మనదేశం ప్రపంచంలో మూడో ఆర్థికశక్తిగా ఎదిగిందన్నది ప్రధాని మన్మోహన్ సింగ్ జపాన్ పర్యటనకు నేపథ్యం. మన దేశ స్థూల జాతీయోత్పత్తి జపాన్ జాతీయ ఉత్పత్తి పరిమాణం కంటె ఎక్కువైంది. ఈ పరిమాణం ప్రాతిపదికగా మనదేశం జపాన్‌ను తొలగించి మూడవ ఆర్థికశక్తిగా ఎదిగింది. అమెరికా, చైనా, జపాన్ ఇంతవరకు ప్రపంచంలో మొదటి మూడు పెద్ద ఆర్థిక వ్యవస్థలు. ఇప్పుడు జపాన్ నాలుగవ స్థానానికి దిగజారిందట! భారత, చైనా సంబంధాలు దిగజారడం నడుస్తున్న చరిత్ర. భారత, శ్రీలంక సంబంధాలు క్షీణించిపోతున్నాయి. మరోవైపు జపాన్‌తో మాత్రమే కాదు, అనేక తూర్పు ఆసియా దేశాలతో కూడ చైనా సంబంధాలు చెడిపోయాయి. చైనా ఆధిపత్య ప్రాబల్య విస్తరణపట్ల మొదలైన నిరసనలు ఇప్పుడు రుసరుసలుగా మారుమోగుతుండడం తూర్పు ఆసియా హిందూ మహాసాగర, పసిఫిక్ మహాసాగర ప్రాంతంలో నెలకొన్న స్థితి. జపాన్ మాత్రమే కాదు, వియత్నాం, థాయ్‌లాండ్ వంటి దేశాలు సముద్ర సంపద విషయంలోను భూభాగాల విషయంలోను చైనా దౌర్జన్య దౌత్యాన్ని నిరసిస్తున్నాయి. చైనా సైనిక విస్తరణను ప్రతిఘటించడానికి భారత దేశపు సహకారం కోసం ఎదురుచూస్తున్నాయి. అందువల్ల మన్‌మోహన్ సింగ్ మంగళ బుధవారాలలో జరిపిన జపాన్ పర్యటన చైనా ప్రభుత్వానికి నచ్చని పరిణామాలు. చైనాకు నచ్చని పరిణామాలతోపాటు మనకు నచ్చని పరిణామాలు సైతం జరిగిపోతుండడం మన్‌మోహన్ పర్యటనకు మరో నేపథ్యం. మన ప్రధానమంత్రి జపాన్‌లో ఉన్న సమయంలోనే శ్రీలంక అధ్యక్షుడు మహేంద్ర రాజపక్ష చైనాకు అరుదెంచడం కాకతాళీయం కావచ్చు, చైనా పథకంలో భాగం కావచ్చు. కానీ రెండు పర్యటనలూ సమాంతరంగా జరుగుతుండటం వ్యూ హాత్మక వ్యవహారాల చర్చకు వీలు కల్పించింది! ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ప్రశాంత భద్రతా వ్యవస్థను పెంపొందించడానికి మన్‌మోహన్ సింగ్ పర్యటన సందర్భంగా భారత్, జపాన్ ప్రభుత్వాలు పునరంకితం కావడం పరోక్షంగా తన ‘ఆధిపత్యాన్ని’ వెక్కిరించమేనని చైనా ప్రభుత్వం భావించడం సహజం. ఇలా భావిస్తున్నట్టు వెలువడుతున్న ‘సమీక్ష’లు సత్యదూరం కాదు. తూర్పు ఆసియా ప్రాంతంలో మన దేశం ప్రాధాన్యం పెరగకుండా నిరోధించే యత్నాలను చాలా ముందుగానే చైనా ప్రభుత్వం ఆరంభించింది. శ్రీలంకలో చైనా సైనిక వ్యూహాత్మక బంధం బలపడడం, మాల్‌దీవుల్లో చైనా రాయబార కార్యాలయం ఆరంభం కావడం వంటివి మన ప్రాధాన్యం తగ్గించడానికి చైనా అమలు జరుపుతున్న వ్యూహంలో ఇటీవలి పరిణామాలు. మన ప్రధాని టోకియోలో ఉన్న సమయంలోనే శ్రీలంక అధ్యక్షుడు బీజింగ్‌కు చేరడం చైనా వ్యూహాన్ని మరోసారి స్ఫురింపచేస్తోంది...
జపాన్ మనదేశం కంటె చాలా చిన్న దేశం. అయినప్పటికీ రెండవ ప్రపంచ యుద్ధంలో ధ్వంసమైపోయిన జపాన్ 1960వ దశకం నాటికే గొప్ప ఆర్థిక శక్తిగా ఎదిగింది. ఇందుకు ప్రధాన కారణం వికేంద్రీకృత ఆర్థిక వ్యవస్థ. ఉత్పాదక వ్యవస్థ కేంద్రీకృతం కాకపోవడం వల్ల జపాన్‌లో వర్గ వైరుధ్యాలకు తావులేని పెట్టుబడిదారీ విధానం రూపొందింది. ఈ విషయంలో జపాన్ వ్యవస్థను మనం అనుసరించి అనేక పాఠాలు నేర్చుకోవచ్చు. జపాన్ రక్షణ కోసం అతితక్కువ వ్యయం చేయడం, ఆర్థిక ప్రగతికి దారి తీసిన మరో పరిణామం. రక్షణ వ్యవహారాలలో అమెరికాపై ఆధారపడడం వల్ల సైనిక శక్తిగా ఎదగవలసిన అవసరం జపాన్‌కు లేదు. ఈ విషయంలో రెండు దేశాలు భిన్న ధ్రువాలు! నిరంతరం పెరుగుతున్న చైనా దురాక్రమణ ప్రమాదం మనదేశం సైనిక శక్తిగా ఎదగవలసిన అనివార్యతను సృష్టించింది. పసిఫిక్ సాగర ప్రాంతం- తూర్పు చైనా సముద్రం-లోని శంకాకు ద్వీపాలపై చైనాతో ఏర్పడిన వివాదం కారణంగా జపాన్‌కు కూడ ఇప్పుడు యుద్ధ్భయం ఏర్పడి ఉంది. గత మూడేళ్ళ కాలంలో చైనా నౌకలు శంకాకు ద్వీపాల సమీపానికి వెళ్ళడం జపాన్ వాటిని వెనక్కి మరలించడం వంటి ఘటనలు అనేకం జరిగాయి. అందువల్ల భారత, జపాన్‌ల మధ్య ఈ చైనా దురాక్రమణ ప్రమాదం మరో సామ్యాన్ని సృష్టించింది. వ్యూహాత్మక సంబంధాలు ఉభయ దేశాల మధ్య బలపడడం వల్ల మాత్రమే భారత జపాన్‌లు చైనావిస్తరణను ప్రతిఘటించడానికి వీలుంది! మన్‌మోహన్ సింగ్ జపాన్ ప్రధాని షింజో ఏబ్‌తో జరిపిన చర్చలు స్పష్టమైన రక్షణ సహకార అంగీకారాలకు దోహదం చేయకపోయినప్పటికీ, ఉభయ దేశాలు ఈ ‘్ధ్యస’ను పెంపొందించడానికి ఈ పర్యటన దోహదం చేయగలదు!!
ప్రపంచీకరణ వ్యవస్థీకృతమైన తరువాత ఇతర దేశాల వాణిజ్య సంస్థల వలెనే జపాన్ వాణిజ్య సంస్థలు సైతం మన దేశంలో చొరబడి పోతున్నాయి. జపాన్‌తో మనం జరుపుతున్న ద్వైపాక్షిక వాణిజ్యం కూడ మన ప్రయోజనాలకు భంగకరంగానే ఉంది. మనం చేస్తున్న ఎగుమతుల కంటె జపాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువుల విలువ చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల ఏర్పడుతున్న వాణిజ్యం లోటు కారణంగా మన విదేశీయ వినిమయ ద్రవ్యం భారీగా జపాన్‌కు తరలిపోతోంది. ఈ లోటును పూడ్చడానికై ఎలాంటి నిర్దిష్టమైన ఒప్పందం మన్‌మోహన్ సింగ్ పర్యటన సందర్భంగా కుదరకపోవడం ఆశ్చర్యకరం కాదు. ఎందుకంటే మిత్ర దేశం కాని చైనాతో కూడ మన వాణిజ్యం వల్ల మనకు భారీ లోటు ఏర్పడి ఉంది. దాన్ని పూడ్చడానికి కూడ ఎలాంటి ఒప్పందం కుదరలేదు. చైనా ప్రధాని లీ కేక్వియాంగ్ మనదేశానికి వచ్చిన సందర్భంగా ఆ ప్రస్తావన జరగనేలేదు. దీనికి భిన్నంగా ‘లోటు’ గురించి మన ప్రధాని టోకియోలో ప్రస్తావించారు. అయితే వౌలిక రంగ పరిశ్రమలలో జపాన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టినప్పుడు, ఈ పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతి అయినప్పుడు మాత్రమే మన వాణిజ్యం లోటు తగ్గుతుంది. అణువిద్యుత్ ఉత్పత్తిని పెంచే పరిశ్రమలను జపాన్ సంస్థలు మనదేశంలో స్థాపించే అవకాశం ఇప్పట్లో లేనట్టేనన్నది మన ప్రధాని పర్యటన సమయంలో ధ్రువపడిన వాస్తవం...
ఈ వాస్తవ వైపరీత్యం జపాన్ విషయంలో మాత్రమే కాదు, అన్ని సంపన్న దేశాలతో మనం జరపుతున్న ఆర్థిక వ్యవహారాలలో మనకు వ్యతిరేకంగా పనిచేస్తూనే ఉంది. అందువల్ల ‘ఆర్థికం’ ప్రాతిపదికగా కీలక వ్యూహాత్మక రక్షణ ప్రాతిపదికగా మన దేశం జపాన్‌తోను, తూర్పు ఆసియా దేశాలతోను మైత్రిని పెంపొందించవలసిన అనివార్యం ఏర్పడి ఉంది. ఈ ప్రాతిపదికగా జరుగుతున్న కృషిలో మన్‌మోహన్ సింగ్ జపాన్ పర్యటన, థాయ్‌లాండ్ పర్యటన భాగం...మనదేశం చుట్టూ చైనా తన సైనిక ప్రభావ ప్రాబల్య వలయాన్ని ఇదివరకే నిర్మించింది. బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ ఓడరేవుతో మొదలు పెట్టి, బర్మా, శ్రీలంక, మాల్‌దీవుల మీదుగా పాకిస్తాన్‌లోని గ్వాడార్ ఓడరేవు వరకు ఈ ప్రాబల్యమయం విస్తరించి పోయింది. ఇదంతా మన దేశాన్ని నలువైపులనుంచి దిగ్బంధించడానికి చైనా చేస్తున్న యత్నం. అందువల్ల జపాన్‌తో మైత్రిని పెంచుకొనడం ద్వారా చైనా చుట్టూ వ్యూహాత్మకంగా భద్రత వలయాన్ని నిర్మించడం మన దేశ వైదేశిక విధానం కావాలి. వియత్నాం, ఫిలిప్పీన్స్ వంటి అనేకానేక దేశాలతో సముద్ర సంపద విషయంలోను, ద్వీపాల భూభాగాలపై పెత్తనం విషయంలోను, చైనాకు వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ దేశాలతో సంబంధాలను ఇనే్నళ్ళుగా మనం నిర్లక్ష్యం చేశాము. ఈ నిర్లక్ష్యాన్ని వదిలించుకొని వాస్తవ దృష్టిని పెంచుకొనడంలో మన్‌మోహన్ జపాన్ పర్యటన భాగం...
మనదేశం ప్రపంచంలో మూడో ఆర్థికశక్తిగా ఎదిగిందన్నది
english title:
japan
Date:
Friday, May 31, 2013