కోల్‌కతా, మే 26: ఐపిఎల్ మ్యాచ్‌లలో బెట్టింగ్ ఆరోపణలపై తన అల్లుడు అరెస్టయిన నేపథ్యంలో పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్ రోజురోజుకు బలపడుతున్నప్పటికీ దిగనుగాక దిగనని బిసిసిఐ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ భీష్మించుకోవడమే కాక తాను ఎలాంటి తప్పూ చేయలేదని వాదిస్తున్నాడు. ఒక తండ్రిగా, ఒక మామగా గడచిన కొద్ది రోజులు తనకు చాలా క్లిష్ట సమయమని కూడా ఆయన చెప్పాడు. తన వ్యక్తిగత ప్రయోజనాలన్నిటినీ పక్కన పెట్టి క్రికెట్ మేలు కోసం చర్యలు తీసుకుంటానని శ్రీనివాసన్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ చెప్పాడు. ఈ విషయంలో బిసిసిఐ ఎలాంటి భయ పక్షపాతాలకు తావు లేకుండా తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటుందని కూడా ఆయన చెప్పాడు. ఐపిఎల్ మ్యాచ్‌లలో స్పాట్‌ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారంపై దర్యాప్తు జరపడానికి బిసిసిఐకి ప్రమేయం లేని ఒక స్వతంత్ర కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని కూడా అయన చెప్పాడు. తన అల్లుడు, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యజమాని గురునాథ్ మెయ్యప్పన్ అరెస్టు గురించి మాట్లాడుతూ, ఈ వ్యవహారంపై కూడా కమిషన్ దర్యాప్తు జరుపుతుందని, ఒక వేళ తప్పు చేసినట్లు తేలితే అతనిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని శ్రీనివాసన్ స్పష్టం చేసాడు. దర్యాప్తును తాను ప్రభావితం చేయవచ్చన్న అనుమానాలను ఆయన తోసిపుచ్చుతూ, కమిషన్ బిసిసిఐకి ప్రమేయం లేని విధంగా ఉంటుందని, తాను ఆ కమిషన్‌లో ఉండనని కూడా స్పష్టం చేసాడు. దర్యాప్తులన్నీ పూర్తయ్యే దాకా గురునాథ్‌ను అన్ని క్రికెట్ కార్యకలాపాలనుంచి సస్పెండ్ చేయడం జరిగిందని శ్రీనివాసన్ చెప్పాడు. నేరం రుజువయ్యే దాకా నిందితులందరు కూడా నిర్దోషులేనన్న సహజన్యాయ సూత్రాన్ని ఆయన ఉటంకిస్తూ మీడియా అన్యాయమైన, వాస్తవాలను నిర్ధారించుకోని ప్రకటనలతో ప్రచారం సాగిస్తోందని విమర్శించారు. ఐపిఎల్ బిసిసిఐలో చాలా ముఖ్యమైన భాగమని, దేశంలో క్రికెట్ అభివృద్ధికి దాని నిధులు గణనీయంగా తోడ్పడ్డాయని ఆయన చెప్పాడు. టి-20 టోర్నమెంట్‌కున్న అద్భుతమైన పాపులారిటీకి స్టేడియంలోని జనాలే నిదర్శనమని కూడా ఆయన చెప్పాడు. ఈ క్లిష్ట సమయంలో బిసిసిఐ అంతా కలిసికట్టుగా తనకు అండగా ఉందని చెప్తూ, తన రాజీనామా కోరుతూ బోర్డులోపలే కొందరు సభ్యులు డిమాండ్ చేస్తున్నారంటూ వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని శ్రీనివాసన్ తెలిపాడు.
‘స్పాట్ ఫిక్సింగ్’పై దర్యాప్తుకు స్వతంత్ర కమిషన్ స్పష్టం చేసిన బిసిసిఐ అధ్యక్షుడు శ్రీనివాసన్
english title:
d
Date:
Monday, May 27, 2013