పత్రికా స్వేచ్ఛ పుష్కలంగా ఉన్న దేశాలలో నివశిస్తున్న ప్రజల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నది. గత దశాబ్దకాలంలో అతి తక్కువ శాతానికి పడిపోయిం ది. ఫ్రీడం హౌస్ ప్రచురించిన ‘‘2013లో పత్రికా స్వాతంత్య్రం’’ నివేదిక ప్రకారం ప్రపంచ జనాభాలో 14 శాతంకన్నా తక్కువమందికి మాత్రమే పత్రికా స్వాతంత్య్రం అందుబాటులో ఉంది. అంటే ప్రతి ఆరుగురిలో ఒకరు మాత్రమే మీడియా వ్యవహారాలలో ప్రభుత్వ జోక్యం తక్కువగా ఉండి, పాత్రికేయుల రక్షణకు హామీకలిగి, రాజకీయ వార్తలను పారదర్శకంగా ప్రచురించే సమాజాలలో జీవిస్తున్నారు. ముఖ్యంగా మధ్య ఆసియా దేశాలలో నెలకొన్న అస్థిర పరిస్థితులు ఇటువంటి ధోరణులకు దారితీస్తున్నా య. బర్మా, పశ్చిమ ఆఫ్రికా దేశాలలో పరిస్థితులు ఎంతో మెరుగుపడుతున్నా ఇతర పరిణామాలు పత్రికా స్వేచ్ఛపై దుష్ప్రభావం కలిగిస్తున్నాయి. నియంతృత్వ దేశాలలో పత్రికలను అణచివేయడానికి అత్యాధునిక సాంకేతిక పద్ధతులను ఉపయోగించడం, ఐరోపా ఆర్థిక సంక్షోభం ప్రభావం పత్రికల ఆర్థిక సామర్థ్యాన్ని దెబ్బతీయడం, రాడికల్ ఇస్లాం గ్రూపులు, నేరస్థుల బృందాలు వంటి ప్రభుత్వేతర వర్గాలనుండి ఎదురవుతున్న దాడులు అందుకు కారణాలుగా భావించవచ్చు.
‘‘మధ్య ఆసియాలో స్వేచ్ఛకోసం ప్రజలు ఉద్యమించిన రెండు సంవత్సరాల అనంతరం బహిరంగ రాజకీయ చర్చలపై ప్రపంచవ్యాప్తంగా నియంతృత్వ పాలకులు ఆంక్షలను క్లిష్టతరం కావించడాన్ని గమనిస్తున్నాము’’ అని ఫ్రీడం హౌస్ అధ్యక్షులు డేవిడ్ జె.క్రామెర్ పేర్కొన్నారు. మొత్తంమీద పత్రికా స్వేచ్ఛ దిగజారడం ప్రపంచంలో ప్రజాస్వామ్య మనుగడపై ఆందోళన కలిగిస్తున్నదని, పత్రికా రచన స్వాతంత్య్రాన్ని కాపాడడానికి మరింత అప్రమత్తంగా వ్యవహరించవలసిన అవసరాన్ని గుర్తుచేస్తున్నదని ఆయన వివరించారు.
ఎకోడర్, ఈజిప్ట్, గునియా, పరాగవ్, థాయ్‌లాండ్ దేశాలలో పత్రికా స్వాతం త్య్రం హరించుకుపోగా, కంబోడియా, ఖజకిస్థాన్, మాల్దీవ్‌లలో సహితం అటువంటి ధోరణులే నెలకొన్నాయి. మాలిలో ఉత్తరాది భాగాన్ని ఇస్లాం మిలిటెంట్లు ఆక్రమించడంతో ఆ దేశంలో ఆకస్మికంగా పత్రికా స్వాతంత్య్రం అదృశ్యమయింది. ఐరోపా ఆర్థిక సంక్షోభం కారణంగా గ్రీస్‌లో పత్రికారంగం పలు వత్తిడులను ఎదుర్కొంటున్నది. ఇజ్రాయిల్‌లో సహితం పత్రికాస్వాతంత్య్రం ఆందోళన కలిగిస్తున్నది.
శక్తివంతమైన నియంతృత్వ వ్యవస్థలుగల చైనా, రష్యాలలో సాంప్రదాయక పత్రికా రంగాన్ని అదుపుచేయడానికి పలు పద్ధతులను అనుసరిస్తున్నారు. విమర్శకులను నిర్బంధించడం, వారిపై కేసులు నమోదుచేయడం పత్రికలను మూసివేయించడం, పరోక్షంగా సెన్సార్ చేయడంతోపాటు ఆన్‌లైన్ అంశాలను సహితం నియంత్రించే ప్రయత్నాలు చేస్తున్నారు. 2012లో సమీక్షించిన మొత్తం 197 దేశాల్లో కేవలం 32 శాతంగా గల 63 దేశాలను పత్రికా స్వేచ్ఛగల దేశాలుగా ఫ్రీడం హౌస్ వర్గీకరించింది. 36 శాతంగా గల 70 దేశాలను పాక్షికంగా స్వేచ్ఛగల దేశాలుగా, మరో 64 దేశాలు స్వేచ్ఛలేని దేశాలుగా వర్గీకరించారు.
ప్రపంచంలో పత్రికా స్వేచ్ఛ అత్యంత అధ్వాన్నంగా ఉన్న ఎనిమిది దేశాలుగా బెలారస్, క్యూబా, గునియా, ఇరిటేరియా, ఇరాన్,ఉత్తర కొరియా, టుర్క్‌మినిస్థాన్, ఉజ్బెకిస్థాన్‌లను గుర్తించారు. ఈ దేశాలలో స్వతంత్రత గల పత్రికా వ్యవస్థ అసలు లేకపోవడమో, ఉన్నా పని చేయలేకపోవటమో జరుగుతున్నది. పత్రికలు పాలకుల వాణిగా చెలామణి కావడంతో పౌరులకు వాస్తవాలు తెలుసుకొనే అవకాశాలు మృగ్యం అవుతున్నాయ. జైలు, చిత్రహింసలు, ఇతర రకాలయిన అణచివేత చర్యల ద్వారా అసంతృప్తిని అణచివేస్తున్నారు. పత్రికలపై న్యాయపరంగా, భౌతికంగా ప్రభుత్వం జరిపే దాడులు తరచూ పతాక శీర్షికలలో కనిపిస్తుంటాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా పత్రికా స్వాతంత్య్రాన్ని హరించివేస్తున్నా అంతగా ప్రాధాన్యత లేకపోయినా మరి అనేక అంశాలు కూడా ఉన్నాయని పత్రికా స్వాతంత్య్రం ప్రాజెక్ట్ డైరెక్టర్ కరిన్ కార్లెకర్ పేర్కొన్నారు. క్షీణిస్తున్న జాతీయ ఆర్థిక వ్యవస్థలు స్వాతంత్య్రంకోసం పెనుగులాడుతున్న పత్రికలపై వినాశకర ప్రభావం చూపుతున్నాయి. పైగా మాదక ద్రవ్యాల వ్యాపారులు, ఉగ్రవాద బృందాలు సహితం పత్రికలను తొలచివేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రపంచంలో వార్తా పనులలో వైవిధ్యం పెరుగుతూ, రాజకీయ సమాచార మార్గాలు విస్తృతమవుతున్న తరుణంలో మొత్తంమీద పత్రికా స్వాతంత్య్రం తిరోగమన పథంలో ఉండటం విస్మయం కలిగిస్తున్నది. టెలివిజన్, పత్రికలు వంటి సాంప్రదాయ వార్తా వనరులను తీవ్రంగా అణచివేస్తున్న నియంత్రృత్వ వ్యవస్థలు నూతనంగా వ్యాప్తిచెందుతున్న డిజిటల్ రంగంలో ఆన్‌లైన్ సైట్‌లలో వ్యాప్తి చెందుతున్న రాజకీయ వ్యాఖ్యల పట్ల అప్రమత్తం అవుతున్నాయి. వాటిని సహితం అదుపుచేయడంకోసం విశేషంగా ప్రయత్నాలు చేస్తున్నాయి.
చైనా, రష్యా, ఇరాన్, వెనిజులా వంటి దేశాలల్లో చాలాకాలంగా నూతన పత్రికా రంగంపై గట్టి అదుపుకోసం ప్రయత్నిస్తున్నారు. పత్రికా విమర్శకులను నిర్బంధించడం, బ్లాగ్‌లను మూసివేయించడం, పాత్రికేయులపై పరువునష్టం దావాలు వేయడం చేస్తున్నారు. ఇంటర్‌నెట్ సమాచారంపై రష్యా 2012లో చేపట్టిన ఆంక్షలు మొత్తం యురే సియాపై ప్రభావం చూపుతున్నాయి. చైనాలో అధికారం చేపట్టిన నూతన కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం ఇంతవరకూ పత్రికా రంగంపై ఆంక్షలను సడలించే ధోరణి ప్రదర్శించడం లేదు. ప్రపంచంలోనే విస్తృతంగా పత్రికా ఆంక్షలు గల దేశంగా పేరొందిన చైనాలో అరెస్ట్‌లు, సెన్సార్‌షిప్‌ల ద్వారా వార్తా వనరులను అదుపుచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
గత ఐదు సంవత్సరాలలో పత్రికా స్వాతం త్య్రం మెరుగుపడిన దేశాల సంఖ్యకన్నా క్షీణించిన దేశాల సంఖ్య ఎక్కువగా ఉన్నది. పత్రికా స్వాతంత్య్రాన్ని అదుపుచేసే ప్రయత్నాలు విస్తృతంగా జరుగుతున్నాయని, పత్రికా వైవిధ్యం, సమాచారానికి వనరులు పెంపొందించడానికి ఎదురవుతున్న సవాళ్ళు తీవ్రంగా ఉన్నట్లు పత్రికా స్వాతంత్య్రం నివేదిక తెలుపుతుంది. ప్రపంచంలో అత్యధిక జనాభా గల చైనాలో పత్రికా స్వాతంత్య్రం లోపించడం ఆ తర్వాత ఎక్కువ జనాభా గల భారత్‌లో పాక్షికంగా మాత్రమే ఉండటంతో ప్రపంచ జనాభాలో మూడవవంతు మంది ప్రజలు ఇంకా పత్రికా స్వాతంత్య్రం పూర్తిగా పొందలేకపోతున్నారు.
సాంప్రదాయక వార్తల వనరులకు భిన్నంగా పౌరులే పాత్రికేయులుగా మారి నూతన వనరుల సహాయంతో సమాచార విస్తృతికోసం కృషిచేస్తున్నారు. 2012లో ఈ ధోరణులు బాగా పెరిగాయి. మైక్రోబ్లాగ్‌లు, ఆన్‌లైన్ సోషల్ నెట్‌వర్క్‌లు, మొబైల్ ఫోన్‌లు, ఇతర సాంకేతిక సమాచార సాధనాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. నూతన సైబర్ క్రైమ్ చట్టాలు, వెబ్ సమాచారాన్ని నిలిపివేయడం, బ్లాగ్‌లలో వ్రాసే వారిని అరెస్టుచేయడం, రాజకీయ సంక్షోభ సమయాలలో మొబైల్‌లలో ఎస్.ఎం.ఎస్‌లను నిషేధించడం వంటి పలు పద్ధతుల ద్వారా పలు ప్రభుత్వాలు నూతన మీడియాను సహితం నియంత్రించే ప్రయత్నాలు చేస్తున్నాయి.
రష్యా, వెనిజులా, యూనోడర్, ఉక్రెయిన్ వంటి దేశాలలో ప్రసార సాధనాలపై ప్రభుత్వ నియంత్రణ ఉండటంతో ఎన్నికల సమయంలో ప్రజలకు వాస్తవాలను తెలియచేయడంలో పత్రికలకు సాధ్యపడటంలేదు. దానికితోడు ప్రజలు సహితం అధికార పక్షంవైపు మొగ్గుచూపుతున్నారు. ఆర్మేనియా, జార్జియావంటి దేశాలలో పత్రికా స్వాతంత్య్రం కారణంగా ప్రతిపక్షాలు అధికారంలోకి రాగలిగాయని, జార్జియాలో శాంతియుతంగా అధికార మార్పిడి జరిగిందని ఈ నివేదిక పేర్కొన్నది. మాలి, గునియాలు మినహా మొత్తం మూడు పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో పత్రికా స్వాతంత్య్రం గణనీయంగా మెరుగుపడింది. సెనెగల్ తదితర దేశాలలో నూతన ప్రభుత్వాలు పత్రికా స్వాతంత్య్రాన్ని గౌరవిస్తూ అంతకుముందు పాలకులు పాత్రికేయులపై విధించిన పలు ఆంక్షలను సడలించాయ. పలు ప్రజాస్వామ్య దేశాలలో ఆర్థిక అంశాలు పత్రికా స్వాతంత్య్రాన్ని హరించి వేస్తున్నాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా సిబ్బందిని తగ్గించవలసి రావడం, కొన్ని పత్రికలను మూసివేయవలసి రావడం జరుగుతున్నది. దానివల్లనే వార్తలలో వైవిధ్యం తగ్గిపోతున్నది. ముఖ్యం గా గ్రీస్, స్పెయిన్‌లలో ఇటువంటి పరిణామాలు నెలకొన్నాయి.
అమెరికా ఖండంలో సహితం పత్రికా స్వాతంత్య్రం తిరోగమనంలో ఉన్నది. అర్జెంటీనియా, బ్రెజిల్ దేశాలు పత్రికా స్వాతం త్య్రం లేని దేశాల జాబితాలో చేరాయి. మెక్సికో ప్రపంచంలోనే పాత్రికేయులకు చాలా ప్రమాదకరమైన దేశంగా ఉండగా, క్యూబా, వెనిజులాల్లో ఆంక్షలు పెరిగాయి. అమెరికాలో పత్రికా స్వాతంత్య్రం పటిష్టంగా ఉన్నా ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారులు పాత్రికేయులకు తగు సమాచారం ఇవ్వడానికి పాక్షిక సుముఖత మాత్రమే వ్యక్తంచేస్తున్నారు. ఆసియా, పసిఫిక్ దేశాలలో ఉత్తర కొరియా చైనా, థాయిలాండ్, కంబోడియా, హాంగ్‌కాంగ్, మాల్దీవులు, శ్రీలంక, నేపాల్‌ల్లో పత్రికా స్వాతంత్య్రం ఆందోళనకరంగానే ఉన్నది. పత్రికా స్వాతంత్య్రంలో నార్వే, స్వీడన్ దేశాలకు మొదటి ర్యాంక్ లభించగా, భారతదేశానికి 80వ ర్యాంక్ లభించింది. జర్మనీకి 18, కెనడాకు 29, ఆస్ట్రేలియాకు 31, అమెరికాకు 26, ఫ్రాన్స్‌కు 36, ఈజిప్ట్‌కు 141, రష్యాకు176, చైనాకు 179, ఇరాన్‌కు 192 స్థానాలు ఈ నివేదికలో లభించాయి. ప్రపంచం మొత్తం మీద బర్మాలో నాటకీయ పరిణామాల ఫలితంగా పత్రికా స్వాతంత్య్రం గణనీయంగా మెరుగుపడింది. అరెస్టయిన బ్లాగ్‌ల రచయితలు, మీడియా జర్నలిస్ట్‌లను విడుదల చేయడంతో ప్రజలకు సమాచారం మరింత విస్తృతంగా లభిస్తున్నది. నియంతృత్వ దేశాలలో పాత్రికేయులు, వారి కుటుం బ సభ్యులు అణచివేతకు గురవుతుంటే, ప్రజాస్వామ్య దేశాలలో ఆర్థిక సమస్యలు, ఆర్థిక ప్రయోజనాలు పత్రికా స్వాతంత్య్రాన్ని ప్రభావితం చేస్తున్నాయి. తరచూ రాజకీయ సంక్షోభాలు సహితం పాత్రికేయులపై ఆంక్షలకు దారితీస్తున్నది. సంక్షోభకర పరిస్థితులలో స్వతంత్రంగా వార్తలు అందించడం దుర్లభమవుతున్నది. ప్రజాస్వామ్యం, సాం స్కృతికవికాసం, అభివృద్ధిలకు పత్రికా స్వాతంత్య్రం కీలకమైనదిగా గుర్తించాం. ప్రజల ప్రాథమిక మానవ హక్కుల పరిరక్షణలో సహితం పత్రికా స్వాతంత్య్రం కీలక పాత్ర పోషిస్తున్నది. అయితే పాలకుల ధోరణులు మాత్రం పత్రికా స్వాతంత్య్రం పట్ల అసహనంగా మారుతుండటం విచారకరం.
పత్రికా స్వేచ్ఛ పుష్కలంగా ఉన్న దేశాలలో నివశిస్తున్న ప్రజల సంఖ్య
english title:
p
Date:
Saturday, June 1, 2013