నిజామాబాద్, మే 24: తెలంగాణ ఏర్పాటు పట్ల తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, మహానాడులో ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా తీర్మానం చేయాలని టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు సవాల్ విసిరారు. తెలంగాణపై తెదెపా స్పష్టమైన వైఖరితో ఉన్నప్పటికీ అనవసరంగా ఆడిపోసుకుంటున్నారంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడని, నిజంగానే తెలంగాణ ఏర్పాటుకు తెదెపా అనుకూలమైతే మహానాడులో తీర్మానం చేసి తన నిజాయితీని నిరూపించుకోవాలన్నారు. బాన్సువాడ పట్టణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన టిఆర్‌ఎస్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల శిక్షణ శిబిరానికి కెసిఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్, టిడిపి, వైకాపాలు అవలంబిస్తున్న వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక అమలు చేయనున్న సంక్షేమాభివృద్ధి పథకాలను వల్లె వేశారు. వచ్చే ఎన్నికలను కురుక్షేత్ర యుద్ధంగా అభివర్ణించిన కెసిఆర్, తెలంగాణ వ్యతిరేక పార్టీలను ఓటు అనే ఆయుధంతో భూస్థాపితం చేస్తేనే తెలంగాణ సిద్ధిస్తుందన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనకు రాజకీయ పోరాటం మినహా మరో మార్గం లేకుండాపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘గడిచిన పనె్నండేళ్ల కాలంలో అనేక రకాలుగా పోరాటం చేసినం. సకల జనుల సమ్మెతో 42రోజుల పాటు ప్రభుత్వ పాలనను స్తంభింపజేసినం. ప్రత్యేక రాష్ట్రం కోరుతూ వేయిమంది వరకు తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానాలకు పాల్పడ్డారు. ఇంత జరిగినా ఢిల్లీలో ఉన్న సర్కార్ ఇజ్జత్ లేని రీతిలో ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరిస్తోంది’ అని కెసిఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ వైపు ఉద్యమిస్తూనే, మరోవైపు రాజకీయ పోరాటాన్ని తీవ్రతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ వంద అసెంబ్లీ స్థానాలు, 16 ఎంపి సీట్లను గెల్చుకుంటే కేంద్రాన్ని శాసించి మరీ తెలంగాణను సాధించుకోవచ్చని అన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఎంతో జాగరుకతతో వ్యవహరించాలని, ఓట్ల కోసం కోట్లను గుమ్మరించే తెలంగాణ వ్యతిరేక పార్టీల ప్రలోభాలకు లోనుకావద్దని హితవు పలికారు. తెలంగాణలో ఆంధ్రా పార్టీలు అవసరమా? అనే అంశంపై ప్రతీ గ్రామంలో గల్లీగల్లీలో చర్చ పెట్టాలని సూచించారు. టిడిపి, వైకాపాలు ఒకవేళ అధికారంలోకి వచ్చినా, తెలంగాణ ప్రాంతానికి చెందిన వారికి సిఎం పదవి కానీ, పార్టీ అధ్యక్ష పదవి కానీ కట్టబెట్టే అవకాశాలే లేవన్నారు. తెలంగాణ ప్రాంతం వారిని కేవలం గులామ్‌లుగా ఆంధ్రా పార్టీలను ఆదరిస్తే, మనం ఎప్పటికీ గులామ్‌లుగానే ఉండిపోతామన్నారు. తెలంగాణ తెచ్చేది, ఇచ్చేది మేమేనంటూ ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నాయకులు, వచ్చే ఎన్నికల్లో చచ్చేది కూడా ఖాయంగా వారేనని కెసిఆర్ పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి ఆస్కారం కల్పిస్తామని, తాను ఎలాంటి పదవులను చేపట్టకుండా సర్వతోముఖాభివృద్ధితో కూడిన తెలంగాణ ప్రగతి కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. బడుగు బలహీన వర్గాల వారికి 400చదరపు గజాల స్థలంలో డబుల్ బెడ్‌రూమ్‌లతో కూడిన ఫ్లాట్‌ను నిర్మించుకునేందుకు 2లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని, రైతులు తీసుకున్న లక్ష రూపాయల్లోపు పంట రుణాలను మాఫీ చేస్తామని, ఉచిత నిర్బంధ విద్యా పథకాన్ని అమల్లోకి తెచ్చి మూడేళ్లు నిండిన బాలబాలికలంతా తప్పనిసరిగా బడుల్లో చదువుకునేలా చర్యలు తీసుకుంటామని, ఇందుకోసం పోలీస్ శాఖ సేవలను వినియోగించుకుంటామన్నారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బిసిలంటూ కులాల పేరిట కొనసాగుతున్న వసతి గృహాల స్థానంలో కులాల పేర్లకు ఆస్కారం లేకుండా అన్ని వసతులతో కూడిన ప్రభుత్వ ఆవాస విద్యాలయాలను ఏర్పాటు చేస్తామని కెసిఆర్ వివరించారు. గిరిజనులు, ముస్లిం మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్లు వర్తింపజేస్తామని, వితంతువులకు వేయి రూపాయలు, వికలాంగులకు 1500రూపాయల పెన్షన్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి రమణాచారి, ప్రొ. సాంబయ్య, పార్టీ నాయకులు ఆలూర్ గంగారెడ్డి, బిగాల గణేష్‌గుప్తా, ఎఎస్.పోశెట్టి పాల్గొన్నారు.
నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో నిర్వహించిన రాజకీయ శిక్షణ శిబిరంలో ప్రసంగిస్తున్న టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్.. శిబిరంలో పాల్గొన్న పార్టీ కార్యకర్తలు, నాయకులు