అనంతపురం, మే 26: రాష్ట్రంలో బాలబాలికల నిష్పత్తి శాతం నానాటికీ తగ్గిపోతోంది. ఆరేళ్లలోపు వయసున్న పిల్లల్లో బాలికల శాతం ఏటేటా తగ్గిపోతూనే ఉంది. నాగరికత, అక్షరాస్యుత పెరుగుతున్నా అమ్మాయి కడుపున పడిందనగానే భారంగా భావించేవారి సంఖ్య పెరిగిపోతూ ఉండడమే ఇందుకు కారణమని చెప్పవచ్చు. లింగనిర్ధారణ పరీక్షలను ప్రభుత్వం నిషేధించినా యథేచ్చగా కొనసాగుతూనే ఉన్నాయి. ఫలితంగా బాలికల సంఖ్య తగ్గిపోతోంది. రాష్టవ్య్రాప్తంగా బాలికల సంఖ్య తగ్గుతున్న జిల్లాల్లో మహబూబ్‌నగర్ మొదటి స్థానంలో ఉంది. రెండు, మూడవ స్థానాల్లో కర్నూలు, మెదక్ జిల్లాలు ఉన్నాయి. ఆ తరువాతి స్థానాల్లో వరుసగా రంగారెడ్డి, కడప, ఆదిలాబాద్, ప్రకాశం, నిజామాబాద్, అనంతపురము, హైదరాబాదు, నల్గొండ, చిత్తూరు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పొట్టి శ్రీరాములు నెల్లూరు, ఖమ్మం, తూర్పు గోదావరి, గుంటూరు, పశ్చిమ గోదావరి, వరంగల్, కృష్ణా, కరీంనగర్ జిల్లాలు ఉన్నాయి.
మహబూబ్‌నగర్ జిల్లాలో ఆరేళ్లలోపు వయసున్న పిల్లలు మొత్తం 5,01,878 మంది ఉండగా అందులో బాలురు 2,59,810 మంది కాగా బాలికలు 2,42,068 మంది. కర్నూలు లో మొత్తం 4,77,198 మంది పిల్లలు ఉండగా అందులో బాలురు 2,46, 345 మంది, బాలికలు 2,30,853 మంది. మెదక్ జిల్లాలో మొత్తం 3,48,721 మంది పిల్లలు ఉండగా, అందులో బాలురు 1,78,441 మంది, బాలికలు 1,70,280 మంది. నాల్గవ స్థానంలో ఉన్న రంగారెడ్డి జిల్లాలో మొత్తం 5,95,352 మంది పిల్లలు ఉండగా వీరిలో బాలురు 3,05,728 మంది, బాలికలు 2,89,624 మంది ఉన్నారు. కడప జిల్లాలో 3,13,455 మంది పిల్లలకు గాను బాలురు 1,63,371 మంది, బాలికలు 1,50,084 మంది ఉన్నారు. 9వ స్థానంలో ఉన్న అనంతపురము జిల్లాలో మొత్తం 4,26,922 మంది పిల్లలకు గాను బాలురు 2,21,539 మంది, బాలికలు 2,05,383 మంది ఉన్నారు.
చత్తీస్‌గఢ్ దాడుల్లో
ఆంధ్రా మావోలే కీలకం!
నిఘా వర్గాల అనుమానం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 26: చత్తీస్‌గఢ్ దండకారణ్యంలో శనివారం మావోయస్టులు నిర్వహించిన దాడుల్లో ఆంధ్రా నక్సలైట్లే కీలక పాత్ర పోషించారని రాష్ట్ర నిఘా (ఎస్‌ఐబి) వర్గాలు అనుమానిస్తున్నాయి. చత్తీస్‌గఢ్ పిసిసి అధ్యక్షుడు నందకుమార్ పటేల్‌ను కిడ్నాప్ చేసి తమ డిమాండ్లను నెరవేర్చుకునేందుకు మావోయస్టులు తొలుత పథకం వేశారని, అయితే సల్వాజుడుం ముఖ్యనేత మహేంద్ర కర్మ కూడా అక్కడే ఉన్నాడన్న విషయం తెలియడంతో మావోలు దాడులతో మట్టుబెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ దాడులకు పాల్పడిన వారిలో మావోయస్టు ముఖ్య నేతలు కటకం సుదర్శన్, రావుల శ్రీనివాస్, పాత హనుమంతు ఉన్నారని నిఘా వర్గాలు విశ్వసిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం సుదర్శన్ తలపై 12 లక్షల రూపాయలు రివార్డ్‌ను ప్రకటించింది. కాంగ్రెస్ నేతలపై దాడులకు పథకం అమలు చేయడంలో సుదర్శన్ కీలక పాత్ర పోషించినట్టు నిఘా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దండకారణ్యం నుంచి కేంద్ర బలగాలను, పోలీసులను వెనక్కి పంపాలన్న ఎత్తగడల్లో భాగంగానే మావోయస్టులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయ. అయితే దండకారణ్య సమీప గ్రామాల్లో కాంగ్రెస్ పరివర్తన్ కార్యక్రమాలను నిర్వహించడానికి జనాన్ని తరలింస్తున్నందున ముఖ్యనేతల వివరాలను సునాయసంగా మావో తెలుసుకోవడానికి అవకాశం దొరికిందని అందుచేత ముఖ్యనేతలన్ని మట్టుబెట్టడానికి పథకం ప్రకారం దాడులు చేశారని నిఘా వర్గాలు ఒక అభిప్రాయానికి వచ్చాయి. హైదరాబాద్, వరంగల్, ఆంధ్రా రీజియన్ల డిఐజిలతో రాష్ట్ర డిజిపి దినేష్‌రెడ్డి చత్తీస్‌గఢ్ సంఘటనపై సమీక్షించారు.