స్ర్తిలపై జరుగుతున్న వరుస అత్యాచారాలు ప్రజల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నిర్భయ చట్టం చేసినా మృగాళ్ళు రెచ్చిపోతూనే వున్నారు. దేశరాజధాని ఢిల్లీలోనే ఇలా ఉంటే దేశానికి అవమానం కాదా? భారత స్ర్తిల పట్ల మనం వ్యవహరించే తీరు ఇదేనా? ఈ దురాగతాన్ని ప్రభుత్వాల ఉదాసీనతను యావత్ దేశం ఖండించాలి. చెప్పడానికి కూడా సిగ్గుపడే హేయమైన, నీచమైన చర్య. కానీ మన నాయకులు మాత్రం... అలా జరగడం దురదృష్టం. అలా జరగకుండా ఉండవలసింది, వంటి మాటలు తప్ప చేసిందేమీ లేదు. స్ర్తికి కనీస రక్షణ కల్పించడంలో సర్కారు ఘోరంగా విఫలమైంది. ఎక్కడ చూసినా బాలికల మీద హత్యాచారాలే. దేశమంతా ఆందోళనలతో అట్టుడికిపోతుంటే, కనీసం మన నాయకులు పెదవి విప్పకపోవడం బాధాకరం. చట్టాలలో లొసుగులు, నేరగాళ్లకు వరంగా మారాయి. నిర్భయ అత్యాచారం తర్వాత ఇలా జరగకుండా చూసుకుంటామని చెప్పిన కేంద్ర హోంమంత్రి ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెబుతారు? సోనియాగాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ఆడవాళ్లేగదా. అమానుషంగా ప్రవర్తించే ఈ మానవ మృగాల పట్ల ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని భారత ప్రజలు ఎదురుచూస్తున్నారు.
- వులాపు బాలకేశవులు, గిద్దలూరు
అర్హులకే అవకాశమివ్వాలి
ప్రభుత్వంలోని అధికారులకు అవగాహన, చొరవ వుండాలి, వారి సూచనలు పాటించే హృదయ సంస్కారం రాజకీయ పాలనా వ్యవస్థకుండాలి. తాత్కాలిక అధ్యాపకులను గాని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కాని అత్యవసరమై తీసుకున్నప్పుడు ఓపెన్‌గా అందరితోపాటు అవసరమైన విధంగా ఇంటర్వ్యూలు జరిపి అర్హులను క్రమబద్ధీకరించడం సరైన పద్ధతి. అంతే తప్ప చేస్తున్న వారిని కొనసాగిస్తామని గుడ్డిగా ప్రతిపాదిస్తే ఔట్‌సోర్సింగ్ షార్టకట్ సోర్స్ ఆఫ్ జాబ్‌గా మార్తుంది.
- వి.ఆర్.ఆర్.ఎ.రాజు, వరంగల్
కల్యాణమస్తును పునః ప్రారంభించాలి
పేద, మధ్యతరగతి ప్రజలకు తమ పిల్లలకు వివాహం చేయడం తలకు మించిన భారంగా మారిన తరుణంలో వై.యస్ హయాంలో టి.టి.డి కల్యాణమస్తు కార్యక్రమం ప్రారంభించి ఉచిత సామూహిక వివాహాలను నిర్వహించింది. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరుని పాదాల చెంత వుంచిన మంగళ సూత్రాలను, నూతన వస్త్రాలను వధూవరులకు అందించి, ఒక సుమూహూర్తంలో లక్షలాది జటలను ఒక్కటిగా చేసిన ఆ కార్యక్రమం అపూర్వం,అద్వితీయం, అసామాన్యం. కాలక్రమేణా ఆ కార్యక్రమానికి టి.టి.డి మంగళం పాడేయడం విచారకరం. ప్రజాహితం కోరే ఇటువంటి కార్యక్రమాలకు మరింత ఊతం ఇవ్వాల్సిన అవసరం వుంది. తక్షణం కల్యాణమస్తు కార్యక్రమాన్ని పునఃప్రారంభించవల్సిందిగా టి.టి.డికి విజ్ఞప్తి!!
- సి.ప్రతాప్, విశాఖపట్నం
మూగజీవాల అకాల మరణాలు అరిష్టం
సింహాచల పుణ్యక్షేత్ర ‘గోవుల సంరక్షణశాల’ యందు జరిగిన విపత్కర పరిస్థితి గుండెను పిండేస్తున్నది. ఒకే పర్యాయం గోవులు, లేగ దొడలు మృత్యువాత పడటం శోచనీయం! కార్యనిర్వాహకుల అశ్రద్ధవలన ఇటువంటి విషాదాంత స్థితి ఏర్పడిందని సందేహాలు కోకొల్లలుగా వినిపిస్తున్నాయి! ఏదైనా విషతుల్యమైన ఆహారం వల్లనా? వాతావరణ పరిస్థితుల వల్లనా? ఏది ఏమైనా మూగ జీవాల మరణం శోక సముద్రంలో ముంచేస్తున్నది. మన ఆర్య ఆగమ శాస్త్రం ప్రకారం రాబోవు అనిష్ట కాలానికి యిది నాందిగా పరిగణిస్తుందా? అన్న సందేహం పండితులకు ఆగమశాస్త్ర ప్రవీణులకు కలుగుతోంది.
- కోవూరు వెంకటేశ్వరప్రసాదరావు, కందుకూరు
ఇదెక్కడి చోద్యం?
ఆంధ్రప్రదేశ్‌లో అగ్ర కులంగా ఉన్న ఒక ‘‘ప్రముఖ’’ కుల నాయకులు తమ కులాన్ని బి.సిలో చేర్చాలని డిమాండ్ చెయ్యటం చాలా దారుణం. ఎందుకంటే ఇప్పటికేవారు అన్ని రంగాలలోను అభివృద్ధి చెందారు. ఏ వృత్తి వ్యాపకాల్లోనైనా వారే అగ్రగామిగా ఉన్నారు. రాష్టప్రతి, ప్రధాని, ముఖ్యమంత్రి పదవులు వారికి రానంత మాత్రాన వారు ఇతరులకంటే ఎలా వెనుకబడినట్లు? ఈ కులాన్ని బి.సిలో చేరిస్తే గ్రామస్థాయిలో కూడా అభివృద్ధి ఎరుగని కులాల్ని ఎస్‌సి, ఎస్‌టిలలో చేర్చాలి కదా!
- కొసనా మధుసూధనరావు, అమలాపురం
మీ తప్పు తెలుసుకోండి
కర్నాటకం అవినీతి మయం అని మన్మోహన్ సింగ్ విమర్శించడం గురివిందను తలపింపజేస్తున్నది. ఎడ్యూరప్పని పదవి నుంచి తొలగించడం లాంటి పనులు చేస్తున్నది భాజపా. కాని కేంద్రంలో అవినీతి మంత్రులు రాజీనామా చెయ్యం అంటున్నారు. 2జి, కోల్‌గేటు నేరుగా ప్రధాని మెడకు చుట్టుకున్నా ఆయన వౌనం వహిస్తూ ఇప్పుడు కర్నాటకంలో సుద్దులు చెప్పడం ఏం సబబు?
- శుభ, కాకినాడ
స్ర్తిలపై జరుగుతున్న వరుస అత్యాచారాలు ప్రజల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
english title:
m
Date:
Saturday, June 1, 2013