అనంతపురం టౌన్, మే 27: నాణ్యత లేని సబ్సిడీ విత్తనాలు ఉంటే కౌంటర్ వద్దనే తనిఖీ చేసుకుని వాపసు చేసి మంచి విత్తనాలు తీసుకెళ్ళాలని వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక మార్కెట్ యార్డులో సబ్సిడీ విత్తన పంపిణీ కార్యక్రమాన్ని మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, రఘువీరారెడ్డిలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎం.పి అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యే సుధాకరరెడ్డి, ఇన్‌చార్జి కలెక్టర్ సత్యనారాయణ, వ్యవసాయ శాఖ జె.డి సాంబశివరావు, మార్కెట్ యార్డు చైర్మన్ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సబ్సిడీ విత్తనాలు నాణ్యత లేకుంటే జిల్లా మంత్రుల దృష్టికి తీసుకురావాలన్నారు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకుంటే నేరుగా తనకు ఫిర్యాదు చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోనని తెలిపారు. ఈ ఏడాది భగవంతుడి దయతో మంచి వర్షాలు కురిసి రైతులు అధిక దిగుబడి సాధించాలని కోరారు. రైతుల అవసరానికి ఆదుకుని, కష్టానికి తోడుగా నిలిచి కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటోందన్నారు. తక్కువ వ్యయంతో అధిక దిగుబడి సాధించి వ్యవసాయం పండుగలా చేసేందుకు చేయూతనిస్తోందన్నారు. గత ప్రభుత్వ తొమ్మిదేండ్ల పాలనా కాలంలో 149 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని అందించగా, కాంగ్రెస్ పాలనా కాలంలో 1400 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని అందించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా చేతగాని పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీని తిడుతూనే బతుకుతున్నాయన్నారు. కాంగ్రెసేతర ప్రభుత్వాలు తమవిగా చెప్పుకునే గొప్ప కార్యక్రమాలేవి చేపట్టలేదన్నారు. అయితే కాంగ్రెస్ కార్యకర్త ధైర్యంగా మా ప్రభుత్వం చేసిన మంచి పనులివని చెప్పుకునే స్థితిని కల్పించామన్నారు. ఎరువుల రేట్లు పెరిగినా వాటికి తగ్గట్టుగానే కేంద్ర ప్రభుత్వం 9500 కోట్ల రూపాయల సబ్సిడీని ఇస్తోందన్నారు. అంతేగాకుండా వడ్డీ లేకుండా లక్ష రూపాయల వరకు రుణ వసతిని కల్పిస్తున్నామన్నారు.
4 లక్షల క్వింటాళ్ళ విత్తనం పంపిణీ :రెవెన్యూ మంత్రి
జిల్లాలో రైతుల అవసరాల మేరకు నాలుగు లక్షల క్వింటాళ్ళ సబ్సిడీ వేరుశెనగ విత్తనం పంపిణీకి అందుబాటులో ఉంచినట్లు రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక మార్కెట్ యార్డులో విత్తన పంపిణీ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ 2004 సంవత్సరం నుంచి జిల్లాలో మిశ్రమ పంటల సాగును ప్రోత్సహిస్తున్నామన్నారు. వేరుశనగతోపాటు జొన్న, మొక్కజొన్న, ఆముదం, కందులు తదితర విత్తనాలు సబ్సిడీతో అందిస్తున్నామన్నారు. నాణ్యమైన విత్తనం ఇవ్వటానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు. నాణ్యత లేని విత్తనాలను కౌంటర్ వద్దే పరిశీలించి వాపసు చేయాలని సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు 300 క్వింటాళ్ళ నాణ్యత లేని వేరుశెనగ విత్తనాలను వెనక్కు తిప్పి పంపామన్నారు. ఈ ఏడాది వాతావరణం అనుకూలించి వర్షాలు బాగా వస్తాయని పంచాంగ కర్తలు సూచించారన్నారు. జిల్లాకు 648 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ, 181 కోట్ల బీమా మంజూరైందన్నారు. ప్రాజెక్ట్ అనంత కింద తయారుచేసిన ఏడున్నర వేల కోట్ల రూపాయల నివేదిక ప్రస్తుతం ప్లానింగ్ కమిషన్ పరిశీలనలో ఉందన్నారు. విత్తన పంపిణీ కౌంటర్ల వద్ద ప్రతి చోట నిఘా ఉంచామన్నారు. నాణ్యమైన విత్తనాలు, తాగునీటి వసతి కల్పించాలని ఆదేశించామన్నారు. అలాగే సబ్సిడీ విత్తనం ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలించకుండా నిఘాను పటిష్టపరచాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశామన్నారు.
* విత్తన పంపిణీ ప్రారంభోత్సవం * మంత్రి కన్నా లక్ష్మీనారాయణ
english title:
n
Date:
Tuesday, May 28, 2013