అనంతపురం టౌన్, మే 27: బ్రిటీష్ పాలన నుంచి భారతదేశాన్ని విముక్తం చేయటంతోపాటు ప్రధానమంత్రిగా జవహర్‌లాల్ నెహ్రూ దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపారని, అంతేకాకుండా దేశంలో ఆహార కొరత తీర్చటానికి విశేష కృషి సల్పారని వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. సోమవారం స్థానిక పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు కాంగ్రెస్ భవన్‌లో జవహర్‌లాల్ నెహ్రూ వర్ధంతి సమావేశం జరిగింది. తొలుత జాతీయ నేతల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి, ఎం.పి అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యే సుధాకర్, కాంగ్రెస్ నాయకులు వేణుగోపాల్, శంకర్, పరశురాం, రామకృష్ణారెడ్డి, దాదాగాంధి, శ్రీనివాసులు, రవిశంకర్‌రెడ్డి, శ్రీకాంత్, విజయభాస్కరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంత్రి కన్నా లక్ష్మినారాయణ మాట్లాడుతూ బ్రిటీష్ వారైనప్పటికీ సర్ ఆర్థర్ కాటన్, థామస్ మన్రోలు ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలు చూరగొన్నారని అన్నారు. సర్ ఆర్థర్ కాటన్ కృష్ణా నదీ జలాలు వృథాగా సముద్రంలో కలియకుండా చూడటానికి నిర్మించిన ఆనకట్ట వలన డెల్టా భూములు సాగులోకి వచ్చాయన్నారు. దీనివలన తిండి గింజల కొరత తీర్చగలిగారన్నారు. అలాగే దత్త మండలాల కలెక్టర్‌గా థామస్ మన్రో పాలెగాళ్ళ వ్యవస్థను రద్దు చేసి రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేశారన్నారు. భౌతికంగా వారు మన మధ్య లేకున్నా వారు ప్రజల హృదయాలలో శాశ్వత స్థానం సంపాదించుకున్నారని అన్నారు. వారు చేసిన మేలును ప్రజలెన్నటికీ మరచిపోలేరన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పరివర్తన్ యాత్రపై మావోయిస్టులు జరిపిన దాడిని ఆయన ఖండించారు. నక్సలిజం, తీవ్రవాదం, వేర్పాటువాదాలను ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకించాలన్నారు. ఛత్తీస్‌గఢ్ మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు వౌనం పాటించారు.
* వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ
english title:
a
Date:
Tuesday, May 28, 2013