Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ప్రణాళికా ప్రగతి!

$
0
0

రాష్ట్ర ప్రణాళికా వ్యయం గత ఏడాదికంటె ఎనిమిదిశాతం పెరగడం పట్ల ప్రభుత్వం హర్షం ప్రకటించడం సహజం. న్యూఢిల్లీలో సోమవారం ముఖ్యమంత్రి ఎన్. కిరణ్‌కుమార్ రెడ్డి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్‌సింగ్ అహ్లూవాలియాతో చర్చలు జరిపిన తరువాత ఈ ‘పెరుగుదల’ అధికారికమైంది. ఈ ఆర్థిక సంవత్సరానికి - 2013-14- గత మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఆదాయ వ్యయ పత్రం- బడ్జెట్-లో ప్రణాళికా వ్యయం కోసం యాబయి రెండువేల తొమ్మిదివందల యాబయి ఐదుకోట్ల రూపాయలు కేటాయించారు. అందువల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో వివిధ నిర్మాణ పథకాలకు ఈ మేరకు నిధులు లభిస్తాయన్నది అప్పుడే వెల్లయిన సంగతి. ప్రణాళికా సంఘం వారి ఆమోదం పొందడం లాంఛనమన్న సంగతి గత అనేక ఏళ్ళుగా వ్యవస్థీకృతమైన తరువాత ప్రభుత్వాల ఆర్థిక బాధ్యతలు తగ్గిపోయిన నేపథ్యంలో ప్రణాళికా సంఘం ప్రాధాన్యం కూడ ‘సలహాదారు’ హోదాకు పరిమితమై పోయింది! ప్రభుత్వేతర భాగస్వామ్యం ప్రణాళికా రచనలో విస్తరించి పోతుండడం ప్రపంచీకరణ ఫలితం. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రణాళికా వ్యయ పరిమాణాన్ని ప్రణాళికా సంఘం గురువారం యథాతథంగా ఆమోదించడం కొత్త విషయం కాదు. మరో నలబయి ఐదు కోట్ల రూపాయలు అదనంగా కేటాయించడం ప్రణాళికా సంఘం వారికి మన రాష్ట్రం పట్ల, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమ ఆచరణ ప్రగతి పట్ల గల సుహృత్‌భావానికి, ప్రశంసా పూర్వక దృక్పథానికి నిదర్శనం. కేంద్ర రాష్ట్రాలలో ఒకే రాజకీయ పార్టీ ప్రభుత్వాలను నిర్వహిస్తున్న సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రణాళికా సంఘానికి మధ్య ఇలాంటి సుహృత్‌భావం నెలకొనడం కూడ సహజం! అదనంగా ‘నలబయి ఐదు కోట్ల రూపాయలు’ ప్రణాళికా వ్యయంగా మన రాష్ట్రానికి లభించడానికి ఇదే కారణం కావచ్చు. ఇలా నిర్ధారితమైన యాబయి మూడువేల కోట్ల ప్రణాళికా వ్యయానికి కేంద్ర ప్రభుత్వం పథకాల కింద మరో ఆరువేల నాలుగు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు అదనంగా కలుస్తాయట. ఫలితంగా మొత్తం వార్షిక రాష్ట్ర ప్రణాళికా వ్యయం యాభయి తొమ్మిదివేల నాలుగువందల ఇరవై రెండు కోట్ల రూపాయలకు చేరింది. గత ఏడాది 2012-13 ప్రణాళికా వ్యయం కంటె 8.2శాతం అధికం కావడం రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయం. కానీ గత ఆర్థిక సంవత్సరం ఆరంభం నుండి వర్తమాన ఆర్థిక సంవత్సరం ఆరంభం నాటికి సాధారణ ద్రవ్యోల్బణం సగటున తొమ్మిది శాతం పెరిగింది. చిల్లర ధరల ప్రాతిపదికగా ద్రవ్యోల్బణం పదిశాతం పెరిగింది. ఆహార పదార్ధాల ద్రవ్యోల్బణం పదకొండు శాతానికి పైగా పెరిగింది. ప్రపంచీకరణ వ్యవస్థీకృతమైన తరువాత ఆహారానికి ప్రాధాన్యత తగ్గిపోయింది. అందువల్ల ఆహార ద్రవ్యోల్బణం మాట మరిచిపోయినప్పటికీ, చిల్లర ద్రవ్యోల్బణం ప్రాతిపదికగా రూపాయి విలువను అంచనా వేసినట్టయితే ప్రణాళికా వ్యయం వాస్తవంగా తగ్గిందని సామాన్యులకు సైతం బోధ పడుతుంది! ప్రణాళికా సంఘం వారు మాత్రం ఈ ఆర్థిక సత్యాన్ని పరిగణించడం లేదు...
ప్రణాళికా వ్యయం పెరగడం ఉత్పాదకత పెరుగుతుండడానికి ప్రతీక. ప్రణాళికా వ్యయం పెరగడం అనుత్పాదకత వ్యవస్థీకృతం కావడానికి నిదర్శనం. ప్రణాళికా వ్యయం శాశ్వత ప్రగతికి కొలమానం. ప్రణాళికేతర వ్యయం తాత్కాలిక సంక్షేమానికి సూచకం. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికేతర మొత్తం వ్యయంలో ఉద్యోగుల వేతనాలకు ఇరవై నాలుగు శాతం కేటాయించారు. ప్రణాళికేతర వ్యయంలో ఇది దాదపు నలబయి ఎనిమిది శాతం. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ప్రణాళికా వ్యయం కంటె ప్రణాళికేతర వ్యయం రెట్టింపు. ప్రణాళికేతర వ్యయం దాదాపు లక్షా తొమ్మిది కోట్ల రూపాయలు. గత ఏడాది కంటె ప్రణాళికా వ్యయం ఈ ఏడాది ఎనిమిది శాతం పెరిగింది. ప్రణాళికేతర వ్యయం పనె్నండు శాతం పెరిగింది. మన రాష్ట్రంలోమాత్రమే కాదు, అన్ని రాష్ట్రాలలో ఇదే తీరు నడుస్తోంది. ప్రణాళికేతర వ్యయం పెరుగుదలకంటె ప్రణాళికా వ్యయం అధికంగా పెరగడం వల్ల వౌలిక రంగాల్లో ఉత్పత్తులు పెరగడానికి అవకాశమేర్పడుతుంది. కానీ ప్రణాళికేతర వ్యయం పెంచుకుంటూ, తాత్కాలిక సంక్షేమ సాధనకు మాత్రమే ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ప్రభుత్వాలు నిర్వహించే రాజకీయ పక్షాల ఎన్నికల ప్రయోజనం. ఒక జలవిద్యుత్ పథకం కాని, నీటి పారుదల పథకం కాని నిర్మించి, అమలు జరపాలంటే దశాబ్దులు పడుతుంది. అందువల్ల తాము ప్రజలకు మేలు చేశామని నిరూపించడానికి ప్రభుత్వ నిర్వాహకులు అనేక ఏళ్ళు వేచి ఉండాలి. ఎన్నికలు మాత్రం ఐదేళ్ళకంటె ఎక్కువకాలం వేచి ఉండవు. కానీ సంక్షేమ పథకాల ఫలితాలు సంవత్సరంలోగానే సాధించి పెట్టవచ్చు. అందువల్ల సంక్షేమం కోసం అనుత్పాదక వ్యయం పెంపొందించడం అధికార పక్షాలన్నింటికీ అనివార్యమైపోయింది. ఈ రెండింటి మధ్య సమన్వయం సాధించడానికి సైతం మన రాష్ట్ర ప్రభుత్వం, ప్రణాళికా సంఘం ప్రయత్నించడం లేదన్నది ఈ ‘ప్రణాళికా వ్యయం’ ద్వారా స్పష్టమైపోయింది. ద్రవ్యోల్బణం దిగమింగే పెరుగుదలను పరిగణించి వాస్తవమైన విలువలు గత ఏడాది కంటె ఈ ఏడాది ప్రణాళికా పరిమాణాన్ని పెంచడంలో రాష్ట్ర ప్రభుత్వం, ప్రణాళికా సం ఘం విఫలమయ్యాయి!
స్థూల జాతీయ ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వాలు అమలు చేయగల ఆర్థిక వ్యూహం పంచవర్ష ప్రణాళిక! ప్రపంచీకరణలో భాగంగా పెరుగుతున్న ప్రభుత్వ, ప్రభుత్వేర భాగస్వామ్యం, పంచవర్ష ప్రణాళికలు గ్రహణంగా మారింది. ప్రభుత్వ ప్రభుత్వేతర భాగస్వామ్యం నిజానికి వాణిజ్య పారిశ్రామిక రాజకీయ అవినీతి భాగస్వామ్యంగా మారిపోయింది. విద్యుత్, సిమెంట్, ఉక్కు, బొగ్గు, ఎరువులు, ఇంధన వాయు తైల రంగాలన్నీ క్రమంగా ప్రభుత్వేతర బహుళ జాతీయ వాణిజ్య సంస్థల నియంత్రణకు బదిలీ అయిపోతున్నాయి. ‘ప్రణాళిక’, ‘ప్రణాళికా సంఘం’ అస్తిత్వాన్ని కోలుపోయాయని కేంద్ర మంత్రులు సైతం వ్యాఖ్యానించడం ప్రపంచీకరణ సంతరించి పెట్టిన వైపరీత్యం. నీటి పారుదల పథకాలు మాత్రమే ఇప్పుడు ప్రభుత్వం వారి సంపూర్ణ ఆధీనంలో ఉన్నాయి. వాటిని సైతం ప్రభుత్వేతర సంస్థలకు అప్పగించాలన్నది కొత్తగా రూపొందించిన జాతీయ జల విధానం చేస్తున్న ప్రతిపాదన. ఈ నేపథ్యంలో ప్రభుత్వాల పాత్ర ఉత్పాదక రంగంలో కుంచించుకొని పోతోంది. పదకొండవ పంచవర్ష ప్రణాళికా కాలంలో మన రాష్ట్రానికి లక్షా ఎనబయి ఏడువేల కోట్ల రూపాయలు ప్రణాళికా వ్యయం కేటాయించారు. కానీ లక్షా పదిహేడు వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అంటే కేటాయించిన నిధులు భారీగా మురిగిపోయాయి. పథకాల నిర్మాణం నత్తనడకన నడుస్తుండడం ఇందుకు కారణం. పదహారు వేల కోట్ల రూపాలు ఖర్చు కాగల పోలవరం జలాశయం నిర్మాణం, ముప్పయి ఎనిమిది వేల కోట్లు ఖర్చు కాగల చేవెళ్ళ-ప్రాణహిత పథకాల నిర్మాణ ప్రగతి ఈ ఏడాది ఏ మేరకు కొనసాగుతుందన్నది ముఖ్యమంత్రి, ప్రణాళికా సంఘం వారు జరిపిన సమీక్షలో నిగ్గు తేలలేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం. జాతీయ హోదా, చర్చలకే పరిమితమైంది. వర్తమాన సంవత్సరంలో పదిశాతం ఆర్థిక ప్రగతి సాధించగలమన్న ఆకాంక్షకు అనుగుణంగా లేని వాస్తవాలివి!

రాష్ట్ర ప్రణాళికా వ్యయం గత ఏడాదికంటె ఎనిమిదిశాతం పెరగడం పట్ల
english title: 
p

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>