న్యూఢిల్లీ, మే 31: పెట్రోలు, డీజిలు ధరలు మరోసారి పెరిగాయి. పెట్రోలు ధర లీటరుకు 75 పైసలు పెరగ్గా, డీజిలు ధర అర్ధరూపాయి పెరిగింది. స్థానికంగా విధించే అమ్మకపు పన్నులు, వ్యాట్‌లు కూడా కలిసినప్పుడు పెరుగుదల మరికాస్త ఎక్కువే ఉంటుంది. పెరిగిన ధరలు శుక్రవారం అర్ధరాత్రినుంచే అమల్లోకి వస్తాయని దేశంలో అతిపెద్ద చమురు సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసి) తెలిపింది.
ఢిల్లీలో పెట్రోలు ధర 90 పైసలు పెరిగి లీటరుకు 63 రూపాయల 99 పైసలకు చేరుకుంది. అలాగే ప్రస్తుతం లీటరు రూ.49.69 ఉన్న డీజిలు రూ.50.25కు పెరగనుంది. కాగా, ఏడాదిలో తొమ్మిది సిలిండర్ల కోటా తర్వాత వినియోగదారులు కొనుగోలు చేసే వంటగ్యాస్ సిలిండర్ ధరను చమురు కంపెనీలు 45 రూపాయలు తగ్గించాయి. దీంతో 14.2 కేజీల బరువుండే సిలిండర్ ధర ఢిల్లీలో 847 రూపాయల నుంచి 802 రూపాయలకు తగ్గుతుంది. పెట్రోలు ధరలు పెరగడం మూడు నెలల తర్వాత ఇదే మొదటిసారి. గత మార్చి 1న పెట్రోలు ధరను పెంచిన చమురు కంపెనీలు, తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గడంతో నాలుగుసార్లు తగ్గించడం తెలిసిందే. కాగా, డీజిలు ధరలు పెరగడం ఈ ఏడాదిలో ఇది అయిదోసారి. డీజిలుపై వస్తున్న నష్టాలు పూర్తిగా భర్తీ అయ్యే దాకా ప్రతి నెలా అర్ధరూపాయి మేర పెంచడానికి చమురు కంపెనీలకు ప్రభుత్వం గత జనవరిలో అనుమతి ఇవ్వడం తెలిసిందే.
లీటరుకు 75 పైసలు పెంపు అర్ధ రూపాయి పెరిగిన డీజిలు అర్ధరాత్రినుంచి అమలు
english title:
p
Date:
Saturday, June 1, 2013