న్యూఢిల్లీ, మే 31: మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ప్రస్తుతానికి వాయిదా పడినట్టే. శాసన సభ సమావేశాల అనంతరం ఈ అంశంపై మరోసారి చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. తెలంగాణకు చెందిన ఇద్దరు లోక్‌సభ సభ్యులు, ఒక మాజీ సభ్యుడి రాజీనామా మూలంగా ఎదురయ్యే రాజకీయ ప్రతికూల పరిణామాలను తిప్పికొట్టేందుకు వ్యూహరచన జరిగింది. మంత్రుల శాఖల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో దాదాపు అర్థగంటపాటు చర్చలు జరిపారు. సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ 10 జన్‌పథ్‌లో జరిగిన సమావేశానికి హాజరయ్యారు. సోనియా నివాసానికి వెళ్లేముందు ఆజాద్‌తో కిరణ్‌కుమార్ సుదీర్ఘ చర్చలు జరిపారు. సోనియాతో జరిగిన సమావేశంలో మూడు అంశాలపై ప్రధానంగా చర్చలు జరిగినట్టు తెలిసింది. విధాన మండలికి గవర్నర్ నామినేట్ చేయాల్సిన నలుగురు అభ్యర్థుల ఎంపిక, మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ, ఇద్దరు లోక్‌సభ సభ్యులు మంద జగన్నాథం, జి వివేక్, పిసిసి మాజీ చీఫ్ కేశవరావు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి తెరాసలో చేరటం వల్ల ఉత్పన్నమయ్యే రాజకీయ పరిణామాలు, రాష్ట్ర కాంగ్రెస్‌పై పడే ప్రభావంపై సమాలోచనలు జరిపినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై పార్టీ హైకమాండ్ స్పష్టమైన ప్రకటన చేయనందుకు నిరసనగా కాంగ్రెస్‌కు రాజీనామా చేసి తెరాసలో చేరాలనుకుంటున్నట్టు ఇద్దరు ఎంపీలు, ఒక మాజీ ఎంపీ చెప్పటం తెలిసిందే. వీరు తెరాసలో చేరటం వల్ల రాష్ట్ర కాంగ్రెస్‌పై పడే ప్రభావం ఎలా ఉంటుంది? వీరితోపాటు ఇంకా ఎవరైనా కాంగ్రెస్‌కు రాజీనామా చేయనున్నారా? చేసే వారెవరు? ఇంకా ఎంపీలు ఎవరైనా పార్టీకి రాజీనామా చేస్తారా? తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ శాసన సభ్యుల పరిస్థితి ఏమిటి? అనే అంశంపై సోనియా ఆరా తీసినట్టు ఏఐసిసి వర్గాలు వెల్లడించాయి. మరో ఇద్దరు ఎంపీలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి పరిస్థితి ఏమిటి? వారు కూడా కాంగ్రెస్‌కు రాజీనామా చేసి వెళ్తారా? వారు వైకాపాలో చేరే అవశాలున్నాయా? రాజగోపాల్‌రెడ్డితోపాటు గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా వైకాపాలోకి వెళ్తారా? అనేది కూడా చర్చకు వచ్చిందని అంటున్నారు. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీని కాపాడుకునేందుకు ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనేది కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్న కేశవరావు, మంద జగన్నాథం, వివేక్‌లు కాంగ్రెస్‌పై చేసే ఆరోపణలను తిప్పికొట్టటం గురించి కూడా మాట్లాడినట్టు చెబుతున్నారు. తాను అమలు చేస్తున్న బంగారు తల్లి, అమ్మహస్తం తదితర పథకాలు సత్ఫలితాలు ఇస్తున్నాయంటూ, 2014లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందనే ధీమాను కిరణ్‌కుమార్ రెడ్డి వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ తుడిచి పెట్టుకుపోయిందంటూ ఈ ప్రాంతానికి చెందిన కొందరు నేతలు చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని సిఎం వివరించినట్టు తెలుస్తోంది. ఇదిలాఉంటే విధాన మండలికి గవర్నర్ నామినేట్ చేయాల్సిన నలుగురు అభ్యర్థులపైనా చర్చ జరిగిందనే మాట వినిపిస్తోంది. మాజీ ఎంపీ సురేందర్ రెడ్డి కుమారుడు రఘురామిరెడ్డిని నామినేట్ చేయాలని కిరణ్‌కుమార్ రెడ్డి పట్టుబడుతుంటే రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్‌రావు, ఎంఏ ఖాన్ తదితరులు మాత్రం కొనుకుల జనార్దన్ రెడ్డిని రీనామినేట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలావుంటే, మాజీ ఐపీఎస్ అధికారి డిటి నాయక్‌ను నామినేట్ చేసే అంశం కూడా వివాదాస్పదం కావటం తెలిసిందే. కేంద్ర పర్యటనాభివృద్ధి శాఖ మంత్రి చిరంజీవి ఆయన కోసం పట్టుబడుతున్నారు. కాగా గాంధీ భవన్‌లో పని చేసే రామ్మూర్తిని నామినేట్ చేసే అంశం కూడా నేడు చర్చకు వచ్చిందని చెబుతున్నారు. కాగా రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వ్యవహారాన్ని శాసన సభ సమావేశాల అనంతరం పరిశీలిస్తారని అంటున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిపితే పదవులు రానివారు, పదవులు కోల్పోయిన వారు పార్టీకి రాజీనామా చేసే ప్రమాదం ఉన్నదని హైకమాండ్ భావిస్తోంది. అందుకే పునర్వ్యవస్థీకరణ బదులు కొందరు మంత్రుల శాఖలు మార్చేందుకు కొంత అవకాశం ఉందని అంటున్నారు. హోంశాఖను ముఖ్యమంత్రి తన వద్దే ఉంచుకుని మిగతా శాఖలను కేటాయించటం గురించి మాట్లాడినట్టు చెబుతున్నారు.
సోనియా నివాసం వద్ద
ఆజాద్, కిరణ్ కరచాలనం