కరీంనగర్, మే 26: ఛత్తీస్‌గడ్ దక్షిణ బస్తర్ ప్రాంతంలోని సుక్మా జిల్లా అటవీ ప్రాంతంలో శనివారం మావోయిస్టులు మెరుపుదాడికి పాల్పడి సల్వజుడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మ సహా మరో 26 మందిని హత్య చేయడంతో పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. మరీ ముఖ్యంగా సంఘటన జరిగిన ప్రాంతం ఆంధ్రప్రదేశ్, మహారాష్టల్రకు సమీపంలో ఉండడంతో దాడికి పాల్పడిన మావోయిస్టులు సరిహద్దులు దాటే అవకాశం ఉన్నట్లు కేంద్ర ఇంటలీజెన్సీ వర్గాలు అప్రమత్తం చేయడంతో కరీంనగర్ జిల్లా మహాదేవపూర్, మహాముత్తారం, వరంగల్ జిల్లా ఏటూరునాగారం, ఖమ్మం జిల్లా చర్ల వెంకటాపూర్ తదితర ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర సరిహద్దుగా ఉన్న ఆదిలాబాద్ జిల్లాల సరిహద్దుల్లో భారీ ఎత్తున బలగాలను మోహరించారు. కేంద్ర ప్రభుత్వం నక్సలైట్ల దాడిని తీవ్రంగా పరిగణిస్తుండడంతో కేంద్ర సాయుధ బలగాలను భారీ ఎత్తున రంగంలోకి దించుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలోనే సరిహద్దులను దిగ్బంధించి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్ పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ చేపట్టడం ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఇప్పటికే విశాఖపట్నం, మహాదేవపూర్‌లలో ఏర్పాటు చేసిన యూనిఫైడ్ కమాండ్ల ద్వారా నక్సల్స్ ఏరివేత కార్యకలాపాలు నిర్వహిస్తున్న గ్రేహౌండ్స్ బలగాలకు తోడుగా పారామిలటరీని కూడా రంగంలోకి దింపారు. ఇటీవలే కేంద్రం అందజేసిన హెలికాప్టర్ సహాయంతో దండకారణ్యంలో నక్సల్స్ ఉనికిని కనుక్కునేందుకు ఆపరేషన్ ప్రారంభించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రాంతంలోనే మావోయిస్టు పార్టీకి చెందిన అగ్రనేతలు కూడా మకాం వేసి ఉన్నట్లు భావిస్తున్న నేపథ్యంలో కేంద్ర బలగాలు, గ్రేహౌండ్స్ చేపట్టిన ఆపరేషన్‌తో మావోయిస్టుల ఆయువుపట్టుపై యుద్ధ్ఛాయలు అలుముకుంటున్నట్లు చెబుతున్నారు. ఇటీవలే ఈ ప్రాంతంలో కెకెడబ్ల్యూకు చెందిన 13 మందిని ఎన్‌కౌంటర్ చేయడంతో సరిహద్దుల్లో నక్సల్స్ కార్యకలాపాలు ఇకపై ఉండకపోవచ్చని భావించిన తాజా పరిణామాలతో మరోసారి సరిహద్దు గ్రామాలు భయం గుప్పిట్లోకి వెళ్లాయి. దాడికి పాల్పడిన మావోయిస్టు దళాలు ఆదిలాబాద్ వైపుకు రావచ్చన్న సంకేతాల దృష్ట్యా హెలీకాప్టర్‌తో నిఘా తీవ్రతరం చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పరివర్తన్ ర్యాలీపై దాడికి పాల్పడింది దక్షిణ బస్తర్ జిల్లా కార్యదర్శి కొర్స సత్యనారాయణ అలియాస్ కోసా అలియాస్ రామన్న ఆధ్వర్యంలో జరిగి ఉండవచ్చని మావోయిస్టుల కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తున్న విశే్లషకులు భావిస్తున్నారు. గతంలో కూడా చింతల్‌నార్ సంఘటనలో 76 మంది సిఆర్‌పి బలగాలను వ్యూహాత్మకంగా ఉచ్చు భిగించి హత్య చేయడంలో రామన్న మాస్టర్ మైండ్‌తో వ్యవహరించినట్లు చెబుతున్నారు.
దాడి సంఘటన ప్రత్యక్ష సాక్షులు చెబుతుండడాన్ని బట్టి తెలుగు మాట్లాడేది రామన్న, ఆయన అంగరక్షకులు మాత్రమేనని చెబుతున్నారు.
చత్తీస్‌గఢ్ ఘటనతో పోలీసుల అప్రమత్తం
english title:
a
Date:
Monday, May 27, 2013