శేరిలింగంపల్లి, మే 29: హెపటైటిస్ బి, సి వ్యాధులవల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతిఏటా 60వేల మంది మరణిస్తున్నారని గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డా. శ్రీవేణు ఐతా పేర్కొన్నారు. ప్రపంచ డైజెస్టివ్ హెల్త్‌డేను పురస్కరించుకుని బుధవారం మియాపూర్ ఆల్విన్‌కాలనీలోని సిగ్నస్ ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వ్యాధి గురించి వివరించారు. హెపటైటిస్ బి,సి వ్యాధులపట్ల ప్రజలను చైతన్యం చేసే పోస్టర్‌ను శ్రీవేణు ఆవిష్కరించారు. ఏటా సుమారు ఏడు లక్షలమంది క్యాన్సర్‌తో మరణిస్తున్నారని, కారణం హెపటైటిస్ బి, సి అని తెలిపారు. ముందుగా గుర్తిస్తే లివర్ క్యాన్సర్‌ను నివారించవచ్చని అన్నారు.
ఆ నలుగురే!
* గ్రేటర్ బల్దియాలో అరకొర ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు
* అటెండర్లు అయిదుగురే
* ఆహార విక్రయ కేంద్రాలపై నిఘా అంతంత మాత్రమే
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 29: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18 సర్కిళ్లలో కోకొల్లలుగా వెలుస్తున్న ఆహార విక్రయ కేంద్రాలపై ఎప్పటికపుడు నిఘా పెడుతూ, ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యతను విస్మరించి వ్యవహారిస్తుందన్న విమర్శ వెల్లువెత్తుతోంది. కానీ నగరం గ్రేటర్‌గా రూపాంతరం చెందిన ఏడు సంవత్సరాలుగా గడుస్తున్నా, నేటికీ నలుగురు మాత్రమే ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. అంతేగాక, వారి కింది స్థాయి సిబ్బంది అయిన అటెండర్లు కూడా అయిదుగురు మాత్రమే ఉండటంతో కొత్తగా వెలుస్తున్న ఆహార విక్రయకేంద్రాలపై బల్దియా ఆశించిన స్థాయిలో నిఘా పెట్టలేకపోతోంది. కొత్తగా ఏర్పాటవుతున్న ఆహార విక్రయ కేంద్రాలు, అలాగే ఇప్పటికే రోడ్డు పక్కన, ఫుట్‌పాత్‌లపై వెలసిన, వెలుస్తున్న చిన్న విక్రయ కేంద్రాలపై ఎప్పటికపుడు నిఘా పెట్టి, ముఖ్యంగా వాతావరణంలో మార్పులు వస్తున్నపుడు, వర్షాకాలం ప్రారంభంలో శ్యాంపిల్స్ సేకరించి ల్యాబ్ పంపి, లోపాలుంటే తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ 18 సర్కిళ్లకు సరిపోయే స్థాయిలో ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు లేకపోవటంతో ప్రజారోగ్య పరిరక్షణకు చేపడుతున్న చర్యలు తూతూమంత్రంగా మారిపోయాయి. ప్రస్తుతం గ్రేటర్ లోని వెస్ట్, సౌత్ జోన్లలోని ఆహార విక్రయ కేంద్రాలపై నిఘా పెట్టేందుకు సుదర్శన్‌రెడ్డి, ఆయనతో పాటు మరో ఇద్దరు అటెండర్లు విధులు నిర్వహిస్తున్నారు. అలాగే సెంట్రల్ జోన్‌ను బాలాజీ పర్యవేక్షిస్తున్నారు. వెస్ట్ జోన్‌ను మేఘం అనే ఫుడ్ ఇన్‌స్పెక్టర్, ఈస్ట్‌జోన్‌లో మూర్తి రాజు అనే ఫుట్ ఇన్‌స్పెక్టర్ విధులు నిర్వహిస్తున్నా, వీరికి కిందిస్థాయి సిబ్బంది లేకపోవటంతో వారికి నెలసరి సేకరించాల్సిన శ్యాంపిల్స్ టార్గెట్ తలభారంగా మారింది. గతంలో ఒక్కో ఫుడ్ ఇన్‌స్పెక్టర్ ఎనిమిది శ్యాంపిల్స్ సేకరించాల్సి ఉండగా, ప్రస్తుతం ఆ టార్గెట్ ఇరవైకి పెరిగింది. తమకు టార్గెట్లు పెంచారే తప్పా, కింది స్థాయి సిబ్బందిని కేటాయించటం లేదని ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు వాపోతున్నారు. గ్రేటర్ బల్దియా అదనపు కమిషనర్ (ఆరోగ్యం, పారిశుద్ధ్యం), అలాగే చీఫ్ మెడికల్, హెల్త్ ఆఫీసర్ పర్యవేక్షణలో వీరు పనిచేయాల్సి ఉంది. అంతేగాక, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కమిషనర్ పూనం మాలకొండయ్య ఆదేశాల మేరకు సైతం వీరు శ్యాంపిల్స్ సేకరించాల్సి ఉంది.
ప్రసాదరావు కమిటీ
సిఫార్సు ఫలించేనా?
గ్రేటర్ హైదరాబాద్ బల్దియాకు రోజురోజుకీ పెరుగుతున్న పనిభారానికి తగినవిధంగా సిబ్బంది రూపకల్పనపై అధ్యయనం చేసిన ప్రసాదరావు కమిటీ ప్రభుత్వానికి పంపిన సిఫార్సుల్లో భాగంగా సర్కిల్‌కు ఒక్కో ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌ను నియమించాలని సూచించింది. వీరితోపాటు మరో అయిదుగురు గజిటెడ్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు, అలాగే మరో అసిస్టెంటు ఫుడ్ కంట్రోలర్‌ను నియమించాలని సూచించింది. అయితే ప్రసాదరావు కమిటీ నివేదిక ప్రకారం గ్రేటర్‌లో మొత్తం 2607 పోస్టుల భర్తీకి సర్కారు ఆమోదం తెలిపిన నేపథ్యంలో తొలిదశగా 1307 పోస్టుల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెల్సిందే. అయితే సర్కిల్‌కు ఒక ఫుడ్ ఇన్‌స్పెక్టర్, అదనంగా అయిదుగురు గజిటెడ్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు, అలాగే ఓ అసిస్టెంటు ఫుడ్ కంట్రోలర్ పోస్టులను రెండో విడతగా భర్తీ చేయనున్న 1300 పోస్టుల్లో భాగంగా భర్తీ చేయాలని సిఫార్సు చేసింది. అయితే ఇంకా తొలి దశ పోస్టుల నియాకమే ప్రారంభం కాని తరుణంలో రెండో దశ నియామకాలు ఎపుడు జరుగుతాయో? అన్నదే ప్రశ్నార్థకంగా మారింది. అప్పటివరకు జోన్‌కొకరు చొప్పున ఉన్న ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు ఇలాగే అరకొర సిబ్బందితో విధులు నిర్వర్తించాల్సిన దుస్థితి ఏర్పడింది.
నిర్లక్ష్యం అంటే ఇదేనా?
* వర్షం సహాయక చర్యలపై మండిపడ్డ సింగిరెడ్డి
* నెలముందే మొరబెట్టుకున్నా స్పందించ లేదు
* మేయర్ రాజీనామా చేయాలని డిమాండ్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 29: ప్రతి సంవత్సరం వర్షాకాలం ప్రారంభానికి ముందు చేపట్టాల్సిన పనులను సకాలంలో ప్రారంభించి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయటంలో గ్రేటర్ బల్దియా అధికారులు ఘోరంగా విఫలమవుతున్నారని గ్రేటర్ కౌన్సిల్ టిడిపి ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. బుధవారం పలుప్రాంతాల్లో అకాలవర్షం కురిసి, చెట్లు, హోర్డింగ్‌లు పడిపోయినా సకాలంలో సహాయక చర్యలు చేపట్టడంలో గ్రేటర్ అధికారులు విఫలమయ్యారన్నారు. చెట్లు విరిగిపడుతూ, హోర్డింగ్‌లు కిందపడుతూ ప్రజలు నానా అవస్థలు పడుతుంటే అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించటాన్ని ఆయన తప్పుబట్టారు. జూన్ మాసం ప్రారంభం నుంచే నగరంలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని, అలాగే వేసవికాలం ప్రారంభంలోనే నగరంలోని దాదాపు అన్ని నాలాల్లో పూడికతీత పనులను చేపట్టి, వర్షాకాలం ప్రారంభమయ్యే సరికి పూర్తిచేయాలని కోరుతూ నెలరోజుల ముందే తాము వినతిపత్రం సమర్పించినా, మేయర్, కమిషనర్లు స్పందించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నగరంలో కురిసిన అకాల వర్షం సృష్టించిన బీభత్సంపై స్పందించిన ఆయన ఫ్లోర్ కార్యాలయంలో విలేఖర్లతో మాట్లాడారు. ప్రతి సంవత్సరం కూడా మేయర్, కమిషనర్ చేసిన తప్పులే చేస్తున్నారని, వారి పర్యవేక్షణా లోపం కారణంగానే నాలాల్లో పూడికతీత పనులు, వర్షం సహాయక చర్యలు సక్రమంగా జరగటం లేదని ఆయన మండిపడ్డారు. అంతేగాక, భారీ వర్షాలు కురిసినపుడు ప్రజలకు సహాయక చర్యలను అందించే సెంట్రల్ ఎమర్జెన్సీకి అదనపు సిబ్బందిని, వారికి పరికరాలను ఏర్పాటు చేసి పటిష్ట పర్చాలని తాము కోరినా, స్పందించకుండా వౌనం వహిస్తున్న మేయర్ మాజీద్ హుస్సేన్ తన పదవీకి రాజీనామా చేయాలని, అలాగే కమిషనర్ కృష్ణబాబు కూడా ప్రభుత్వం బదిలీ చేయాలని సంగిరెడ్డి డిమాండ్ చేశారు. పూడికతీత పనులు చేపట్టామని ప్రకటనలో చేస్తూ ఎలాగో ఎండాకాలం గడిపేశారని, ఇకవర్షాలు ప్రారంభం కావటంతో ఈసారి కూడా ప్రజలకు వానాకాలం కష్టాలు తప్పట్టు లేవని ఆయన వ్యాఖ్యానించారు.