రాజమండ్రి, మే 27: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల పాదయాత్ర కోసం జిల్లాకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరాటపడుతున్నారు. జూన్ 6న షర్మిల జిల్లాలో అడుగుపెట్టనున్న సంగతి విదితమే. జిల్లాలో కొనసాగే షర్మిల పాదయాత్ర తాము ప్రాతినిధ్యంవహించే అసెంబ్లీ నియోజకవర్గం మీదుగానే కొనసాగే విధంగా జిల్లాకు చెందిన ఆ పార్టీ నాయకులు పట్టుబడుతున్నారు. రానున్న పంచాయతీ, జడ్పీటిసి, ఎంపిటిసి, మున్సిపల్ ఎన్నికలతో పాటు, వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకున్న వైఎఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని అన్ని స్థాయిల నాయకులు షర్మిల పాదయాత్ర తమ నియోజకవర్గం మీదుగా సాగితే తమకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందన్న ఆశతో ఉన్నారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం మాత్రం స్థానిక ఒత్తిళ్లను ఏ మాత్రం పట్టించుకోకుండా, పార్టీకి ఎక్కువ ప్రయోజనం ఏ రూటులో కలుగుతుందో సర్వే చేసుకుని, దాని ప్రకారమే రూటు మ్యాప్ ఖరారుచేసే పనిలో ఉన్నారు. అసలు రూటు మ్యాప్ ఎలా ఉంటుందో జిల్లాకు చెందిన నాయకులెవరూ చెప్పలేకపోతున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుండి ఇప్పటికే ఒక బృందం జిల్లాలో పర్యటిస్తూ వివిధ రూట్లను సర్వే చేస్తోంది. అయితే ఏ రూటులో సర్వే చేస్తోందో జిల్లాలోని ఒకరిద్దరు పార్టీ నాయకులకు మినహా మిగిలిన వారెవరికీ తెలియటం లేదు. ఈ నెల 6న రోడ్‌కంరైలు వంతెన మీదుగా రాజమండ్రిలో అడుగుపెట్టనున్న షర్మిల, మెయిన్ రోడ్డు మీదుగా కోటగుమ్మం సెంటరుకు చేరుకునే వరకు మాత్రమే తనకు రూటు మ్యాప్ తెలుసునని, తరువాత నుండి తనకు తెలియదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకుడొకరు చెప్పారు. జిల్లాకు చెందిన చాలా మంది నాయకులు తమ నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర రూటు మ్యాప్‌ను ఖరారుచేయాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నా ఫలితం ఉండటం లేదన్నారు. జిల్లాలో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర లేకపోయినాగానీ ఎవరూ బాధపడకుండా పాదయాత్రను విజయవంతం చేసేందుకే కృషిచేయాలని ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొన్ని సంకేతాలు ఇచ్చారు. దాంతో షర్మిల పాదయాత్ర తమ నియోజకవర్గం మీదుగా కొనసాగేందుకు తమ వంతు ప్రయత్నంచేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, చివరకు అధిష్ఠానం ఖరారుచేసిన రూటు మ్యాప్ ప్రకారం ఏర్పాట్లు చేసేందుకు సిద్ధపడుతున్నారు.
సంపత్‌నగరం వద్ద దారిదోపిడీ
నిందితుల్లో ఒకరిని పట్టుకున్న ఎమ్మెల్యే త్రిమూర్తులు - రామచంద్రపురం పోలీసులకు అప్పగింత
రామచంద్రపురం, మే 27: వివాహ కార్యక్రమానికి హాజరై, కారులో తిరిగవెళ్తున్న ఒక కుటుంబాన్ని అడ్డగించి, దోపిడీకి పాల్పడగా, ఈ ఘటనలో పాల్గొన్న ఒక నిందితుడిని సాక్షాత్తూ రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు తన అనుచరులతో పట్టుకుని, పోలీసులకు అప్పగించారు. రాజానగరం పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకోగా, నిందితుడిని రామచంద్రపురం పోలీసులకు అప్పగించడంతో వారు కేసు నమోదుచేసి, రాజానగరం బదిలీచేశారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలావున్నాయి... రామచంద్రపురం మండలం ద్రాక్షారామకు చెందిన పెమ్మిరెడ్డి నాగేశ్వరరావు తన కుటుంబ సభ్యులతో కలిసి, ఆదివారం రాత్రి రాజమండ్రిలో జరిగిన ఒక వివాహానికి హాజరయ్యారు. వివాహం అనంతరం వారు కారులో ద్రాక్షారామకు తిరుగుప్రయాణమయ్యారు.రాజానగరం మండలం నామవరం గ్రామం వద్ద ద్విచక్ర వాహనంపై వచ్చిన ముగ్గురు వ్యక్తులు కర్రలతో వీరి కారును అటకాయించారు. అయితే డ్రయివర్ కారును ఆపకుండా వేగంగా ముందుకు పోనిచ్చాడు. ద్విచక్ర వాహనంపై ఉన్న దోపిడీదారులు కారును వెంబడించారు. కారు సంపత్‌నగరం చేరుకున్నాక నిలిచిపోయింది. ఈలోగా దోపిడీదార్లు అక్కడకు చేరుకుంటుండటంతో కారులో ఉన్న మహిళలకు సమీపంలోని ఒక ఇంటిలోకి పంపించేశారు. కారు వద్దకు వచ్చిన దుండగులు నాగేశ్వరరావు మెడలోని బంగారు గొలుసు, సెల్‌ఫోన్‌ను, నగదు దోచుకున్నారు. అయితే నామవరం నుండి తమ కారును దోపిడీదొంగలు వెంబడిస్తున్న విషయాన్ని నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు అదే వివాహ కార్యక్రమానికి హాజరైన రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుకు సెల్ ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీనితో ఆయన హుటాహుటిన తన వాహనంలో సంఘటనా స్థలికి చేరుకున్నారు. ముగ్గురు దోపిడీదారుల్లో ఒకరైన జుత్తుగ ప్రసాద్ ఎమ్మెల్యేకు చిక్కాడు. తెల్లవారు జామున 2.30 గంటలకు ప్రసాద్‌ను నేరుగా సంఘటనా స్థలం నుండి రామచంద్రపురం పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి, యస్సై బి యాదగిరికి అప్పజెప్పారు. సర్కిల్ ఇనస్పెక్టర్ మొగలి వెంకటేశ్వరరావు, యస్సై బి యాదగిరిల సమక్షంలో జుత్తుగ ప్రసాద్ నేరాన్ని అంగీకరించాడు. సంఘటనా స్థలం రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలోనిది కావడంతో కేసు నమోదుచేసి, అక్కడికి బదిలీచేశామని, నిందితుడు ప్రసాద్‌ను ఆ పోలీస్ స్టేషన్‌కు అప్పగించామని ఎస్సై యాదగిరి వెల్లడించారు.
105 మందిపై వేసవి వడదెబ్బ
కాకినాడ సిటీ, మే 27: వేసవి ప్రారంభమైన ఏప్రిల్ 1 నుండి ఇప్పటి వరకు జిల్లాలో వడదెబ్బ కారణంగా 105 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. పెద్దాపురం డివిజన్‌లో 24 మంది, రాజమండ్రి డివిజన్‌లో 14 మంది, అమలాపురం డివిజన్‌లో అత్యధికంగా 46 మంది, కాకినాడ డివిజన్‌లో 17 మంది, రంపచోడవరం డివిజన్‌లో నలుగురు మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు.
మరో ముగ్గురు మృతి
డి గన్నవరం: మండలంలో వడగాల్పులకు గురై ఆదివారం రాత్రి, సోమవారం మరో ముగ్గురు మృతిచెందారు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో మొండెపులంకకు చెందిన పల్లి రాఘవులు (62), డి గన్నవరంనకు చెందిన దూనబోయిన నర్సింహమూర్తి (70), సోమవారం మధ్యాహ్నం నరేంద్రపురం పెదపాలెంకు చెందిన కుడిపూడి చంద్రరావు (60)లు మృతిచెందారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల పాదయాత్ర కోసం జిల్లాకు
english title:
s
Date:
Tuesday, May 28, 2013