కడప (క్రైం), మే 26: ఏడుగురు సభ్యుల అంతర్‌జిల్లా నకిలీ నోట్ల ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు కడప జిల్లా ఎస్పీ మనీష్‌కుమార్ సిన్హా తెలిపారు. ఈ ముఠా నుంచి రూ.12.67 లక్షల విలువచేసే నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ ఖాజీపేట సాయిబాబా గుడి వద్ద నకిలీ నోట్లు చెలామణి చేస్తున్నట్లు అందిన సమాచారం మేరకు డిఎస్పీ చల్లా ప్రవీణ్‌కుమార్, ఖాజీపేట ఎస్‌ఐ మంజునాథరెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది దాడి చేసి ఏడుగురు ముఠా సభ్యులను శనివారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ ముఠాలో పోస్టుమెన్ చంద్రబోస్ కీలకంగా వ్యవహరించాడన్నారు. పెద్దముడియం మండలం పాలూరు గ్రామానికి చెందిన పోస్టుమెన్ దుర్గం చంద్రబోస్ డబ్బుకు ఆశపడి తన అనుచరుల ద్వారా నకిలీనోట్లు చెలామణి చేస్తున్నాడన్నారు. ముఠాలో కర్నూలు జిల్లా దొర్నిపాడుకు చెందిన సంగు సుబ్బరాయుడు, అదే గ్రామానికి చెందిన మునిస్వామి, అవుకుకు చెందిన రామతులసి, కడప జిల్లా పెద్దముడియం మండలం పాలూరు గ్రామానికి చెందిన షేక్ షామీర్, జమ్మలమడుగుకు చెందిన కౌషిక్ నాగరాజు, దేవగుడి గ్రామానికి చెందిన ఆవుల మరియమ్మ సభ్యులన్నారు. వీరంతా నకిలీ నోట్లను చెలామణి చేస్తున్నారన్నారు. రూ. 18 నుంచి రూ.20 లక్షల వరకు నకిలీ నోట్లను ఇతర రాష్ట్రాల నుంచి తీసుకువచ్చినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికే దాదాపు రూ. 5.5 లక్షల నకిలీ నోట్లు చెలామణి చేసినట్లు తెలుస్తోందన్నారు. ముఠా నుంచి స్వాధీనం చేసుకున్న నకిలీ నోట్లు మంచి నాణ్యతతో ముద్రించారన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో వీటిని ముద్రించినట్లు తెలుస్తోందన్నారు. వీటిని గుర్తుపట్టడడం సామాన్యుల తరం కాదన్నారు. నిపుణులైన బ్యాంకు సిబ్బంది మాత్రమే వీటిని గుర్తించే అవకాశం ఉందన్నారు. అందుకే వీరు చాలా సులభంగా నకిలీనోట్లను చెలామణి చేశారన్నారు. అసోం నుంచి మన రాష్ట్రంలోకి నకిలీనోట్లు తీసుకువచ్చారన్నారు. అరెస్టచేసిన ముఠా సభ్యులను రిమాండ్‌కు తరలించామన్నారు. ముఠాలో ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు.
చత్తీస్‌గఢ్‌లో మావోయస్టులు జరిపిన భీకర దాడిని నిరసిస్తూ హైదరాబాద్‌లోని గాంధీ భవన్ ఆవరణలో ఆదివారం బాపూజీ విగ్రహం ఎదుట బైఠాయంచిన రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు.