ఖమ్మం, మే 26: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోకి 30 ఏళ్ల క్రితం ప్రవేశించిన మావోయిస్టులు ఆ రాష్ట్రంలో పూర్తిగా పట్టు సాధించారు. గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేసి, గిరిజనుల ఆదరాభిమానాలను పొందటమే కాకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా సమాంతర ప్రభుత్వాన్ని కూడా నడిపే దశకు చేరుకున్నారు. ఈ క్రమంలో వారిపై పైచేయి సాధించేందుకు ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసినా సఫలం కాలేకపోయింది. ఈ క్రమంలో గిరిజన నేతగా ఉన్న మహేంద్రకర్మ 1991వ సంవత్సరంలో జన జాగరణ అభియాన్ పేరుతో నక్సలైట్లకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించినా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని సాధించలేకపోయారు. అప్పటి నుంచి దంతెవాడ, సుక్మా, జగదల్‌పూర్, నారాయణపూర్ తదితర జిల్లాల పరిధిలో మావోయిస్టులకు ఎదురులేకుండాపోయింది. అయితే అటవీ ప్రాంతంలో ఖనిజ తవ్వకాల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేటు కంపెనీలకు భూములు ఇవ్వటం, మావోయిస్టులు దానిని అడ్డుకోవటం చూసిన మహేంద్రకర్మ తవ్వకాలు జరిపితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందంటూ గిరిజనుల్లోని యువకులను చేరదీసి వారిని చైతన్యపర్చాడు. ఈ సమయంలోనే సల్వాజుడుం పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి దానిలో వేలాది మంది యువతి, యువకులను చేర్చుకొని వారికి యుద్ధం చేయటంలోని మెళకువలను నేర్పించి మావోయిస్టులను హతమార్చటమే లక్ష్యంగా పని చేయాలని పురికొల్పారు. ఈ క్రమంలో పోలీస్ బెటాలియన్ల మాదిరిగా సల్వాజుడుం ఎస్పీవోల బెటాలియన్లు కూడా ఏర్పాటయ్యాయి. సుమారు 10 వేల మంది ఇందులో చేరారని అంచనా. వీరికి ఒక్కొక్కరికి 2 వేల రూపాయల చొప్పున జీతం కూడా అందించారు. వీరికి అధికార, ప్రతిపక్ష పార్టీలతో పాటు ప్రభుత్వ మద్దతు కూడా లభించటంతో ఆయుధాలు కూడా సులభంగా లభించాయి.
అయితే మావోయిస్టులకు, ఎస్పీవోలకు జరిగిన పోరాటంలో వందల సంఖ్యలో ఎస్పీవోలు మరణించగా, కొద్ది సంఖ్యలో మావోయిస్టులు కూడా హతమయ్యారు. అప్పటి నుంచి సల్వాజుడుంను సృష్టించిన మహేంద్రకర్మను లక్ష్యంగా చేస్తూ మావోయిస్టులు 14సార్లు దాడులు జరపగా, ఆయన ప్రతిసారి తప్పించుకున్నారు. చివరిగా గతేడాది నవంబర్‌లో మందుపాతర పేల్చిన సంఘటనలో తప్పించుకొని పరుగు తీస్తుండగా మావోయిస్టులు వెంట పడిన సందర్భంలో పలువురు గిరిజనులు ఆయనను రక్షించారు. అనేక సార్లు ఆయన శరీరంలోకి బుల్లెట్లు దిగినా ఆయనను వైద్యులు బతికించగలిగారు. ఈ క్రమంలో ఆయన కుమారుడిని సైతం మావోయిస్టులు హతమార్చారు. కొన్ని మానవహక్కుల సంఘాలు న్యాయ స్థానాలను ఆశ్రయించటంతో 2011 జూన్ 5న సల్వాజుడుంను నిషేధిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీంతో సల్వాజుడుం వ్యవస్థ పూర్తిగా రూపుమాపినట్లయింది. అయితే సల్వాజుడుంలో పని చేసిన ఎస్పీవోలను పోలీసులుగా నియమించాలంటూ బిజెపి ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి మహేంద్రకర్మ విజయం సాధించారు. దీంతో గిరిజనుల్లో ఆయనకు బలం పెరిగింది. అయితే సల్వాజుడుం వ్యవస్థ పూర్తిగా వెనుకడుగు వేయటంతో మావోయిస్టులు రెచ్చిపోయారు. మహేంద్రకర్మను లక్ష్యంగా చేసుకొని అనేకసార్లు దాడులు జరిపినా ఆయన తప్పించుకోవటంతో శనివారం మాత్రం ఆయన చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాతే మావోయిస్టులు సంఘటన ప్రాంతం నుంచి వెళ్ళారు. మహేంద్రకర్మ 2000 నుంచి 2003 వరకు అజీజ్‌జోగి మంత్రివర్గంలో పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రిగా పని చేయగా, అనంతరం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావటంతో కాంగ్రెస్ శాసనసభపక్ష నేతగా 2008 వరకు కొనసాగారు.
ఇదిలా ఉండగా సల్వాజుడుం, మావోయిస్టులకు జరిగిన పోరాట సందర్భంగా పదుల సంఖ్యలో గ్రామాలు పూర్తిగా ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. పలుమార్లు పోలీసులే గ్రామాలను దగ్ధం చేశారనే ఆరోపణలూ ఉన్నాయి. అదే క్రమంలో పోలీసులకు సహకరిస్తున్నారంటూ మావోయిస్టులు గిరిజనులను హింసిస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఎవరికి వారు అటవీ ప్రాంతంలో పైచేయి సాధించుకునేందుకు చేసిన పోరాటంలో అమాయక గిరిజనులు తీవ్రంగా నష్టపోయారని, వారిని ఆదుకోవాలంటూ గిరిజన సంఘాలు ఆందోళనలు కూడా చేశాయి. అయితే ఈ ఆందోళనల వెనుక మావోయిస్టులే ఉన్నారంటూ కొందరు రాజకీయ నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు.
22 ఏళ్ల పోరాటానికి తెర.. కనుమరుగవనున్న సల్వాజుడుం?
english title:
p
Date:
Monday, May 27, 2013