హైదరాబాద్, మే 26: చత్తీస్‌గఢ్‌లో ఆపరేషన్ సల్వాజుడం పూర్తయింది. మావోయిస్టులు అనుకున్న పనిని సాధించారు. ఇన్నాళ్లూ సల్వాజుడంకు పెద్దన్నగా ఉన్న మహేంద్ర కర్మను మావోయిస్టులు కాల్చి చంపడంతో ఆ సంస్థకు నేత కరవయ్యారు. చిన్న చిన్న నేతలు ఉన్నప్పటికీ సల్వాజుడంను పూర్తి స్థాయిలో నడిపించే వారు మాత్రం లేరనే భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సల్వాజుడంకు భయపడి ఇన్నాళ్లూ ఇతర ప్రాంతాలకు వలసపోయిన గొత్తికోయలు ఇక మళ్లీ సొంత గ్రామాలకు చేరుకునే యోచనలో ఉన్నట్లు స్పష్టమవుతోంది.
చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులకు అనుకూలంగా గొత్తికోయలు, పోలీసులకు సహకరిస్తూ సల్వాజుడం యుద్ధవాతారణాన్ని నెలకొల్పాయి. దాదాపు అర్ధ దశాబ్దకాలంలో ఇరు పక్షాల మధ్య నెలకొన్న వైరంలో రెండువైపులా వందలాది మంది ప్రాణాలు వదిలారు. అయితే సల్వాజుడంకు పోలీసుల మద్దతు ఉండడంతో సల్వాజుడందే కొంతవరకు పైచేయిగా కనిపించింది. అందుకే సల్వాజుడం అధినేత మహేంద్ర కర్మపైనే మావోయిస్టులు ప్రత్యేకంగా దృష్టి పెట్టి అతనిని అంతమొందించేందుకు చాలాకాలంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పటికే అరడజను సార్లు కర్మపై దాడులు చేయగా, అన్ని సందర్భాల్లో అతను తృటిలో తప్పించుకున్నాడు. అయితే ఇప్పుడు మాత్రం పరివర్తన యాత్ర సందర్భంగా మావోయిస్టులు పకడ్బందీగా వ్యూహరచన చేసి మహేంద్రకర్మతోపాటు, దాదాపు 30 మందిని హతమార్చడంతో సల్వాజుడం ఉనికి చత్తీస్‌గఢ్‌లో గల్లంతైపోయినట్టేనని భావిస్తున్నారు.
ఇలా ఉండగా, సల్వాజుడం దాడులకు భయపడిన గొత్తికోయలు గత కొనే్నళ్లుగా మన రాష్ట్రంలోని ఖమ్మం, వరంగల్ జిల్లాలకు వలస వచ్చి ఇక్కడే జీవిస్తున్నారు. అయితే మావోయిస్టులకు అనుకూలంగా ఉన్న గొత్తికోయలకు ఇక్కడ ఆశ్రయం ఇవ్వడం ప్రమాదకరమని పోలీసులు, అటవీశాఖ అధికారులు వాదిస్తూ, ప్రభుత్వానికి అనేక నివేదికలు కూడా పంపించారు. వారిని వెనుకకు పంపించేయాలన్న డిమాండ్ అధికారుల నుంచి ఊపందుకున్నప్పటికీ భారత రాజ్యాంగం మేరకు ఎవరైనా... ఎక్కడైనా జీవించవచ్చునంటూ ఆ ప్రతిపాదనలను ప్రభుత్వం తిరస్కరించింది. అయితే మహేంద్రకర్మ మరణానంతరం గొత్తి కోయాల్లో సొంత గ్రామాలకు వెళ్లి బతకవచ్చునన్న ఆశలు చిగురిస్తున్నట్లు కనిపిస్తోంది. ఖమ్మం, వరంగల్ జిల్లాలకు వలసపై వచ్చిన దాదాపు లక్ష మంది గొత్తి కోయల్లో కొంతమంది మళ్లీ చత్తీస్‌గఢ్‌లోని తమతమ ప్రాంతాలకు వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం.
సుకుమా, బస్తర్, జగదల్‌పూర్ జిల్లాల్లో ఉన్న భూస్వాములపై మావోయిస్టులు దృష్టి పెట్టి దాడులు చేస్తుండడంతో వారిలో ఒక భూస్వామిగా ఉన్న మహేంద్రకర్మ సల్వాజుడంను స్థాపించారు. ఇతర భూస్వాముల సహకారంతో, తమ వద్ద పనిచేసే గిరిజనులనే సైన్యంగా మలచుకున్న కర్మ సల్వాజడంను మావోయిస్టులప ప్రయోగించారు. సల్వాజుడం అంటే శాంతియాత్ర అని అర్ధ ఉంది. అదే చత్తీస్‌గఢ్‌లోని గిరిజన గోండు భాషలో పరిశుద్ధి వేట అన్న అర్ధం కూడా ఉంది. చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు లేకుండా తుడిచిపెట్టాలన్న భావంతో ఈ పేరును పెట్టారు. ఆంగ్లభాషలో శాంతియాత్ర అన్న అర్ధం ఉన్నప్పటికీ చత్తీస్‌గఢ్‌లో మాత్రం అందరిలో అశాంతే మిగిలింది. ఎప్పుడు చూసినా దండకారణ్యంలో రక్తపుటేరులే ప్రవహించాయి. ఆధిపత్యపోరులో వేలాది మంది మరణించడంతో ఎప్పుడు ఏమిజరుగుతుందో అన్న భయంతో గిరిజనులు జీవించాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు సల్వాజుడం దాదాపుగా అంతం కావడంతో గిరిజనులు కొంత ఊపిరిపీల్చుకునే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నప్పటికీ మావోయిస్టుల మారణకాండ నేపథ్యంలో పోలీసులు, అక్కడి ప్రభుత్వం గిరిజన గ్రామాలపై మావోయిస్టుల కదలికల కోసం విరుచుకుపడే ప్రమాదం ఉందని చెప్పకతప్పదు. ఇదే జరిగితే గిరిజనులకు మరోసారి అశాంతి తప్పదు.
గొత్తికోయల్లో తొలగుతున్న భయం.. ఖమ్మం, వరంగల్ నుంచి మళ్లీ వెనక్కి
english title:
a
Date:
Monday, May 27, 2013