Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

చాప కింద నీరు..!

$
0
0

ఒకవైపు తెలంగాణ ఉద్యమం, మరోవైపు హిందుత్వ సెంటిమెంట్‌తో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ‘చాప కింద నీరులా..’ దూసుకుని పోవాలని యత్నిస్తున్నది. గత ఏడాది అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో మహబూబ్‌నగర్ స్థానాన్ని బిజెపి అభ్యర్థి యెన్నం శ్రీనివాస్ రెడ్డి విజయం సాధించడంతో ఆ పార్టీలో ఆత్మవిశ్వాసం పెరిగింది. దీనికి తోడు జూన్ 3న నాగర్ కర్నూలు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే డాక్టర్ నాగం జనార్ధన్ రెడ్డి బిజెపిలో చేరేందుకు రంగం సిద్ధమైంది. సుమారు 30 ఏళ్ళ పాటు తెలుగు దేశం పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకుని స్వతహాగా తెలంగాణ నగారా సమితిని ఏర్పాటు చేసుకున్న డాక్టర్ నాగం 3వ తేదీన నిజాం కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ఆ సమితిని బిజెపి జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ సమక్షంలో ఆ పార్టీలో విలీనం చేయనున్నారు. ‘ముందే కోయిల కూసింది’ అనే పాత సినిమాలోని పాటలా డాక్టర్ నాగం బిజెపిలో చేరక ముందే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌సభకు పోటీ చేయాలన్న తన అభిలాషను ఇప్పటికే ప్రకటించారు. బిజెపి క్రమ‘శిక్ష’ణ గురించి డాక్టర్ నాగంకు తెలియదు కాబోలు. ఒక దశలో డాక్టర్ నాగం టిఆర్‌ఎస్‌లో చేరుతారన్న ప్రచారం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్ర సాధన జరగాలంటే అది కేవలం బిజెపితోనే సాధ్యమని ఆయన భావించినట్టున్నారు. లోగడ బిజెపి సారధ్యంలోని ఎన్డీఏ కూటమి కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడే మూడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. ఆ నమ్మకంతోనే ఇప్పుడు డాక్టర్ నాగం బిజెపిలో చేరేందుకే సిద్ధమైనట్టున్నారు. డాక్టర్ నాగం ఎంతో నమ్మకంగా బిజెపిలోకి రానుండడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనపడుతున్నది. ప్రస్తుతం మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు వచ్చే లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో మహబూబ్‌నగర్ నుంచి పోటీ చేయకుండా మెదక్ లోక్‌సభ స్థానానికి మారతారన్న ప్రచారం జరుగుతున్నది. దీంతో మెదక్ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సినీ నటి విజయశాంతి అసంతృప్తితో ఉన్నారు. అదే జరిగితే విజయశాంతి కూడా బిజెపిలో చేరతారన్న ఊహగానాలూ ఉన్నాయి.
ఆ సంగతి ఎలా ఉన్నా కర్నాటక రాష్ట్ర అసెంబ్లీకి ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి చావు దెబ్బ తిని అధికారాన్ని కోల్పోయింది. దీంతో పార్టీ అగ్ర నాయకత్వం దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్ వైపు దృష్టి సారించింది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉన్నందున ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేయాలన్న భావనతో, పట్టుదలతో ఉంది. ఆంధ్ర ప్రదేశ్‌లో సీమాంధ్రలో పార్టీ బలంగా లేకపోయినప్పటికీ, తెలంగాణ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేసుకోవడానికి మార్గాలు ఉన్నాయని భావిస్తోంది. ఒకటి: తెలంగాణ సెంటిమెంట్, రెండు: హిందుత్వ నినాదం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ అధిష్ఠానం, కేంద్ర ప్రభుత్వం విఫలమయ్యాయని, తాము అధికారంలోకి రాగానే వంద రోజుల్లోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామన్న నమ్మకాన్ని తెలంగాణ ప్రజల్లో కల్పించాలని భావిస్తోంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు...చందంగా ఒకేసారి మూడు పార్టీలపై విరుచుకుపడాలని బిజెపి వ్యూహ రచన చేస్తున్నది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ అధిష్ఠానం, కేంద్ర ప్రభుత్వం విఫలమయ్యాయని, నాడు ఎన్టీఏ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకుండా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు అడ్డుపడ్డారని, తెలంగాణ రాష్ట్ర సమితికి తెలంగాణ విషయంలో చిత్తశుద్ధి లేదని, కేవలం ఎన్నికల్లో లబ్ది పొందాలన్న ఆలోచనతో ఉన్నదని, ఇతర పార్టీలను చీల్చడమే లక్ష్యంగా పెట్టుకున్నదని విమర్శల బాణాలు ఎక్కుపెట్టనున్నది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కేవలం బిజెపితోనే సాధ్యమని ప్రజలకు విశ్వాసం కల్పించడంతో పాటు హిందుత్వ సెంటిమెంట్‌ను బలంగా వాడుకోవడాలన్న ఆలోచనతో బిజెపి ఉన్నది. తెలంగాణ ప్రాంతంలో 119 అసెంబ్లీ స్థానాల్లో సుమారు 50 స్థానాల్లో ముస్లిం, మైనారిటీల ప్రాబల్యం ఉన్నది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో హిందుత్వ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఒక వర్గాన్ని తమ వైపు ఆకర్షితులను చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్న ఆలోచనతో ఉన్నది. మహబూబ్‌నగర్ అసెంబ్లీ సెగ్మెంట్‌కు జరిగిన ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్ విజయం సాధిస్తుందన్న అందరి అంచనాలు తారుమారయ్యాయి. బిజెపి నిశ్శబ్దంగా, హిందుత్వ సెంటిమెంట్‌ను ప్రయోగించడంతో పాటు, తెలంగాణ అంశంతో ముందుకు వెళ్ళింది. టిఆర్‌ఎస్, కాంగ్రెస్, టిడిపి ఓట్ల చీలికతో బిజెపి లాభపడింది. భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లోనూ ఇదే రకమైన వ్యూహంతో ప్రజల్లోకి వెళ్ళాలని బిజెపి నాయకత్వం భావిస్తోంది. రాష్ట్రంలో వచ్చే ఎన్నికలతోనే అధికారంలోకి రాలేకపోయినా, పూర్వ వైభవం సంతరించుకుని రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటులో నిర్ణయాత్మక శక్తిగానైనా ఉంటామని బిజెపి నాయకత్వం విశ్వసిస్తున్నది. బిజెపి రాష్ట్ర శాఖను పటిష్టవంతం చేయడంలో భాగంగానే పార్టీ జాతీయ కార్యవర్గంలో రాష్ట్ర నాయకులకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తోంది. తాజాగా పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయకు స్థానం కల్పించింది. ఇటీవల పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మురళీధర్‌రావును నియమించింది. అంతకు ముందే పార్టీ అధికార ప్రతినిధిగా నిర్మలా సీతారామన్ ఉన్నారు. కార్యవర్గంలోనూ కె. శాంతారెడ్డి, సోము వీర్రాజు, కె. లక్ష్మణ్, పి. చంద్రశేఖర్, క్రమశిక్షణా సంఘం సభ్యునిగా హరిబాబు ప్రభృతులకు స్థానం లభించింది. పార్టీ జాతీయ రాజకీయాల్లో ఎం. వెంకయ్య నాయుడు కీలక పాత్ర పోషిస్తున్నారు. బిజెపి అధినాయకత్వం ఎత్తుగడ ఎంత వరకు పార్టీకి ఉపకరిస్తుందో వేచి చూడాల్సిందే.

ఒకవైపు తెలంగాణ ఉద్యమం, మరోవైపు హిందుత్వ సెంటిమెంట్‌తో రాష్ట్రంలో
english title: 
c
author: 
- వీరన్నగారి ఈశ్వర్ రెడ్డి

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>