వింజమూరు, మే 26: వింజమూరు మండలం నల్లగొండ గ్రామంలో వెలసివున్న లక్ష్మీనరసింహుని కల్యాణోత్సవం కమనీయంగా జరిగింది. ఆదివారం ఉదయానే్న స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అగ్ని ప్రతిష్ఠాపన , ఉక్తహోమాలు నిర్వహించారు. తదుపరి స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించిన కల్యాణ మండపాన్ని తీసుకువచ్చారు. దేవేరులను స్వామివారికి ఎదురుగా కొద్ది దూరంలో ఉంచారు. మధ్యలో స్వామివారికి అమ్మవార్ల నుంచి కల్యాణం చేసేందుకు ఇష్టమా కాదా అని వ్యాఖ్యాన రూపాన్ని అద్భుతంగా నిర్వహించారు. అమ్మవారి తరపున ఒక అర్చకులు, స్వామివారి తరపున మరో అర్చకుడు చేసిన సంవాదం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. స్వామివారి గొప్ప తనాన్ని, అమ్మవారి యొక్క మహత్యాన్ని సంభాషణ ద్వారా భక్తులకు వివరించారు. రాతి స్థంభం నుంచి నరసింహస్వామి ఉద్భవించి తన భక్తుడైన ప్రహ్లాదుని మాటను నెరవేర్చిన స్వామివారి గొప్పనగా నరసింహస్వామివారని పిలవడంలో అమ్మవారి గొప్పతనమని అమ్మవారు లేకపోతే స్వామివారికి విలువ లేదని చేసిన సంభాషణ భక్తులను ఎంతగానో ఆకర్షించింది.
దండ మార్పిడి కార్యక్రమం (ఎదురుకోలు)
స్వామివారి వివాహంలో భాగంగా స్వామివారికి, అమ్మవార్లకు దండ మార్పిడి జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రత్యేకత స్వామివారు, అమ్మవార్లు ఎలా నడుస్తూ ఉంటారో అర్చకులు నాట్యం ద్వారా ప్రదర్శించారు. అమ్మవారి దండను ఒక బృందం, స్వామివారి దండను మరొక బృందం నాట్యం చేస్తూ ఎదురుకోలు నిర్వహించారు. తరువాత దేవాలయ ధర్మకర్త అన్నపురెడ్డి మురళీధర్‌రెడ్డి దంపతులు సమర్పించిన పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, మంగళసూత్రం ధరింపజేసారు. తదుపరి దేవేరులను స్వామివారి చెంతకు చేర్చారు. వేద మంత్రాలతో మంగళ వాయిద్యాలతో భక్తుల గోవింద నామ స్మరణల మధ్య స్వామివారి తలంబ్రాల కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. కార్యక్రమం జరుగుతున్న సమయంలో గోవింద నామ స్మరణతో నల్లగొండ గ్రామం పులకించిపోయింది. భక్తులు పోటీలు పడి స్వామివారికి, అమ్మవారికి కానుకలు అందజేసారు. చెన్నైకి చెందిన ఓ భక్తురాలు 3.5 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు అందచేయగా కానుకలుగా 99వేల 5 వందలు వచ్చాయని ఆలయ ధర్మకర్త మురళీధర్‌రెడ్డి తెలిపారు. సాయంత్రం బండలాగుడు పోటీ నిర్వహించారు. విజేతలయిన వారికి ప్రధమ బహుమతిగా 20వేలు, ద్వితీయ బహుమతిగా 10వేలు, తృతీయ బహుమతిగా 5వేలు అందజేసారు. బహుమతి ప్రధాతలుగా నల్లగొండ గాంధీబొమ్మ సెంటర్‌వారు వ్యవహరించారు. రాత్రి గజ మహోత్సవాలు నిర్వహించారు. ఆనంతరం మాటీవి గాయకులు, టీవి9 యాంకర్లతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కళ్యాణ వేడుకులకు ముఖ్య అతిధిగా విచ్చేసిన విద్యారణ్య సరస్వతి స్వామి రామాయణంలోని అనుమంతుని గొప్పతనాన్ని భక్తులకు వివరించారు. కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు జిల్లాలోని అనేక గ్రామాలనుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
హరిద్వార్ క్రికెట్ టోర్నీలో ఆంధ్రాజట్టుకు ద్వితీయ స్థానం
నెల్లూరు, మే 26: హరిద్వార్ యూత్ టి-20 క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన యూ-20 (20 సంవత్సరాల్లోపుక్రీడాకారులు)ఛలెంజర్ క్రికెట్ గోల్డ్‌కప్ 2013లో ఆంధ్రప్రదేశ్ జట్టు ద్వితీయస్థానంలో విజయం సాధించింది. ఈ నెల 20వ తేదీ నుంచి 23వ తేదీ వరకు రొషనాబాద్ క్రికెట్ స్టేడియంలో టోర్నమెంట్ నిర్వహించారు. జాతీయస్థాయిలో నిర్వహించిన ఈ పోటీలకు ఏపియూత్ ఆంధ్ర ఛాలెంజర్స్ టీమ్‌గా తాము హాజరయ్యారు. ఏపి యూత్ ఆంధ్ర ఛాలెంజర్స్‌గా కెప్టెన్ హంసా ఫృద్విచంద్ (నెల్లూరు) వ్యవహరించారు. అంతేగాక ఈ జట్టులో మరో నలుగురు క్రీడాకారులు కూడా నెల్లూరీయులే కావడం విశేషం. అందువల్ల జట్టు క్రీడాకారులందరితో కలసి నెల్లూరు ప్రెస్‌క్లబ్‌లో విలేఖర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసి తమ రన్నరప్ వివరాలను వెల్లడించారు. మొత్తం జట్టులో శ్రీహర్ష, సతీష్, వెంకట్రావ్, సమీర్, షఫీ, గోపి, మనోజ్, మస్తాన్, రాజేష్, భాను, అభినవ్, రాహుల్ క్రీడాకారులుగా వ్యవహరించారు. జట్టుకు కోచ్‌గా కడపజిల్లాకు చెందిన రేవంత్, మేనేజర్‌గా కృష్ణాజిల్లాకు చెందిన చిన్ని వ్యవహరించారు. టోర్నమెంట్‌లో మ్యాన్ ఆఫ్‌ది సిరీస్‌గా కెప్టెన్ ఫృద్విచంద్ నిలిచారు.
అంతర్గతంగా కిరి కిరి
బహిర్గతంగాని డివిజన్ల హద్దులు
నెల్లూరు, మే 26: నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో నూతనంగా విలీనమైన 15 గ్రామ పంచాయతీల కారణంగా ఇప్పటి వరకు ఉన్న డివిజన్ల సంఖ్య, హద్దులు మారాయి. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనల వెల్లడిలో జాప్యం జరుగుతోంది. గతంలో నగర పాలక సంస్థ పరిధిలో ఏభై డివిజన్లు ఉండగా, ఆ సంఖ్య ఇప్పుడు 54కు చేరింది. పెరిగిన పంచాయతీల జనాభా, విస్తీర్ణం వివిధ డివిజన్లకు సగటున సర్దుబాటయ్యేలా ప్రతిపాదనల నివేదికలు తయారు చేశారు. ఆదివారం వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయని నగర పాలక సంస్థకు తాజాగా కమిషనర్ పదవీ బాధ్యతలు స్వీకరించిన జాన్‌శ్యాంసన్ పత్రికాముఖంగా వెల్లడించారు. నగరపాలక సంస్థ కార్యాలయంతో సహా నెల్లూరు కలెక్టర్ కార్యాలయం, ఆర్‌డిఓ, తహశీల్దార్, రిజిష్ట్రార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. వీటిని పరిశీలించిన అనంతరం అభ్యంతరాలుంటే వారంలోగా తమకు తెలపాలని కోరారు. అయితే ఆయా ప్రతిపాదనలు వెల్లడి కాకనే ఓ రోజు గడచిపోయింది. జనం చెప్పే అభ్యంతరాలకు మార్పులు అంతంత మాత్రమే. రాజకీయ కారణాల నేపథ్యంలో పోటాపోటీగా వివిధ పక్షాలు అభ్యంతరాలను వ్యతిరేక, సమర్ధనీయ కోణంలో చెపుతుంటారు. అయితే ఓ రోజుపాటు గుట్టుచప్పుడు కాకుండా అంతాలోపలే ఉంచి నివేదికల ప్రతిపాదనలు మార్పు చేస్తున్నట్లుగా ప్రచారం ఉంది. కాంగ్రెస్ పెద్దలకు అనుకూలంగా అధికార యంత్రాంగమే ఇలా సహకరిస్తున్నారు. ఇదే విషయమై నగర పాలక సంస్థ కమిషనర్ జాన్‌శ్యాంసన్‌ను వివరణ కోరగా, రేపటి రోజున తప్పక వెల్లడయ్యేలా చూస్తామంటూ సమాధానమిచ్చారు.
ట్రాఫిక్ ఖాఖీలకు ఓఆర్‌ఎస్ వితరణ
నెల్లూరు, మే 26: నగరంలోని వివిధ రూట్లలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు ఓఆర్‌ఎస్ డబ్బాలు, సబ్బులు, పౌడర్ డబ్బాలను ఎన్‌ఎండి ఛారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు వితరణగావించారు. ఆదివారం ఆ సంస్థ ప్రతినిధులు సయ్యద్ నిజాముద్దీన్, ఎస్‌కె ఖాలీద్, షేక్ షాన్‌వాజ్, సమద్, ఉమర్, తదితరులు వీటిని అందజేశారు. మండు వేసవిలో సైతం విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసుల తీరును అభినందిస్తూ చిరు సహాయం అందజేస్తున్నట్లు ఎన్‌ఎండి ప్రతినిధులు వెల్లడించారు.
వైభవంగా రథోత్సవం
నెల్లూరుసిటీ, మే 26:నగరంలోని ఉస్మాన్‌సాహెబ్‌పేటలో గల అన్నపూర్ణ సమేత కాశీ విశే్వశర ఆలయం బ్రహోత్సవాల్లో భాగంగా ఆదివారం రథోత్సవం అతి వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నెల్లూరుసిటీ, రూరల్ ఎమ్మెల్యేలు ముంగమూరు శ్రీ్ధర్‌కృష్ణారెడ్డి, ఆనం వివేకానందరెడ్డి పాల్గొన్నారు. ఈ నెల 20నుండి 28వ తేదీ వరకు జరిగే ఉత్సవాలకు భక్తులు వేల సంఖ్యలో హాజరై తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తున్నారు. సోమవారం ధ్వజరోహణ, మంగళవారం ఏకాంతసేవతో బ్రహోత్సవాలు ముగుస్తాయి. గత 30ఏళ్ళ నుండి దేవాలయానికి రథం లేకపోవడంతో స్వచ్ఛందంగా పత్తి జయరామయ్యనాయుడు అనే భక్తుడు దేవాలయానికి రథన్ని బహూకరించారు. గతంలో ఎన్నడు లేని విధంగా ఈ రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. యువకులు, మహిళలు, పెద్దలు భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగారు. భక్తులు రథంపై బియ్య, మిరియాలు చల్లి మొక్కులు తీర్చుకున్నారు. కొందరు రథం ముందు టెంకాయలు కొట్టి కర్పూర హారతులు వెలిగించారు. రథోత్సవం సందర్భంగా స్టోన్‌హౌస్‌పేట ప్రాంతం భక్తులతో కిటికిటలాడింది. ఈ ఉత్సవానికి పత్తి జయరామయ్యనాయుడు ఉభయకర్తగా వ్యవహరించారు. ఈకార్యక్రమంలో మల్లికార్జున్, స్థానిక కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
20 గడ్డి వాములు ధగ్ధం
చేజర్ల, మే 26: మండలంలోని కాకివాయి గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదంలో పలువురు రైతులకు చెందిన 20 గడ్డివాములు ధగ్ధమైనాయి. ఆస్తి నష్టం సుమారు 10 లక్షల రూపాయల వరకు ఉంటుందని ప్రాధమిక అంచన. ఎవరో అజాగ్రత్తగా సిగరెట్ తాగి పడవేయడంతో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. పొదలకూరు ఫైర్ ఇంజన్ వెళ్లి మంటలను అదుపుచేసింది.
వడదెబ్బకు వృద్దుడు మృతి
దుత్తలూరు, మే 26: దుత్తలూరు మండలంలోని బైరవరం గ్రామానికి చెందిన శ్రీరామ మాలకొండయ్య(65) అనే వ్యక్తి ఆదివారం వడదెబ్బకు మృతి చెందనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇతనికి భార్య, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు.
పేదల ఆకలికేకలపై రాజీలేని పోరు
పొదలకూరు, మే 26: పేదలకు రేషన్ దుకాణాల ద్వారా ఇచ్చే బియ్యాన్ని పెంపు చేయాలని కోరుతూ చేపట్టిన తమ ఆకలికేకల పోరుయాత్ర రాజీలేని పోరాటం చేస్తుందని ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి జెన్ని రమణయ్యమాదిగ తెలిపారు. పోరుయాత్రలో భాగంగా ఆదివారం ఆయన పొదలకూరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత పాలకులు పేదల గురించి పట్టించుకోవడం లేదన్నారు. ఎంఆర్‌పిఎస్ జిల్లా కార్యదర్శి ఎం రవీంద్ర బాబు, విహెచ్‌పిఎస్ మండలధ్యక్షలు షేక్ చాన్‌భాషా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సుధాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన సతీష్‌రెడ్డి
ఆత్మకూరు, మే 26: భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కుడుముల సుధాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులను డిఆర్‌డిఓ డైరెక్టర్ జి సతీష్‌రెడ్డి ఆదివారం పరామర్శించారు. సుధాకర్‌రెడ్డి అల్లుడు ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ సందర్భంగా పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు సుధాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన సన్నిహితంగా ఉన్న డిఆర్‌డిఓ డైరెక్టర్ సతీష్‌రెడ్డి అప్పట్లో రాలేని పరిస్థితి ఏర్పడింది. ఎట్టకేలకు మహిమలూరు గ్రామస్తులు సతీష్‌రెడ్డిని సన్మానించేందుకు ఆహ్వానించడంతో కుడుముల సుధాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు అవకాశం కలిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను రైతు కుటుంబం నుంచి ఈ స్థాయికి ఎదిగానని తెలిపారు. కుడుముల సుధాకర్‌రెడ్డి అల్లుడు చనిపోవడంతో ఆ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు విచ్చేశానని అన్నారు. ఈయన వెంట భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కుడుముల సుధాకర్‌రెడ్డి, బీజెపీ మున్సిపాలిటీ టౌన్ అధ్యక్షులు కరటంపాటి సుధాకర్, ఎస్సై ఆంజనేయులరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పుచ్చలపల్లి రవీంద్రారెడ్డి, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వైభవంగా సీతారాముల కల్యాణం
వింజమూరు, మే 26: స్థానిక ఉత్తర హరిజనవాడలో ఆదివారం శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామివారికి ఉదయానే్న ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపించారు. అనంతరం స్వామివారి కల్యాణం కన్నుల పండువగా జరిగింది. గ్రామస్తులందరూ కలిసి స్వామివారి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించి రాత్రికి గ్రామోత్సవం జరిపించారు. సోమవారం పారువేట కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్ధ ప్రసాదానికి స్వీకరించి స్వామి కృపకు పాత్రులయ్యారు.
రైలు నుంచి జారిపడి యువకుడి గాయాలు
బిట్రగుంట,మే 26: బిట్రగుంట స్టేషన్ సమీపంలో అదివారం సాయంత్రం ఢిల్లీ నుండి చెన్నై వెళ్లే దురంతో ఎక్స్‌ప్రెస్ నుండి యువకుడు జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. యువకుడిని 108 సిబ్బంది ప్రథమచికిత్స చేసి కావలి ఏరియా అసుపత్రి తరలించారు. రైలు నుండి జారిపడటంతో వెనె్నముక దెబ్బతిన్నట్లు తెలిసింది. గాయపడిన యువకుడు చెన్నై వాసి కె.శ్రీరామ్‌గా గుర్తించారు. బిట్రగుంట రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్నున్నారు.
విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ దగ్ధం
బిట్రగుంట, మే 26: మండలం విశ్వనాథరావుపేట పంచాయతీలో అదివారం మధ్యాహ్నం విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ దగ్ధమైంది. దీంతో స్థానిక ప్రజలు అందోళన చెందారు. ఎస్ 10 ట్రాన్స్ ఫార్మర్ విద్యుత్ వైర్లు షార్ట్‌సర్క్యూట్ కావడంతో విద్యుత్ సరాఫరా నిలిచి పోయింది. సమాచారం అందుకున్న సిబ్బంది వెంట మరమ్మతులు చేపట్టారు. దీంతో నాలుగు గంటలపాటు విద్యుత్ సరాఫరా నిలిచిపోయింది. అసలే విద్యుత్ కోత ఉండగా ఈసంఘటన జరగటంతో విశ్వనాథరావుపేట ప్రజలు అవస్థలు పడ్డారు.
నేత్ర రోగులకు అద్దాలు పంపిణి
బిట్రగుంట, మే 26: నాగులవరం పంచాయతీలో అదివారం టిడిపి బిసి సెల్ నాయకుడు పిన్నిబోయిన సుధాకర్ నేత్ర రోగులకు కంటి అద్దాలు పంపిణి చేశారు. ఇటివల బిఎంఆర్ ట్రస్టు అధ్వర్యంలో చేపట్టిన వైద్య శిబిరంలో కంటి పరీక్షలు చేసి గుర్తించిన రోగులకు అద్దాలు ఇవ్వగా ఆయన పంపిణి చేశారు.