న్యూఢిల్లీ, మే 31: బస్తర్‌లో నక్సల్స్ భరతం పట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర పోలీసులు, గ్రేహౌండ్స్‌తో కలిసి సంయుక్త ఆపరేషన్లు నిర్వహించడం ద్వారా ఈ జాడ్యాన్ని రూపుమాపేందుకు సమాయత్తం అవుతోంది. శుక్రవారం చత్తీస్‌గఢ్‌లో పర్యటించిన హోంమంత్రి షిండే నక్సల్స్ నిరోధక ఆపరేషన్ల తీరుతెన్నులను సమీక్షించారు. సమీప భవిష్యత్‌లోనే సంయుక్త ఆపరేషన్లు నిర్వహించి బస్తర్ ప్రాంతాన్ని నక్సల్ ప్రాబల్యం నుంచి విముక్తం చేస్తామని వెల్లడించారు. దాదాపు గంటకుపైగా రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్‌సింగ్, సీనియర్ అధికారులతో రాజ్‌భవన్‌లో ఆయన సమీక్ష జరిపారు. 25న బస్తర్ దక్షిణ ప్రాంతంలో కాంగ్రెస్ కాన్వాయ్‌పై నక్సల్స్ విరుచుకుపడి 27మందిని హతమార్చిన నేపథ్యంలో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లకు కేంద్రం పదును పెట్టింది. ఈ సమీక్షా సమావేశంలో అన్ని అంశాలను చర్చించామని, మావోయిస్టులపై సంయుక్తంగా దాడులు జరపాలని నిర్ణయించినట్టు అనంతరం విలేఖరులకు షిండే తెలిపారు. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి తాము ఎలాంటి డిమాండూ చేయమని, కేవలం మద్దతు మాత్రమే కోరతామని రమణ్‌సింగ్ వెల్లడించినట్టుగా షిండే తెలిపారు. రాష్ట్ర పోలీసులు జరిపే నక్సల్ నిరోధక ఆపరేషన్లకు కేంద్ర బలగాలు సహకరిస్తాయని, ఆ విధంగా సంయుక్త వ్యూహంతో ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. ప్రతి నక్సల్ పీడిత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తరహాలో గ్రేహౌండ్స్‌ను ఏర్పాటు చేసుకోవాలని, ఇందుకు అవసరమైన సాయాన్ని కేంద్రం అందిస్తుందని చెప్పారు. నక్సల్ దాడిని ఉగ్రవాద చర్యగా అభివర్ణించిన షిండే, ఇందుకు దారితీసిన భద్రతాపరమైన లోపాలపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుపుతామని వెల్లడించారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కావడానికి ఎంతమాత్రం వీల్లేదని, ఆ దిశగానే ముందడుగు వేస్తామని వెల్లడించారు. మరోపక్క జాతీయ దర్యాప్తు సంస్థ కూడా మావోయిస్టు దాడులకు సంబంధించి భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తోందన్నారు. అయితే ఇప్పటి వరకూ అందిన ప్రాథమిక దర్యాప్తు వివరాలను బట్టి భద్రతాపరమైన లోపాలు ఉన్నట్టు స్పష్టమవుతుందని వెల్లడించిన ఆయన, తదుపరి దర్యాప్తు ద్వారానే అసలు కారణాలు తేటతెల్లం అవుతాయని తెలిపారు.
5న ముఖ్యమంత్రులతో సదస్సు
ఇదిలావుండగా నక్సల్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో 5న సమావేశమయ్యేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. మావోయిస్టుల హింసాకాండకు అడ్డుకట్ట వేయడంతోపాటు ఈ తరహా ధోరణలకు పూర్తిస్థాయిలో స్వస్తి పలికే దిశగా ఓ వ్యూహాన్ని ఆ సమావేశంలో రూపొందించే అవకాశం ఉంది. హోంమంత్రిత్వ శాఖ అంతర్గత భద్రతపై ముఖ్యమంత్రులతో నిర్వహించే సమావేశంతోపాటు ఈ నక్సల్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ జరుగుతుందని అధికారవర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా నక్సల్ వ్యతిరకే వ్యూహాలకు సంబంధించి కూలంకషంగా చర్చ జరుగుతుందని కోబ్రా, గ్రేహౌండ్స్ తదితర దళాలను ఏకకాలంలో ఇందుకోసం నియోగించే అంశంపైకూడా చర్చించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
రాష్ట్ర పోలీస్, గ్రేహౌండ్స్‌తో బస్తర్‌లో గాలింపు చత్తీస్‌గఢ్ దాడి ఉగ్రవాద చర్యే నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల సిఎంలతో 5న సదస్సు
english title:
n
Date:
Saturday, June 1, 2013