బాపట్ల, మే 26: తెలుగువారంటే ఆరంభశూరులనే ఒక నానుడి వాడుకలో ఉందని, అయితే సాటిలేని ధీరత్వం, ఔన్నత్యం తెలుగువారి సొంతమని ప్రపంచానికి చాటాలని మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య పిలుపిచ్చారు. గుంటూరు జిల్లా బాపట్లలో ఈ నెల 24నుండి జరుగుతున్న ప్రథమాంధ్ర మహాసభ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభకు ఆదివారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలుగుతల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంతెన వెంకట్రాజు ప్రాంగణం ఆవరణలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యవక్తగా మాట్లాడుతూ వేల ఏళ్ల చరిత్ర, సాంస్కృతిక వారసత్వం ఉన్న తెలుగువారి ఔన్నత్యాన్ని చాటింది ప్రథమాంధ్ర మహాసభ అని రోశయ్య చెప్పారు. వందేళ్లకు పూర్వం ప్రథమాంధ్ర మహాసభ వేదికలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకంటే స్వాతంత్య్రోద్యమానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించడం ముదావహమన్నారు. అలాంటి ఔన్నత్యానికి ప్రతీకలైన తెలుగువారు తమ సత్తా చాటుకోవలసిన సమయం ఆసన్నమైందని, మెండైన ధీరత్వం ఉందని నిరూపించుకోవాలన్నారు. ఆంధ్ర మహాసభలో అలనాటి మహనీయులు చూపిన చొరవ, స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని నేటితరం నేతలు కొనసాగించాలన్నారు. కొత్త మార్పులకు స్వాగతం పలుకుతూ, పాత సంస్కృతిని వీడకుండా సమ్మిళితం చేసుకునే అందమైన సంస్కృతి తెలుగువారి సొంతమని వివరించారు.
ప్రథమాంధ్ర మహాసభ శతాబ్ది వేడుకల ముగింపు సభలో మాట్లాడుతున్న తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య