భవిష్యత్తులో ఎలక్షన్స్ వచ్చినప్పుడు పార్టీ అభ్యర్థులను సెలెక్ట్ చేయటం అన్ని పార్టీలకూ కష్టమే - ఎందుకంటే అభ్యర్థులను ఎంపిక చేసే ఇంటర్వ్యూలు చాలా టఫ్‌గా ఉంటాయ్. అయ్యేయస్, అయ్‌పీయస్ సెలక్షన్స్ కంటే కూడా కష్టమన్నమాట!
ఆ ఇంటర్వ్యూలిలా ఉంటాయ్-
‘మన పార్టీలో ఎంతకాలం నుంచి పని చేస్తున్నావ్?’
‘పదేళ్ల నుంచీ సార్ - రాజకీయాల్లో బాగా పండిపోయాను’
‘వెరీగుడ్! పార్టీ ఫండ్‌కి ఎంత డబ్బు కలెక్ట్ చేయగలవ్?’
‘అరవై కోట్లు సార్’
‘ఒకవేళ నీకు మినిస్టర్ పోస్ట్ ఇస్తామని ప్రామిస్ చేస్తే?’
‘అప్పుడయితే అయిదొందల కోట్లు ఇవ్వగలను సార్’
‘గుడ్! నీకు ఫ్రాడ్ చేసే అలవాటుందా?’
‘అంటే ఏంటి సార్?’
‘అదేనోయ్! గవర్నమెంట్‌ని గానీ, ప్రజల్ని గానీ ఎప్పుడయినా లూఠీ చేసిన ఎక్స్‌పీరియెన్స్ ఉందా?’
‘కొంతకాలం క్రితం చిట్‌ఫండ్ కంపెనీ పెట్టి డెబ్బై కోట్లు కాజేసి కంపెనీ ఎత్తేశాన్సార్ - ఆ తరువాత గవర్నమెంట్ బాంక్‌లను మోసం చేసి రెండొందల కోట్లు నొక్కేశాను సార్’
‘వెరీగుడ్- మరి మర్డర్లు రేప్‌లు చేసిన అనుభవం ఉందా?’
‘లేద్సార్’
‘అలాంటప్పుడు పార్టీ టికెట్ ఎలా ఇస్తాం? అవన్నీ కూడా చేసి అనుభవం సంపాదించుకుని రా! రాజకీయ నాయకుడవాలంటే అవన్నీ మినిమమ్ క్యాలిఫికేషన్స్ కదా- వెళ్లెళ్లు - నెక్స్ట్’
ఇంకో రకం ఇంటర్వ్యూ ఇంకో రకంగా ఉంటుంది.
‘కిందటిసారి కూడా ఎమ్మెల్యేగా చేశావ్ కదూ?’
‘చేశాను సార్’
‘ఎంత సంపాదించావ్?’
‘ఆరొందల కోట్లు సంపాదించాన్సార్’
‘ఎలా సంపాదించావ్?’
‘బినామీ కంట్రాక్ట్‌లు చేసి గవర్నమెంట్‌ని లూఠీ చేశా సార్’
‘మినిస్టర్‌ని చేస్తే ఎంత పార్టీ ఫండ్ ఇస్తావ్?’
‘వెయ్యి కోట్లు సార్’
‘ఆ డబ్బు మళ్లీ ఎలా సంపాదించుకుంటావ్?’
‘మన రాష్ట్రంలో మైనింగ్ గనులున్నయ్ కద్సార్ - బినామీ పేర్లతో లీజుకి తీసుకుని మిగతాది అక్రమంగా తవ్వేసి సంపాదిస్తా సార్’
‘టెలికామ్ కుంభకోణాలు చేయగలవా?’
‘ప్రస్తుతం రాజా, కనిమోళి, మారన్‌ల జీవిత చరిత్రలు పవర్ ప్రెజెంటేషన్‌లో స్టడీ చేస్తున్నా సార్ - ఆ స్టడీ అవగానే అలాంటివి టేకప్ చేయగలను సార్’
‘గుడ్ - ముందు చూపు బావుంది నాకు’
‘ముందు చూపే కద్సార్- మందు చూపు కూడా ఉంది’
‘అంటే?’
‘మద్యం మాఫియాని ఏర్పాటు చేశా సార్ - మన రాష్ట్రంలో, మిగతా రాష్ట్రాల్లో కూడా నేను ఆక్షన్ చేసి ఇండియా నెంబర్ వన్ అయ్యేందుకు పథకం సిద్ధం చేశా’
‘గుడ్ నీకు పార్టీ టికెట్ ఇస్తున్నాం’
‘ఇదిగోండి సార్ - వెయ్యి కోట్ల సూట్‌కేస్’
మరో ఇంటర్వ్యూ ఇలా ఉంటుంది.
‘నీకు ఈసారి కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలనుకుంటున్నాం’
‘్థంక్యూ సర్. అయిదువేల కోట్లిస్తా’
‘అంత డబ్బు నీకెక్కడిది?’
‘్భలేవారే సార్ - రెండుసార్లు రాష్టమ్రంత్రిగా ఉన్నా - ఆ మాత్రం సంపాదించలేనా?’
‘నీలాంటోళ్లే మాక్కావాలి - నీకు రైల్వే మంత్రి పోస్ట్ ఇవ్వాలనుకుంటున్నాం - ఆ పోస్ట్‌లో ఎంత ఫ్రాడ్ చేయగలవ్?’
‘పది లక్షల కోట్ల ఫ్రాడ్ చేయగలను సార్’
‘ఎలా?’
‘రైల్వే బోర్డులో మెంబర్ ఎలక్ట్రికల్ పోస్ట్ ఓపెన్ ఆక్షన్‌లో అమ్మితే లక్ష కోట్లు వస్తుంది సార్ - ఇక మెంబర్ మెకానికల్ - మెంబర్ ఇంజనీరింగ్ పోస్ట్‌లు అమ్మితే అయిదు లక్షల కోట్లు వస్తుంది సార్.. అలాగే మిగతావి...’
‘ఇంతకూ నీకు బ్రోకర్‌గా పని చేయడానికి నీకు మేనల్లుడున్నాడా?’
‘లేడు సార్’
‘పోనీ బామ్మర్ది’
‘బామ్మర్దులు కూడా లేర్సార్’
‘సారీ - యూ ఆర్ అన్‌ఫిట్’
*
హలో .. మైక్‌టెస్టింగ్
english title:
hello mike testing
Date:
Sunday, May 26, 2013