ప్రత్యేక విమానంలో, మే 31: కొందరు మంత్రుల రాజీనామాల కారణంగా కేంద్ర మంత్రివర్గంలో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయడానికి త్వరలోనే మంత్రివర్గంలో మార్పులు జరిపే అవకాశం ఉందని ప్రధాని మన్మోహన్ సింగ్ శుక్రవారం సూచనప్రాయంగా తెలిపారు. జపాన్, థాయిలాండ్ దేశాల్లో ఐదు రోజుల పర్యటన ముగించుకుని స్వదేశానికి బయలుదేరిన ప్రధాని ప్రత్యేక విమానంలో మీడియాతో దేశ రాజకీయాలకు సంబంధించిన అనేక అంశాలపై మాట్లాడారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో తనకెలాంటి విభేదాలు లేవని కూడా ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేసారు. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంపై అడిగిన మరో ప్రశ్నకు సమాధానమిస్తూ, క్రీడలను రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదన్నారు. బొగ్గు కుంభకోణంపై సుప్రీం కోర్టుకు సమర్పించే నివేదికలో మార్పులు చేయడంపై తలెత్తిన వివాదం కారణంగా న్యాయ శాఖ మంత్రి అశ్వినికుమార్, రైల్వే బోర్డు లంచాల వ్యవహారంలో రైల్వే మంత్రి పవన్‌కుమార్ బన్సల్ ఈనెల మంత్రి పదవులకు రాజీనామా చేయడం తెలిసిందే. రైల్వే శాఖ అదనపు బాధ్యతను రహదారులు, హైవేల శాఖ మంత్రి సిపి జోషీకి, టెలికాం మంత్రి కపిల్ సిబల్‌కు న్యాయ శాఖ అదనపు బాధ్యతలను అప్పగించారు. ఇదికాక కొందరు మంత్రులు ఒకటికన్నా ఎక్కువ శాఖల బాధ్యతలు చూస్తున్నారు. బన్సల్, అశ్వినీకుమార్ రాజీనామాలతో ఏర్పడిన ఖాళీలలను భర్తీ చేయడంతోపాటుగా కొందరు మంత్రులపై ఉన్న అదనపు శాఖల బరువును తొలగించడం కోసం మరోసారి మంత్రివర్గంలో మార్పులు జరుపుతారా? అని ప్రధానిని ఓ విలేఖరి ప్రశ్నించగా, ఖాళీలలను భర్తీ చేయాల్సిన అవసరం ఉందని, ఈ విషయాన్ని పరిశీలిస్తానని చెప్పారు.
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో తనకు విభేదాలున్నట్టు మీడియాలో వచ్చిన వార్తలను మన్మోహన్ గట్టిగా తోసిపుచ్చారు. కొన్ని అంశాల విషయంలో తనకు, సోనియాగాంధీకి మధ్య విభేదాలున్నాయన్న అభిప్రాయంలో ఎంతమాత్రం నిజం లేదని ప్రధాని స్పష్టం చేస్తూ, దాదాపు ప్రతి విషయంలోనూ తమ ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం ఉందని స్పష్టం చేసారు. ఒకవేళ ఏదయినా అంశంపై ఏకాభిప్రాయం అవసరమైనప్పుడు తాను కాంగ్రెస్ అధినేత్రితో చర్చిస్తుంటానని కూడా ఒక ప్రశ్నకు సమాధానంగా మన్మోహన్ చెప్పారు. బన్సల్, అశ్వినీకుమార్‌ల వ్యవహారంలో ప్రధానికి, సోనియాగాంధీకి మధ్య విభేదాలు తలెత్తినట్టు మీడియాలో వార్తలు రావడం తెలిసిందే.
ప్రతిపక్షాలు పార్లమెంటులో ప్రగతి నిరోధక పాత్ర పోషిస్తున్నాయని ప్రధాని మరోసారి ధ్వజమెత్తారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో విపక్షాలు గతంలో ఎన్నడూ లేనంతగా అసహనానికి గురవుతున్నాయని కూడా ఆయన అన్నారు. పార్లమెంటులో ముఖ్యమైన బిల్లులు ఆమోదం పొందేలా చూడడానికి ప్రభుత్వానికి సహకరించాలని, ప్రగతి నిరోధక పాత్రను మానుకోవాలని ప్రతిపక్షాలకు మరోసారి విజ్ఞప్తి చేసారు. ‘ప్రతిపక్షాలు గతంలో ఎన్నడూ లేనంతగా అసహనాన్ని ప్రదర్శిస్తూ ఉండటం దురదృష్టకరం. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రదర్శిస్తున్న శత్రుత్వధోరణి కారణంగా పార్లమెంటులో అత్యంత ముఖ్యమైన కార్యకలాపాలను నెరవేర్చలేక పోతున్నాం’ అని ఆయన అన్నారు. యూపీఏ మరోసారి అధికారంలోకి రావడం కోసం ప్రభుత్వం వామపక్షాలు, లేదా మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌కు దగ్గర కావాలని అనుకుంటోందా? అని అడగ్గా, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని వ్యాఖ్యానించారు. ‘పార్లమెంటు సమావేశాలు సాఫీగా జరిగేలా చూడటంలో ప్రభుత్వానికి సహకరించాలని అన్ని రాజకీయ పార్టీలకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను’ అని ప్రధాని అన్నారు.
తాజాగా తలెత్తిన ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంపై అడిగిన మరో ప్రశ్నకు సమాధానమిస్తూ, ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతున్నందున దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని, అయితే క్రీడలను రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదన్నారు. అయిదోసారి తనను రాజ్యసభకు పంపిస్తున్న అసోం ప్రజలకు ప్రధాని ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. 1991 నుంచి రాజ్యసభలో అసోంకు ప్రాతినిధ్యం వహించడం తన అదృష్టమని అంటూ, మరోసారి తమకు సేవ చేసే అవకాశాన్ని రాష్ట్ర ప్రజలు తనకు ఇచ్చారన్నారు.
కేంద్ర కేబినెట్‌లో మార్పులకు మన్మోహన్ సంకేతం సోనియాతో విభేదాలు లేవని వెల్లడి
english title:
v
Date:
Saturday, June 1, 2013