమిది గంటలకు మహానాడు వేదిక ఏర్పాట్లు చూడాలని నిర్ణయించారు. ఇక జిల్లాల్లో నియోజక వర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలోని మినీ మహానాడులకు సైతం ఎండ దెబ్బ బాగానే తగిలింది. ఎక్కువ నియోజక వర్గాల్లో నామమాత్రపు తంతుగానే ముగించాల్సి వచ్చిందని పార్టీ నాయకులు తెలిపారు.
మహానాడు ఏర్పాట్లు
మహానాడు ఏర్పాట్లు భారీగా జరుగుతున్నట్టు టిడిపి నాయకులు తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే మహానాడులో వచ్చే ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేయనున్నట్టు తెలిపారు. అధికారంలోకి వస్తామనే విశ్వాసం కలిగించడంతో పాటు, చంద్రబాబు ఇచ్చిన హామీలపై చర్చించనున్నట్టు తెలిపారు. మహానాడు ఆమోదం పొందడం ద్వారా ప్రజల్లో విశ్వాసం కలిగించనున్నట్టు టిడిపి నాయకులు తెలిపారు. అయితే తెలంగాణపై ఇప్పుడు చెబుతున్న మాటలు తప్ప కొత్త ప్రకటన ఏమీ ఉండదని పార్టీ నాయకులు వివరించారు.
ఇచ్చిన మాట తప్పడమే
కాంగ్రెస్ సిద్ధాంతమా?
ప్రశ్నించిన డాక్టర్ మంద
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 24: ‘ఇచ్చిన మాట తప్పడమే కాంగ్రెస్ సిద్ధాంతమా?’ అని ఆ పార్టీ లోక్‌సభ సభ్యుడు డాక్టర్ మంద జగన్నాథం పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణనుద్దేశించి ప్రశ్నించారు. తెలంగాణపై తాము పార్టీకి డెడ్‌లైన్ పెట్టలేదని, అయితే ఈ నెల 30వ తేదీలోగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరామని చెప్పారు. శుక్రవారం సాయంత్రం తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఫోరం చైర్మన్ కె. కేశవరావు, ఎంపీలు డాక్టర్ మంద జగన్నాథం, రాజయ్య సమావేశమై చర్చించారు. సమావేశానంతరం డాక్టర్ మంద మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీకి చెందిన సీమాంధ్ర ఎంపి ఇటీవల అలక చెందితే ఆయనతో ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్ మాట్లాడి బుజ్జగించారని అన్నారు.
ముగ్గురు దళిత ఎంపీలు పార్టీ వీడడానికి సిద్ధమైతే పోతే పోనీయండి, వెళ్ళే వారిని పట్టుకోగలమా? అని అంటున్నారని ఆయన పరోక్షంగా పిసిసి అధ్యక్షుడు బొత్సనుద్ధేశించి విమర్శించారు. రెండు రోజుల క్రితం నిర్వహించిన పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశం నుంచి దళితుడైన డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహ వెళ్ళిపోయారంటే దళితులకు ఎటువంటి న్యాయం జరుగుతున్నదో స్పష్టమైందని ఆయన తెలిపారు. తాము పార్టీని వీడడం ఖాయమని, అయితే జూన్ 2వ తేదీన కాదని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దీంతో పార్టీకే నష్టమని ఆయన తెలిపారు.
చిరంజీవిపై సిబిఐకి ఓయు జాక్ ఫిర్యాదు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 24: ఇటీవల రాజధానిలో జరిగిన ప్రపంచ పర్యాటక సదస్సు సందర్భంగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఓయు జాక్‌కు చెందిన కొంత మంది విద్యార్ధులు శుక్రవారం ఇక్కడ సిబిఐ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదుచేశారు. ఈ అంశంపై తక్షణమే విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. శనివారం ఇక్కడ ఓయుజాక్‌కు చెందిన విద్యార్ధులు కోఠీలోని సిబిఐ కార్యాలయానికి వచ్చి వినతిపత్రం ఇచ్చారు. రాజధానిలో ఇటీవల జరిగిన ప్రపంచ పర్యాటక సదస్సు సందర్భంగా రెండు కోట్ల రూపాయల వరకు నిధుల దుర్వినియోగం జరిగిందని వారు ఆరోపించారు. ఈ అంశంపై దర్యాప్తు జరిపించాలని వారు కోరారు. సమాచార హక్కు చట్టం కింద తాము సమాచారాన్ని సేకరించామన్నారు. ప్రజాధనాన్ని నీళ్లప్రాయంగా చిరంజీవి ఖర్చుపెట్టారని ఓయుజాక్ ప్రతినిధి కృషాంక్ తెలిపారు.
నాన్ ఇంజనీరింగ్ కోర్సులకు నోటిఫికేషన్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 24: మూడేళ్ల నాన్ ఇంజనీరింగ్ డిప్లొమో కోర్సుల్లో మైనార్టీ మహిళల అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ చేసినట్టు సాంకేతిక విద్యాశాఖ మైనార్టీ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ ఎస్ భవాని తెలిపారు. డిప్లొమో ఇన్ కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీసెస్, డిప్లొమో ఇన్ గార్మెంట్ టెక్నాలజీల్లో ప్రవేశానికి ఆసక్తి ఉన్న అభ్యర్ధులు రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలం బడంగిపేటలోని మైనార్టీ పాలిటెక్నిక్ కాలేజీని సంప్రదించాలని ఆమె సూచించారు. కాగా మైనార్టీ గురుకుల జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ ఉర్దూ మీడియంలో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు గురుకుల విద్యాసంస్థల ప్రతినిధి పి. జగన్మోహన్‌రెడ్డి చెప్పారు. దరఖాస్తులు పంపించుకునేందుకు 10వ తేదీ వరకూ గడువు ఉన్నట్టు ఆయన తెలిపారు. ఎపిఆర్‌జెసి సెట్, ఆర్‌డిసి సెట్‌కు సంబంధించిన జవాబు పత్రాల ప్రాధమిక కీ విడుదల చేసినట్టు జగన్మోహన్‌రెడ్డి చెప్పారు. ఇందుకు సంబంధించిన వివరాలను సంస్థ వెబ్‌సైట్ ఎపిరెసిడెన్షియల్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్‌సైట్‌లో ఉంచినట్టు ఆయన తెలిపారు. సందేహాలున్న వారు ఇమెయిల్ ద్వారా ఎపిఆర్‌ఇఐఎస్ ఎట్‌ద రేట్ ఆఫ్ రీడిఫ్ మెయిల్ డాట్ కామ్ అనే ఇ మెయిల్‌కు పంపించాలన్నారు.
కల్తీ గుడుంబా తాగి
ముగ్గురి మృతి
హైదరాబాద్, మే 24: కల్తీ గుడుంబా తాగి ముగ్గురు మృతి చెందిన సంఘటన అల్వాల్ పోలీసుస్టేషన్ పరిధిలోని జవహర్‌నగర్‌లో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం జవహర్‌నగర్ గ్రామంలోని సుక్కమకుంట ప్రాంతంలో టి.కాలేందర్ (60), సిహెచ్.మల్లేష్ (48), భీమయ్య (50) 10 సంవత్సరాల నుండి కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. కాగా శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో సుక్కమ్మ కుంటలో విక్రయిస్తున్న కల్తీ గుడుంబా తాగి వచ్చి పక్కన అపస్మారక స్థితిలో పడిపోయారు. వీరిని గుర్తించిన స్థానికులు వారి వద్దకు వచ్చి విచారించారు. కాగా భీమయ్య, మల్లేష్‌లు అప్పటికే మృతి చెందారు. కాలేందర్ కూడా అపస్మారక స్థితిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండగా స్థానికులు అతనిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాలేందర్ చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించాడు. ఈ విషయాన్ని గుర్తించిన ఎక్సైజ్ డిఐజి చౌహన్ హుటాహుటిన సంఘటనా స్థలానికి విచ్చేసి కేసును పరిశీలించారు.
ప్రజా సంఘాల ధర్నా
నకిలీ గుడుంబా తాగి ముగ్గురి ప్రాణాలు కోల్పోయిన సంఘటనకు నిరసనగా పలు ప్రజాసంఘాలు జవహర్‌నగరలోని మెయిన్‌రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. జవహర్‌నగర్‌లో గుడుంబా విక్రయాలు జోరుగా సాగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. గుడుంబాను అరికట్టేవరకు తమ పోరాటం అగదని అన్నారు.
అధికారుల ఉదాసీనత, నాయకుల నిర్లక్ష్యం వల్ల గుడుంబా వ్యాపారం జోరుగా సాగుతోందని వారు ఆరోపించారు. మరణించిన కుటుంబాలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఎసిబికి పట్టుబడ్డ
విద్యుత్ ఎఇ
నరసరావుపేట, మే 24: తన స్పన్ పైపుల ఇండ్రస్టీకి 4కెవి కనెక్షన్ విద్యుత్ మీటరును మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్న నలబాల అంజిరెడ్డిని 50వేల రూపాయల లంచం ఇవ్వాలని డిమాండ్ చేసిన రొంపిచర్ల మండల విద్యుత్ శాఖ ఎఇ వై నాంచారయ్యను ఎసిబి అధికారులు శుక్రవారం నరసరావుపేట పట్టణంలోని రైల్వేస్టేషన్ వద్ద రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎసిబి డిఎస్పీ నరసింహారావు తెలిపిన వివరాల ప్రకారం... గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం జొన్నలగడ్డకు చెందిన నలబాల అంజిరెడ్డి రొంపిచర్లలో స్పన్‌పైపుల ఇండస్ట్రీని ఏర్పాటు చేసుకుని, ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో 4కెవి కనెక్షన్ విద్యుత్ మీటరు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే విద్యుత్ ఎఇ వై నాంచారయ్య 1856 నెంబర్ గల వేరే వ్యక్తులకు సంబంధించిన మీటరును తాత్కాలికంగా ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. కాగా, తనకు సొంతంగా మీటరు ఇవ్వాలని కోరడంతో 50 వేల రూపాయల లంచం ఇవ్వాలని ఎఇ నాంచారయ్య నలబాల అంజిరెడ్డిని డిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు. అయితే నలబాల అంజిరెడ్డి 35వేల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుని నరసరావుపేట రైల్వేస్టేషన్ వద్ద అందజేస్తుండగా పట్టుకున్నామని వివరించారు. ఈ మేరకు ఎఇ నాంచారయ్యను కోర్టుకు హాజరుపర్చనున్నట్లు డిఎస్పీ నరసింహరావుచెప్పారు. ఈ దాడుల్లో ఇన్‌స్పెక్టర్లు సీతారాం, రవి, నాగరాజు, శ్రీనివాస్ ఉన్నారని ఆయన తెలిపారు.