కాకినాడ, మే 24: సాంకేతిక విద్యను అభ్యసించే విద్యార్థులు కళాశాల నుండి బయటకు వచ్చేనాటికి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వారిని తీర్చిదిద్దడానికి దేశవ్యాప్తంగా కమ్యూనిటీ కళాశాలలు నెలకొల్పనున్నట్టు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఎంఎం పళ్లంరాజు తెలిపారు. ఐటిఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కళాశాలల నుండి బయటకు వచ్చే విద్యార్థుల్లో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించడానికి టెక్విప్ నిధులతో పరిశ్రమల భాగస్వామ్యంతో ఈ కమ్యూనిటీ కళాశాలలు ఏర్పాటుచేస్తామన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో శుక్రవారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. ఇటీవల అమెరికాలో భారత బృదం పర్యటన విశేషాలను ఆయన వివరించారు. ఈ పర్యటనలో సాంకేతిక విద్యా రంగంలో ఇండో- అమెరికన్ భాగస్వామ్యంపై ఆ దేశంలోని ఉన్నత స్థాయి యూనివర్శిటీలతో విస్తృత స్థాయి సంప్రదింపులు జరిపి, పలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పారు. అమెరికాలోని పలు పటిష్ఠాత్మకమైన విద్యా సంస్థలు భారత దేశంలో శిక్షణ, వర్క్ఫోర్స్ నైపుణ్యాల అభివృద్ధిలో పాలు పంచుకుంటాయన్నారు. అలాగే ‘సింగ్- ఒబామా గ్లోబల్ లెర్నింగ్ ఇనిషియేటీవ్’ కార్యక్రమం కింద ఇరుదేశాల విద్యా సంస్థల మధ్య ఇప్పటికే ఎనిమిది ప్రాజెక్టులను గుర్తించామన్నారు. వచ్చే నెలలలో మరో ఎనిమిది ప్రాజెక్టులు రూపుదిద్దుకోనున్నాయన్నారు. తరువాత ఇరుదేశాల మధ్య ఫ్యాకల్టీ, స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమాలు ముమ్మరం కానున్నాయన్నారు. సివి రామన్ ఫెలోషిప్ కార్యక్రమం కింద 127 మంది విద్యార్థులను త్వరలో అమెరికా పంపించనున్నట్లు చెప్పారు. 2022 నాటికి దేశంలో 50 కోట్ల మందికి నైపుణ్యాల పరిపుష్టి అందించాలని లక్ష్యంగా నిర్ణయించామని ఇందుకు ప్రభుత్వ, పరిశ్రమల ఉమ్మడి భాగస్వామ్యంతో స్కిల్స్ అప్‌గ్రేడేషన్ కార్యక్రమాలను చేపడతామన్నారు. బోధనా ప్రమాణాలను మరింత పెంపొందించడానికి కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో స్కూల్ ఆఫ్ టీచింగ్ ఏర్పాటు చేస్తామని పళ్లంరాజు ప్రకటించారు.
కాకినాడలో కేంద్ర మంత్రి పళ్లంరాజుకు స్వాగతం పలుకుతున్న
తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్