లండన్, మే 24: మాంచెస్టర్‌కు వెళ్తున్న పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఒకటి ఆకాశంలో ఎగురుతున్న సమయంలో సెక్యూరిటీ అలర్ట్ ప్రకటించడంతో బ్రిటన్ శుక్రవారం తన ఫైటర్ జెట్ యుద్ధ విమానాలను పంపించి ఆ విమానాన్ని ప్రత్యేక ఉగ్రవాద నిరోధక విమానాశ్రయానికి మళ్లించింది. విమానానికి ముప్పు కలిగించాలనుకున్నారనే అనుమానంపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులను అరెస్టు చేసారని, ఆ ఇద్దరిని విమానంనుంచి దించేసారని ఎసెక్స్ పోలీసులు తెలిపారు. లాహోర్‌నుంచి మాంచెస్టర్‌కు ప్రయాణిస్తున్న ఈ బోయింగ్-777 విమానాన్ని మధ్యలో అడ్డుకుని బ్రిటన్‌లోని ప్రత్యేక యాంటీ టెర్రరిస్టు విమానాశ్రయమైన స్టాన్‌స్టెడ్ విమానాశ్రయానికి తీసుకు రావడం కోసం రాయల్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రెండు ఫైటర్ జెట్ విమానాలను పంపించారు. ‘బ్రిటన్ గగనతలం పరిధిలో ఒక పౌరవిమానంలో సంభవించిన సంఘటనకు సంబంధించి దర్యాప్తు చేయడానికి రాయల్ ఎయిర్‌ఫోర్స్ కనింగ్స్‌బేకు చెందిన టైఫూన్ యుద్ధ విమానాలను పంపించడం జరిగింది. దీనికి సంబంధించి ఇతర వివరాలు అందినప్పుడు తెలియజేస్తాం’ అని బ్రిటీష్ రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు చెప్పారు. అయితే ఇది పోలీసులకు సంబంధించిన వ్యవహారమని, ఈ సంఘటనలో తమ పాత్ర ముగిసిందని ఆ తర్వాత రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పికె 297 విమానంలో ‘ఒక సంఘటన’ జరిగిన తర్వాత తమ అధికారులు స్పందిస్తున్నారని ఎసెక్స్ పోలీసులు తెలిపారు. ఈ విమానంలో 11 మంది విమాన సిబ్బంది కాకుండా 297 మంది ప్రయాణికులున్నారని, వీరంతా లాహోర్‌నుంచి ప్రయాణిస్తున్నారని తెలుస్తోంది. విమానం మాంచెస్టర్ దిశగా వెళ్తున్న సమయంలో యోర్క్ సమీపంలో దాన్ని హటాత్తుగా మార్గం మళ్లించి ఉత్తర సముద్రం దిశగా మళ్లించారు. భద్రతా కారణాల దృష్ట్యా దారిమళ్లింపు జరిగినట్లు పిఏఎల్ ధ్రువీకరిస్తూ ఒక ఎమర్జెన్సీ సిగ్నల్‌కు స్పందనగా తీసుకున్న ముందస్తు చర్య మాత్రమేనని తెలిపింది. విమానంలోపల ఇద్దరు ప్రయాణికులు గట్టిగా కేకలు వేస్తూ గొడవ చేస్తూ ఉండడంతో ఆందోళన చెందిన పైలట్ ముందు జాగ్రత్తగా విమానాన్ని స్టాన్‌స్టెడ్‌కు దారి మళ్లించాల్సిందిగా ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్‌ను కోరినట్లు తెలుస్తోంది. దీంతో లింకన్‌షైర్‌లోని కనింగ్స్‌బే బేస్ వద్ద ఎప్పుడూ సిద్ధంగా ఉండే రాఫ్ జెట్ విమానాలు రంగంలోకి దిగాయి. కాగా, ప్రస్తుతానికి పోలీసులు దీన్ని ఉగ్రవాదానికి సంబంధించిన సంఘటనగా చూడడం లేదని తెలుస్తోంది.
గగనతలంలో అడ్డుకుని దారిమళ్లించిన బ్రిటీష్ ఫైటర్ జెట్‌లు
english title:
p
Date:
Saturday, May 25, 2013