హైదరాబాద్, మే 26: సమాజంలో హింస, అశాంతితో ఏదీ సాదించలేరని, దీనిపై మావోయస్టులు ఆలోచించుకోవాలని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కోరారు. చత్తీస్‌గఢ్‌లో శనివారం నక్సల్స్ మారణహోమానికి తెగబడిన నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఆదివారం సాయంత్రం గాంధీభవన్‌లో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈసమావేశానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు మంత్రివర్గ సహచరులు హాజరైయ్యారు. మావోల దాడిలో చత్తీస్‌గఢ్ పిపిసి అధ్యక్షుడు నందకుమార్ పటేల్‌తో పాటు మహేంద్ర కర్మ, పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్యనేతలు మృతి చెందడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు కలతచెందినట్లు పిసిసి అధ్యక్షులు బొత్స చెప్పారు. మావోల దుశ్చర్యను ఖండిస్తూ సోమవారం అన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో సంతాపసభలను ఏర్పాటు చేయాలని ఆయన డిసిసి అధ్యక్షులను కోరామన్నారు. చత్తీస్‌గఢ్ దండకారణ్యంలో ప్రయాణిస్తున్న కాంగ్రెస్ నేతలపై మావోలు విచక్షణా రహితంగా కాల్పులు జరపడం దురదృష్టకరమన్నారు. ఈ సంఘటనను పిసిసి తీవ్రంగా ఖండిస్తోందని, మావోల దాడిలో ప్రాణాలు కోల్పోయిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నట్టు బొత్స చెప్పారు. ఇలాంటి ఘాతుకాలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ శ్రేణులు సంసిద్ధులు కావాలన్నారు. అమాయకులను చంపడం హేయమైన చర్య అని, మావోలు ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలోకి రావాలన్నారు. పంచాయితీ రాజ్ శాఖ మంత్రి జానారెడ్డి మాట్లాడుతూ మావోల దుచర్యను ప్రజస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు. పలువురు మంత్రులు, కాంగ్రెస్ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు ఈ సంతాప సభలో పాల్గొన్నారు.
సంతాప సమావేశానికి హాజరైన పిసిసి చీఫ్ బొత్స, ముఖ్యమంత్రి కిరణ్, ఇతర కాంగ్రెస్ నాయకులు
మావోల దాడి పాశవికం : సిఎం
మృతుల కుటుంబాలకు సంతాపం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 26: చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ నేతలపై మావోయిస్టులు జరిపిన దాడి పాశవికమని, దారుణమని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ఈ సంఘటన పట్ల తీవ్ర ఆవేదనను, దిగ్భ్రాంతిని ఆయన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంపై జరిగిన దారుణమైన దాడి అని, సమాజంలో హింసకు తావులేదని అన్నారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. చత్తీస్‌గఢ్ పిసిసి చీఫ్, ఆయన కుమారుడుతోపాటు పలువురు నేతలు, అమాయకులైన ప్రజల మృతి పట్ల కిరణ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
సామాజిక సమస్యగా చూడాలి : సిపిఐ నారాయణ
సల్వాజుడుం వ్యవస్ధాపకులు మహేంద్రకర్మతో పాటు పలువురు నాయకులు మందుపాతరల పేలుడుతో హత్యకు గురికావడం పట్ల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ ఒక ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దాడిని ఆయన తీవ్రంగా ఖండిస్తూ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. నక్సలిజాన్ని శాంతి భద్రతల సమస్యగా చూడరాదని, దీనిని సామజిక దృక్కోణంలో పరిశీలించి తగిన పరిష్కారం కనుగొనాలన్నారు. ఆయుధాలపైన ఆధారపడి ఒకరినొకరు జయించాలనే పట్టుదల ఇంతటి ఘోరకలి దారితీస్తున్నదన్నారు.
శాంతిభద్రతలకు ముప్పేమీ లేదు
డిజిపి దినేష్‌రెడ్డి
ఆంధ్రభూమి బ్యూరో
నిజామాబాద్, మే 26: రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఎలాంటి ముప్పు లేదని, పరిస్థితులు పూర్తిగా అదుపులోనే ఉన్నాయని డిజిపి వి.దినేష్‌రెడ్డి పేర్కొన్నారు. చత్తీస్‌గడ్‌లో మావోయిస్టులు ఘాతుకానికి తెగబడిన నేపథ్యంలో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని అన్నారు. ఆదివారం రాత్రి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో డిజిపి మాట్లాడుతూ, ఆంధ్రా-ఓరిస్సా సరిహద్దుల్లో నిఘాను పటిష్టపర్చామని, ఎఓబిని ఆనుకుని ఉండే తెలంగాణ, కోస్తాంధ్రలోని ఎనిమిది జిల్లాల్లో గ్రేహౌండ్స్ బలగాలచే కూంబింగ్‌ను విస్తృతం చేశాయని వివరించారు. చత్తీస్‌గడ్‌లో నక్సల్స్ దాడి సమాచారం తెలిసిన వెంటనే మన రాష్ట్ర పోలీసు బృందాలను సైతం అక్కడికి పంపించామన్నారు. కాగా, చత్తీస్‌గడ్‌లో దాడికి పాల్పడిన వారిలో మన రాష్ట్రానికి చెందిన మావోయిస్టులు పాల్గొన్నట్టు ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఈ విషయమై అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదని, ఈ దాడిలో ఎవరెవరు పాల్గొన్నారన్నది నిర్ధారణ జరగాల్సి ఉందని డిజిపి పేర్కొన్నారు. తెలుగు మాట్లాడే సుమారు 340మంది మావోయిస్టులు అజ్ఞాతంలో కొనసాగుతున్నారని, వారిలో 120మంది జిల్లాల సరిహద్దుల్లో ఉండగా, మిగితా వారు ఇతర రాష్ట్రాల్లో పని చేస్తున్నారని చెప్పారు. మన రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలకు భద్రత పెంచే అవకాశం ఉందా? అని విలేఖరులు ప్రశ్నించగా, ఇప్పటికే పూర్తిస్థాయిలో భద్రత కల్పించామని, అదనంగా భద్రత పెంచాల్సిన అవసరం లేదని డిజిపి సమాధానం ఇచ్చారు. విలేఖరుల సమావేశంలో ఎస్పీ దుగ్గల్ కూడా పాల్గొన్నారు.
మావోల చర్య హేయం : విహెచ్
చిత్తూరు, మే 26: చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ వాహనశ్రేణిపై మావోలు జరిపిన దాడులను కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్య సభ సభ్యుడు వి.హనుమంతరావు తీవ్రంగా ఖండించారు. మాజీ ఎంపి డికె ఆదికేశవులునాయుడు సంస్మరణ సభలో పాల్గొనేందుకు ఆదివారం చిత్తూరు వచ్చిన ఆయన కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. మావోయిస్టులు తమ సిద్ధాంతాలను పక్కన పెట్టి కేవలం రికార్డుల కోసం దాడులు చేస్తున్నారన్నారు. ఒకప్పుడు మావోయిస్టులు పేదలపక్షాన నిలిచిపోరాడితే, ఇప్పుడు పేదలను కూడా చూడకుండా ప్రతి ఒక్కరిని కాల్చి చంపుతున్నారని, ఇది ఎంత హేయమని విహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సల్వాజుడుం వ్యవస్థాపకుడు విశ్వకర్మతోపాటు పలువురిని బాంబులతో చంపడం ఇందుకు నిరదర్శనమన్నారు. భవిష్యత్తులో మావోయిస్టుల అణచివేత దిశగా కేంద్రం ప్రయత్నించాలని ఆయన ప్రధానిని కోరారు.