రేపటితో వీళ్లతోకూడా తన రుణం తీరిపోతున్నది. కాయగా మారే ముందు పూవు ఒక్కొక్క రేకును విప్పుకున్నట్టు తనకూ ఒక్కొక్క బంధం వదిలిపోతున్నది. ఏ ఘడియల కోసం ఇంతకాలం ఎదురు చూసిందో అవి సమీపించాయి. తన కథక్కూడా ఒక ముగింపు లభించబోతున్నది. తన విప్రబ్ధ జీవితాన్ని ముగించి భూమి పొరల్లో కలిసిపోవడానికి తన మనస్సెంత తహతహలాడుతున్నదో తనకు తెలుసు. అన్నీ తననుకున్నట్టు జరిగితే తనకు విముక్తి లభించబోతున్నది. ఆ విముక్త ప్రపంచంలో హాయిగా రెక్కలు కట్టుకుని ఎగరాలన్నంత కోరిక-
ఒకవేళ-తాననుకున్నట్లుగా కాక దానికి భిన్నంగా జరిగితే రాముడు వీరిని కూడా పరిగ్రహించకపోతే? పోతే...?
ఆ ఆలోచనే భరించలేనట్లు రెండు కళ్లు గట్టిగా మూసుకుంది. లోకాపవాదాన్ని మూటగట్టుకున్న వైదేహి కొడుకులని గుర్తించినా గుర్తించనట్టు ప్రవర్తిస్తే ఏమవుతుంది? తనకున్న ఏకైక మార్గం మూసుకుపోతుంది. తనతోపాటు ఈ బిడ్డలు నిర్భాగ్యులుగా కళంకిత బిడ్డలుగా కాలగర్భంలో కలిసిపోతారు. రాముడి సంతానం అనామకంగా ఈ అడవిలో రాలిపోతుంది. అలా ఆలోచిస్తుంటే ఆమె ఒంట్లో రక్తప్రసరణ ఆగినట్లనిపించింది. భవిష్యత్తు అంధకారంలా గోచరించింది. వూహు...అలా ఎన్నటికీ జరగకూడదు. వౌనంగా ఈ నిందను భరించింది ఇందుకా..తన బిడ్డల జీవితాన్ని కూడా ఈ సర్పం కబళిస్తుంటే తను చూస్తూ ఊరుకోగలదా? రాముడు ఆదరించకపోయినా లోకం గొడ్డుపోలేదు. తన తండ్రి ఇంకా బతికి ఉన్నాడు. ఆయనకు మగ సంతానం కూడా లేదు. తననే ఆదరించిన ఆయన రామ సంతానాన్ని ఆదరించడా? వారిని తన వారసులుగా తప్పక స్వీకరిస్తాడు.
ఈ రేపు అనేది తన ముందున్న జీవితాన్ని నిర్దేశించబోతున్నది. మరోసారి కాలం తనను పరీక్షించబోతున్నది. అవమానాగ్నిలో దగ్ధమైన ఈ గుండెకు మరో అవమానం బాధిస్తుందా? అందుకోసం ఆఖరి పరిష్కారంతో తాను ఎదురుచూస్తున్నది-ప్రశ్నలే తప్ప జవాబులు తెలియని ఈ సమాజానికి ఈ రాచరికపుధర్మాలకు తానిచ్చే అంతిమ ప్రశ్న వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఇప్పటికీ దొరకని సమాధానంతో తన ప్రశ్నలన్నిటిని కాలం గుండెల్లో దాచిపెట్టింది. ఎప్పటికయినా అవి తెరవబడి వాటికి సరైన నివృత్తిని సాధించుకున్నప్పుడు ఈ అనంతమైన విశ్వంలో దాక్కున్న తన ఆత్మ సమాధానం దొరికిన తృప్తిని పొందుతుంది. అప్పుడే ఈ చరాచర ప్రకృతిని నడిపిస్తున్న మూల స్ర్తితత్వానికి కూడా నా గొప్ప సందేశంఅందుతుంది. అప్పుడే స్ర్తి జాతికి విముక్తి లభిస్తుంది.
ఆమె మనస్సులో చీకటి తొలగకుండానే తెల్లవారిపోయింది. పిల్లలిద్దరు తమసా తీర్ధంలో స్నానం చేసి వచ్చారు. వాళ్లను కూర్చోబెట్టి చల్ది తినిపించింది. ఆ తరువాత ప్రయాణం ఆరంభమైనట్టు బయటంతా కోలాహలంగా మారింది. లవకుశులు అమ్మ చీరతో మూతి చేతులు తుడుచుకుని మూటలు తీసుకుని అమ్మ కాళ్లకు నమస్కరించి హడావుడిగా బయటకు పరిగెత్తారు.
చక్రవర్తి పంపిన కొన్ని రథాలు, అశ్వాలు బయట సిద్ధంగా ఉన్నాయి. వయోవృద్ధులైనవారు రథాలు, యువకులు అశ్వాల్ని, లవకుశుల వయసున్న పిల్లలంతా నడుస్తామని ఎవరికి తగినట్లు వారు ప్రయాణాన్ని నిర్ణయించుకున్నారు.
వీరంతా తెల్లవారుజామునే ప్రభువైన రాముడికి మేలు జరగాలని ప్రత్యేక హోమం నిర్వహించారు. మహారాజుకు బహుమతిగా ఎన్నో అడవి కానుకలను మూటకట్టి కొన్ని గుర్రాలమీద వేసారు. ప్రయాణమంతా తమసానదీ తీరంలో సాగుతుంది కనక కాలినడకన వెళ్లే వాళ్లకి ఇబ్బందేమీ లేదనుకున్నారు. వాళ్లు ఆడుతూ పాడుతూ వెళ్లినా సాయంత్రానికి చిత్రకూటం చేరుకోవచ్చు. రధాలమీద, గుర్రాల మీద వెళ్లే వాళ్లు మాత్రం ఇంకా ముందుగానే చేరుకుంటారు.
ఈ ప్రయాణం వలన పెద్దవాళ్లకంటే పిల్లలు ఉత్సాహంగా ఉన్నారు. వాళ్లు చిన్న చిన్న తినుబండారాలను మూటలు కట్టుకుని నడుము గుడ్డకు కట్టుకున్నారు. దారిలో నడిచేటప్పుడు తింటానికి. ప్రయాణ బృందమంతా సూర్యుడికి అర్ఘ్యమిచ్చి బయలుదేరారు. సరిగ్గా వైదేహి కుటీర వాటికకు ఎదురుగా రాగానే మహర్షి ఆగారు. ఆయన ఇంకా తన రధాన్ని అధిరోహించలేదు. ఆశ్రమం ఎదురుగా మెట్లదగ్గర నిలబడి వున్న వైదేహి ముందుకు వచ్చి ఆయన పాదాలకు నమస్కరించింది. ‘సకల శుభాలు కలగాలని’ శిరస్సుమీద చేయి వుంచి ఆశీర్వదిస్తూ ఆమె ముఖం వంక చూసాడు. నిర్వికారంగా వున్న ఆ ముఖంలో ఆయనకే భావాలు దొరకలేదు కానీ కళ్లు మాత్రం రాత్రంతా ఏడ్చినట్లు ఎర్ర మందారాల్లా ఉన్నాయి... ‘పుత్రీ ధైర్యంగా ఉండు. నీ మనో నిశ్చలతతో కాలానికే జవాబుగా నిలిచావు. నీ బిడ్డలకు నేను తోడుగా ఉన్నాను. నీకు దైవం తోడుంటాడు’ అని మెల్లగా చెప్పి ముందుకు బయలుదేరి రథమెక్కాడు. మరోసారి తన కాళ్లకు నమస్కరించిన బిడ్డల్ని అక్కున చేర్చుకుని శిరస్సులు ముద్దాడింది. మహర్షుల వారి ఆదేశాల్ని జవదాటొద్దని హెచ్చరించి సాగనంపింది. ఆపైన అందరు వారి వారి వాహనాలు ఎక్కారు. పిల్లల బృందమంతా వేగంగా నడుస్తూ ముందుకు కదిలిపోయారు. చివరి వ్యక్తి కనిపించే వరకు ఆమె అలానే చూస్తుండిపోయింది. శుభలగ్నం వచ్చి తీసుకెళ్లేంత వరకు తన భవిష్యత్తును శూన్యానికి వదిలి ఆశ్రమంలోకి దారి తీసింది.
* * *
‘ మహర్షీలోపలికి రావచ్చా?’ గంభీరమైన ఆ కంఠ నాదానికి సంధ్యావందనంలో వున్న మహర్షి ఉలిక్కిపడి చూసాడు. ఎదురుగా తన పూర్వ జన్మల పుణ్య ఫలం కుప్పబోసినట్లు-తనకు కళ్లున్నందుకు వాటికి సార్ధకత లభించేటట్లు తన కావ్య కథా నాయకుడు-రామో విగ్రహవాన్ ధర్మః’ ధర్మమే ఆకారం దాల్చిందా అన్నట్లున్న ఆజానుబాహుడు-అరవింద దళాయతాక్షుడు అయిన రామచంద్ర ప్రభువును చూడగానే అంతటి విరాగి వాల్మీకి మహర్షికి చెప్పలేని గగుర్పాటు కలిగింది. మేనంతా రోమాంచితమై కళ్లు చమర్చాయి. ఎంతో చూడాలనుకుంటున్న కళ్లకు నీళ్లు అడ్డుపడడంతో పై ఉత్తరీయంతో వాటిని తుడుచుకుంటూ కళ్లు విప్పార్చి చూసాడు. తెల్లని పట్టు వస్త్రాలతో దానికి తగిన ఆభరణాలు, నెత్తిన కిరీటంతో సర్వాంగ శోభితంగా ఎదురుగా వీర సౌందర్యాలు రూపుకట్టినట్టు నిలబడి వున్న రాముడ్ని చూడడం ఆయనకదే ప్రథమం. తాను వర్ణించిన దానికంటే మరింత అందంగా ఉన్నాడు -సుమధురంగా మాట్లాడుతున్నాడు.
‘రండి ప్రభూ! లోపలికి రండి. పుణ్యమే తనంత తాను వచ్చి తరింప చేస్తానంటే దాన్ని మించిన అదృష్టమేముంది- నా జీవితం ధన్యమైంది ప్రభూ. మిమ్మల్ని చూడకుండానే ఈ తనువు చాలిస్తానేమోననే భయపడ్డాను. నా తపస్సు ఫలించి తమ దర్శనం లభించింది.’
‘లేదు మహర్షీ! తమవంటి తాపసోత్తముల సందర్శన భాగ్యం నేను చేసుకున్న మహాపుణ్యం. తమరిని స్వయంగా యాగానికాహ్వానించడానికి వచ్చాను. ఇప్పుడు నాకు వ్యవధి లేనందువల్ల వెంటనే బయలుదేరాలి’ అన్నాడు. పైకి మాట్లాడుతున్నా లోపల మాత్రం వైదేహి ప్రాణదాత అయిన ఆయనకు ఏమిచ్చి ఋణం తీర్చుకోవాలి- ఈ మహానుభావుడివల్లే తన వారసులు నిలబడ్డారు. ఈ రాజ్యమంతా ఆయన పాదాలకు సమర్పించినా ఆయన చేసిన మేలు ముందు తక్కువే అవుతుంది అని ఆలోచిస్తుంటే కండ్లు చెమర్చాయి. ఇద్దరూ ఎవరి ఆలోచనల్లో వారు వీక్షించుకున్నారు. తెలియని ఆత్మీయతతో దగ్గరై కౌగలించుకున్నారు. ఇక తన ప్రాణం పోయినా బాధలేదన్నంత ఆనందం పొందాడు వాల్మీకి. వైదేహి దర్శనాన్ని నిరంతరం పొందే ఆ శరీరపు స్పర్శ తనకెంతో ఊరట నిచ్చిందనుకున్నాడు రాఘవుడు- నిజంగా అదొక గొప్ప కలయిక- కావ్య రచయిత-ఆ కావ్యంలో కథానాయకుడు అంతేకాదు ఆ కావ్యంలోని రెండు పాత్రల కలయిక సహజ వాతావరణంలో సంభవించడం ఇంత అరుదైన విషయం ముఖ్యంగా వారిద్దరి మధ్యలో వైదేహి ఒకరు ప్రాణనాథుడైతే మరొకరు ప్రాణదాత.
రాముడు వెళ్లి మహర్షికి మరోమారు నమస్కరించి రథమెక్కి వెళ్లిపోయాడు. వెళ్లే ముందు వాల్మీకితో వున్న వటువుల్ని ఆయన చూపులు ఒక్కక్షణ కాలం పరామర్శించి వెళ్లాయి. ఆ కళ్లలోని నిరాశే చెప్పింది వాళ్లు తన పుత్రులు కారని. రాముడు వెళ్లిపోయాక కూడా వాల్మీకి మహర్షి ఒక రకమైన తన్మయ భావంలో వుండిపోయాడు. బహుశా ఇనే్నళ్లుగా ఏ వ్యక్తినయితే వర్ణించి వర్ణించి రాసాడో ఆ వ్యక్తే ఎదురుపడితే కలిగే సంభ్రమం ఆయనలోను చోటుచేసుకుంది. తను వర్ణించిన దానికంటే ఇంకా అందంగా ఉన్నాడు. ఇలా అనుకోవడం ఇది పదోసారి.
యజ్ఞప్రాంగణమంతా కాషాయ జెండాల రెపరెపలతో ఎర్రటి మేఘం కప్పినట్లుంది. యజ్ఞం అంటే జంతు వధశాల కాదు. అది నామమాత్రమే. రామాయణకాలంలో యజ్ఞ వేదికలు మేథావంతుల సమ్మేళనమని పిలుస్తారు. భిన్న సారస్వత-మత వాదనలకు అది చర్చా వేదిక. ఆ సమ్మేళనాన్ని విభాగాలుగా విభజించారు. యజ్ఞ్భూమిని ‘యజ్ఞవాట్’ అని, ఆశ్రమాలనుండి వచ్చిన ఋషుల నివాసాన్ని ‘ ఋషి సంవాట్’ అని ప్రత్యేకించి వాల్మీకి మహర్షికి ఆయనతో వచ్చిన మునులకు నిర్మించిన దానిని ‘వాల్మీకి వాట్’ అని విభజించారు. అది వాల్మీకి మహర్షికి వారిచ్చిన గౌరవం.
రాముడు కూర్చుని చేసే ప్రత్యేక యజ్ఞ గుండానికి ఋత్విక్కులుగా మహర్షి వాల్మీకి-వశిష్టులవారు- ఋష్యశృంగుడు-అగస్త్యుడు-్భరద్వాజుడు-అత్రి మహాముని నియమించబడ్డారు. మిగిలిన యజ్ఞగుండాల ముందు అర్హతల వారీగా తక్కిన ఋత్విజులు కూర్చున్నాక వాల్మీకి మహర్షి మొదట అగ్ని భట్టారకుని-ఇంద్రుని-మిగిలిన దిక్లాపకుల్ని స్తుతించి యజ్ఞగుండంలో సమిధలుంచి నెయ్యి వేసి వెలిగించడంతో యజ్ఞ కార్యక్రమం మొదలైంది. తక్కిన కుండాల్లో కూడా అగ్నిని వెలిగించి మంత్రాలు ప్రారంభించారు. ఆ మంత్రోచ్ఛాటనతో ఒక్కసారిగా చిత్రకూటం వేదభూమిగా మారిపోయింది. ఉదాత్తానుదాత్త స్వరాలతో ఋగ్యజుస్సామమనే త్రిముఖాలు ధరించిన వేదమాతను సుశ్రావ్యంగా గానం చేస్తూ ఉత్తములైన బ్రాహ్మణులంతా దేవతలను ఆహ్వానించారు. పక్షులు-జంతువులు కూడా నేర్చుకోతగినంత స్పష్టంగా వారి వేదగానం సాగుతున్నది.
రాముడి కుటుంబ సభ్యులంతా పట్టు వస్త్రాలు ధరించి ఆ యజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నారు.వారు ధరించిన వస్త్రాల్లో-పీతం-కనకపట్ట్భాం-అభం-రత్నం-రుక్మిపట్ట్భాం వంటి పట్టురకాలున్నాయి. దశరధుని కోడళ్లు ధరించిన విలువైన వజ్రాల నగదు ధగధగలతో యజ్ఞగుండాల్లోని అగ్నిదేవుడు కూడా మెరిసిపోతున్నాడు.
జనకుడు ఒకవైపు వ్యాఘ్రచర్మం మీద కూర్చుని ఆ సంరంభాన్ని వీక్షిస్తున్నాడు. అందరూ వున్నారు-అన్నీ వున్నాయి. లేనిదల్లా వీధిగ్రస్త వైదేహి మాత్రమే. త్యాగం ఆమెది. -రాముడి తమ్ములు-వారి పిల్లలు కళకళలాడుతూ తిరుగుతుంటే చక్రవర్తి కుమారులు కోసల ఉత్తరాధికారులు మాత్రం మాసిపోయిన కాషాయ బట్టల్లో సామాన్య కళాకారుల్లా వారికి కేటాయించిన గుడారంలో సాయంత్రం ఇవ్వబోయే ప్రదర్శనకు సంబంధించి తంబురా మీటుకుంటూ తమ గానాన్ని పరీక్షించుకుంటున్నారు. అక్కడకు వచ్చిన లక్షలాది మంది జనంలో వారు సామాన్యుల్లా కలిసిపోయి తిరుగుతున్నారు.
(ఇంకా ఉంది)